మిస్టరీ ట్రెయిన్‌

Paula Hawkins The Girl On The Train - Sakshi

కొత్త బంగారం

మర్నాడు ఎటూ అన్నీ మరచిపోతుందని భర్త తనను నమ్మించినవన్నీ కూడా అబద్ధాలే అని గ్రహిస్తుంది రేచెల్‌.
‘ఇవ్వాళ శుక్రవారం. ట్రెయిన్‌లో తాగడంలో తప్పేమీ కాదు’ అని తన్ని తాను సమర్థించుకుంటూ– బ్యాగులో జిన్, టానిక్‌ కలిపిన నాలుగు క్యాన్లని పడేసుకుంటుంది 32 యేళ్ళ రేచెల్‌. తన ఇంటినీ, భర్త టామ్‌నూ, ఉద్యోగాన్నీ– తాగుడువల్ల పోగొట్టుకున్న యువతి ఆమె. అయినప్పటికీ, రోజూ అలవాటుగా తనింటినుంచి లండన్‌కు వెళ్ళే రైల్లో ప్రయాణిస్తుంటుంది. తన పాతింటి వద్ద రైలు ఆగినప్పుడు, టామ్‌ రెండవ భార్యను మనసులోనే వెటకరిస్తుంది: ‘నేను కొన్న ఫర్నిచర్‌ మధ్య, ఏళ్ళపాటు నేను అతనితో పంచుకున్న మంచంమీద, టామ్‌తో కలిసి పడుకోవడం ఎలా అనిపిస్తోంది ఏనా?’ తను తాగున్నప్పుడు, రాత్రిళ్ళు టామ్‌ను ఫోన్లో విసిగిçస్తుంటుంది. మర్నాడు ఎటూ అన్నీ మరచిపోతుందని అతను తన్ను నమ్మించినవన్నీ కూడా అబద్ధాలే అని గ్రహిస్తుంది. తన సహోద్యోగినులతో పెట్టుకున్న లైంగిక సంబంధాలవల్ల టామ్‌ను ఉద్యోగం నుండి తీసేశారని తెలుసుకుంటుంది.

తన జ్ఞాపకాలని తప్పించుకోడానికి ఇతరుల జీవితాలను ఊహించుకునే ప్రయత్నంలో, అదే వీధిలో ఉండే ఒక జంటని ఇష్టంగా చూస్తూ, వారికి ‘జెస్, జేసన్‌’ అనే పేర్లు పెట్టుకుంటుంది. ఒకరోజు జెస్‌ అనుకున్న ‘మేగన్‌’, పరాయి పురుషుడిని ముద్దు పెట్టుకోవడం చూసినప్పుడు, ఆమె భర్తను మోసం చేస్తున్నందుకు కోపం తెచ్చుకుంటుంది. ఆ తరువాత, మేగన్‌ కనబడకుండా పోతుంది. అప్పుడు, ‘ఎంతోకాలం తరువాత నా దుఃఖం పైనే కాక, నేను ఆసక్తి పెంచుకున్నది దీనిమీదే’ అనుకున్న రేచెల్,  పోలీసుల పరిశోధనలో జోక్యం కలిగించుకుంటుంది.  నిజానికి–మేగన్, జేసన్‌ అనే స్కాట్‌ను పెళ్ళి చేసుకోవడానికి ముందు, ఆమె మొదటి వివాహం వల్ల కలిగిన కూతురు బాత్‌ టబ్బులో పడి మరణిస్తుంది. ఆ తరువాత, తనలో కలిగిన శూన్యాన్ని నింపడానికి, మేగన్‌ ‘స్కాట్‌ను ప్రేమిస్తాను కానీ అది సరిపోదు నాకు’ అంటూ, వివాహేతర సంబంధాలు ప్రారంభిస్తుంది. వాళ్ళల్లో టామ్‌ ఒకరు. గర్భవతి అయినప్పుడు, పుట్టబోయే బిడ్డకి తండ్రి అతనే అని చెప్పినప్పుడు, మేగన్‌ను టామ్‌ హత్య చేస్తాడు.

మొదట్లో అనేకమందిని అనుమానించిన రేచెల్‌ నిజం తెలుసుకుని, పాత ఇంటికి వెళ్ళి ఏనాతో విషయం చెప్తుంది.  వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా టామ్‌ వస్తాడు. ఇద్దరూ అతన్ని మేగన్‌ గురించి నిలదీసినప్పుడు, తానే ఆమెను హత్య చేశానని ఒప్పుకుంటాడు. రేచెల్‌ అతన్ని కార్క్‌– స్క్రూతో పొడుస్తుంది. అతను చనిపోయాడని నిర్ధారించుకోడానికి, ఏనా దాన్ని మరింత లోతుగా తిప్పుతుంది. ఇద్దరూ కూడబలుక్కుని, పోలీసులకి అబద్ధం చెప్తారు. ‘ఏ పనీ లేకుండా ట్రెయిన్‌లో ఇటూ అటూ తిరిగే యువతిని కానింక’ అని తాగుడు వదిలించుకుని, జ్ఞాపకాలతో రాజీ పడుతుంది రేచెల్‌. రచయిత్రి పౌలా హాకిన్స్‌ తొలి నవల ‘ద గర్ల్‌ ఆన్‌ ద ట్రెయిన్‌’ అభద్రతా భావం, అస్పష్టత, నిస్పృహ ఉండే ముగ్గురు స్త్రీ పాత్రల దృష్టికోణాలతో రాయబడినది. కథలో మలుపులు అనేకం. అసలు సంగతి తెలియక, కేవలం మొహాలు చూసి అవతలివారి గురించి చేరిన నిర్ణయాలు ఎంత తప్పుగా పరిణమిస్తాయో చెబుతుందీ నవల. రచయిత్రి– దృష్టికోణాలనూ, కాలస్థాయిలనూ నేర్పుగా మార్చి రాస్తారు. నవల్లో పాత్రలు ఎక్కువున్నందువల్ల, అర్థం చేసుకోడానికి మాత్రం ఆగి, ఆగి చదవాల్సి వస్తుంది.‘రివర్‌ హెడ్‌ బుక్స్‌’ 2015లో పబ్లిష్‌ చేసిన ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో సినిమా కూడా వచ్చింది. ఆడియో పుస్తకం ఉంది.   
కృష్ణ వేణి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top