జీవితానికి పట్టిన జైలు వాసన

Peter Hobbs In The Orchard The Swallows - Sakshi

కొత్త బంగారం

పేరుండని 14 ఏళ్ళ ‘అతను’ ఉత్తర పాకిస్తాన్‌లో ఒక రోజు ‘జల్దారు పళ్ళ ట్రే పక్కన నిలుచున్న సబాను’ చూస్తాడు. ‘పళ్ళ రంగు ఆమె తెల్ల సిల్కు దుపట్టాపైన ప్రతిఫలితమయింది’ అంటాడు. సబా స్థానిక రాజకీయవేత్త కూతురు. తమ ఆర్థిక తారతమ్యాలని నిర్లక్ష్యపెట్టి ఇద్దరూ కలిసి దానిమ్మ తోటకి వెళ్తారు. ఆ సాయంత్రం అమాయకంగా గడుస్తుంది. పిల్లలూ చిన్నవారే. కానీ, ‘శిక్షించబడ్డానికి కాక మరచిపోబడ్డానికి’ అతన్ని జైల్లో పెట్టిస్తాడు సబా తండ్రి. ఉత్తమ పురుష కథనంతో ఉండే ‘ఇన్‌ ద ఓర్చర్డ్, ద స్వాలోస్‌’ నవల ఇది. ఖైదుకి ఒక నగ్నత్వం ఉంది. మనలో ఏ భాగం దాచబడదు’ అనుకున్న అతను– తన బాల్యాన్నీ కౌమారదశనీ కోల్పోయి, ఆ నిర్బంధంలో లైంగిక దాడులను భరిస్తూ, పోషకాహారం లేకుండా 15 ఏళ్ళుంటాడు. తాజా గాలి లేని ఆ జైలు కిక్కిరిసి ఉంటుంది. ‘దీని వాసన నా ఎండిన గొంతుకు పట్టేసింది. నా శరీర భాగాలన్నిటిలోకీ చొచ్చుకుపోయింది. సమయం గడిచేగొద్దీ అలవాటైపోయింది తప్ప యీ వాసనను మరవడం అసాధ్యం’ అంటాడు.

‘సబా, అప్పటికి మనమింకా పిల్లలమే. పెద్దవారి లోకానికుండే ఎల్లలు మనకి తెలియవు. లోకానికి గోడలూ ఊచలూ ఉన్నాయనీ, మనుష్యులు విభజింపబడి ఉన్నారనీ ఎరుక లేదు... ప్రేమని పంచుకోవాలి. లేకపోతే అది పిచ్చితనం అవుతుంది’ అన్నవంటి ఉత్తరాలు రాస్తూ గడుపుతాడు. తను ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించాడో లేదో కూడా తెలియదతనికి. సబాకూడా తనని మరిచిపోయి ఉంటుందని అనుకుంటాడు. అయితే, పాకిస్తాన్‌ జైళ్ళ క్రూరత్వాన్ని భరించేందుకు ఆ జ్ఞాపకాలనే సజీవంగా ఉంచుకుంటాడు. మానసికంగా, భౌతికంగా విరిగి, వంగిపోయి, నడవటం కూడా కష్టమయే స్థితిలో– సగం చచ్చి ఉన్న అతనికి 29 ఏళ్ళు వచ్చినప్పుడు, జైలు నుండి రోడ్డుమీదకి గెంటేస్తారు.

అతన్ని బతికించడానికి దోహదపడినది ‘రాసేందుకు నా వద్ద ఇంక పద్యాలేవీ లేవు’ అనే రిటైర్‌ అయిన ‘ప్రభుత్వ కవి’ అబ్బాస్‌ నిస్వార్థసేవే. అతను తన పల్లె చేరుతాడు. రూపురేఖలు మారిపోయిన తన్ని ఎవరూ గుర్తించక పోయినప్పుడు, ‘ఒకానొకప్పుడు కుర్రాడినైన నేను ఇప్పుడు నాకే అపరిచితుడిని. ఒక మనిషిని మార్చేయడానికి ఘోరమైన పరిస్థుతులు చాలేమో!’ అనుకుంటాడు. కథకుని కుటుంబ సభ్యులూ, సబా అక్కడ ఉండరు. తండ్రి తోట ఇప్పుడింకెవరిదో అయి, పాడుబడి ఉంటుంది. రోజూ ఆ తోటలవైపు నడిచి సీమ పక్షుల కోసం ఎదురు చూస్తూ, ‘గాలిలో చిట్టి అద్భుతాలలా అవెంత చురుకైనవో! ఎంత అద్భుతంగా వరుసలు కడ్తాయో!’ అనుకుంటాడు.

వంచించబడిన జీవితాలు గుర్తించబడకుండానే ఎలా గడిచిపోతాయోనన్న చక్కటి వర్ణనలుండే యీ నవలిక మానవ çహృదయానికుండే అపారమైన తాళిమి గురించి చెప్తుంది. ఏ నిర్దిష్టమైన ముగింపూ లేని పుస్తకపు చివర్న, పాకిస్తానీ సమాజంలో హెచ్చవుతున్న ఇస్లామిక్‌ సనాతన వాదాన్ని– బ్రిటిష్‌ రచయిత పీటర్‌ హాబ్స్‌ ఎంతో నిగ్రహంతో చిత్రిస్తారు. రెండు పేజీల్లో ఉండే తాలిబాన్, 9/11 గురించిన ఉదహరింపులు తప్ప, తన యీ కల్పిత ప్రపంచంలో రాజకీయ వివరాలు చొప్పించరు. రచయితకు ఎన్నో ఏళ్ళ కిందట పాకిస్తాన్లో ఉన్న బ్రిటిష్‌ ఫారిన్‌ ఆఫీసులో ఉద్యోగం వచ్చినప్పుడు, అక్కడ చేరకుండా ఆయన ఉత్తర పాకిస్తానంతా తిరిగారు. పాకిస్తాన్లో జరిగిన సంఘటనల నిజానిజాలని సరిచూడమని ఆయన తన పాకిస్తానీ స్నేహితుడిని అడిగిన తరువాతే పుస్తకాన్ని అచ్చుకిచ్చారు. ‘ఉత్తర పాకిస్తాన్‌ శిథిలమవుతున్న కఠోరమైన ప్రాంతం’ అంటారు హాబ్స్‌. స్పష్టమైన వచనం ఉన్న యీ పుస్తకాన్ని 2012లో ప్రచురించినది, అనాన్సీ ప్రెస్‌.
 కృష్ణ వేణి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top