చిన్నసాయం.. పెద్దమనసు | One day fund donation to kerala | Sakshi
Sakshi News home page

చిన్నసాయం.. పెద్దమనసు

Sep 10 2018 12:41 AM | Updated on Sep 10 2018 12:41 AM

One day fund donation to kerala - Sakshi

కేరళ వరద బాధితులకు పంపించేందుకు తమ ఒక రోజు జీతానికి సమానమైన ఖర్చుతో చెప్పులు తయారు చేస్తున్న జార్ఘండ్‌లోని బాలి ఫుట్‌వేర్‌ కంపెనీ మహిళా కార్మికులు.

కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో వేలాది జీవితాలు కొట్టుకుపోయాయి. బతికి బట్టకట్టిన వారికి జీవనం ప్రశ్నార్థకమైంది. ఆ భీకర ప్రకృతి విలయం.. దైనందిన జీవితాల్లో కల్లోలం రేపింది. దేశానికి దక్షిణంలో వచ్చిన ఆ వరదల తాకిడి తూర్పున ఉన్న జార్ఖండ్‌ మహిళలను కదిలించింది!

దేశవ్యాప్తంగా.. చేతినిండా డబ్బున్న వాళ్లు ఆర్థిక సాయం చేస్తున్నారు. రోజు కూలితో జీవించే తమకు అంతంత డబ్బు జమ చేయడం సాధ్యమైన పని కాదు. ఆ డబ్బును బాధితులకు పంపించడం ఎలాగో కూడా చేతకాదు.  అయినా సరే.. తాము చేయగలిగిన ఉడుత సాయమైనా చేయాలనుకున్నారు జార్ఖండ్‌ మహిళలు. తాము తయారు చేస్తున్న చెప్పులతోనే కేరళ వరద బాధితుల కాళ్లకు రక్షణ కల్పించినా చాలనుకున్నారు. అంతే. వెయ్యి జతల రబ్బరు స్లిప్పర్స్‌తో ఓ లారీ జార్ఖండ్‌ నుంచి బయలుదేరింది.

దాయాలన్నా దాగని సాయం!
జార్ఖండ్‌ రాష్ట్రం, దుమ్కా జిల్లాలో బాలిజోర్‌ గ్రామం. ఆ గ్రామంలో మూడు వందల మంది మహిళలు బాలి ఫుట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తారు. వారికి రోజు కూలి 250 రూపాయలు. ఒక రోజు వేతనాన్ని వరద బాధితులకు సహాయంగా ఇవ్వాలనుకున్నారు. ఆ వేతనానికి వచ్చినన్ని చెప్పుల జతలను సహాయార్థం సమకూర్చారు. వాళ్లు తయారు చేస్తున్న ఫుట్‌వేర్‌ కంపెనీలో ఒక చెప్పుల జత ఖర్చు 70 రూపాయలవుతుంది.

శ్రామికుల వేతనం కాకుండా కేవలం మెటీరియల్‌ ఇతర ఖర్చులు మాత్రమే. మొత్తం 75 వేల రూపాయల డబ్బుతో వెయ్యి జతల చెప్పులను కేరళకు పంపించారు. నిజానికి ఈ మహిళలు పేరు కోసం తాపత్రయపడకుండా నిస్వార్థంగా సహాయం చేశారు. కానీ సహాయం పొందిన వాళ్లకు తమకు సహాయం చేసిన వాళ్ల ఊరి పేరును చెప్పులే చెబుతున్నాయి. బాలిజోర్‌ పేరు మీదనే బాలి ఫుట్‌వేర్‌ కంపెనీకి ఆ పేరు పెట్టారు.

ఉన్నదాంట్లోనే కొంత ‘రిలీఫ్‌’
‘‘కేరళలో ఇలా జరిగిందని వార్తల్లో చూసి తెలుసుకున్నాం. ‘ఎంత ఘోరం, వాళ్ల పరిస్థితి ఏమిటి, తిరిగి వాళ్ల బతుకులు తేరుకునేదెలా’ అని పనిచేస్తూ మాట్లాడుకునే వాళ్లం. పెద్దవాళ్లు ఎవరెవరు ఎంత సహాయం చేస్తున్నారో కూడా మా కబుర్లలో తెలుస్తుండేది. రిలీఫ్‌ ఫండ్‌కి డబ్బు ఇచ్చేటంత పెద్ద ఉద్యోగులం కాదు. రోజుకు 250 రూపాయలు వస్తే... అందులోనే ఇంట్లో తిండి గడవాలి, కొంత దాచుకోవాలి.

మేమే పేదవాళ్లం, మాదే పేదరికం అనుకుంటుంటే, వరదల్లో సర్వం కోల్పోయిన వాళ్ల పరిస్థితి ఇంకా దారుణం కదా. వాళ్లు మా కంటే దయనీయమైన స్థితిలో ఉన్నారు. అందుకే మనం తయారు చేస్తున్న చెప్పులనే వారికిద్దామని అందరం ఒక్కమాట మీదకు వచ్చాం. మా కంపెనీకి మెటీరియల్‌ ఇచ్చే అధికారులతో ఇదే మాట చెప్పాం. చెప్పులను వరద బాధితులకు పంపే ఏర్పాట్లు జిల్లా అధికారులే చేశారు’’ అని  చెప్పింది బాలి చెప్పుల కంపెనీలో పనిచేస్తున్న మిథియా తాదు. ఆ కార్మికుల్లో చురుకైన మిథియా, మంజుదేవి, మోనికా తాదుతోపాటు మిగిలిన వాళ్లంతా ముందుకొచ్చారు. దాంతో కేరళకు సాయం అందింది.

సమాజం స్వార్థపూరితంగా మారిపోయింది, మనుషుల్లో మానవత్వం లోపించింది, కాఠిన్యం రాజ్యమేలుతోంది... ఇలా ఎన్నో మాటలు  వింటుంటాం. ఇన్నింటి మధ్య కూడా ఎదుటి వారికి కష్టం వస్తే అది తమ కష్టంగా స్పందించే సున్నితమైన మనసులు, చలించే స్నేహపూరిత హృదయాలు ఉన్నాయి. మరేం ఫర్వాలేదు.. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది అనే భరోసానిస్తున్నారు ఈ మహిళలు.

– మంజీర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement