
దేశీ నాన్‌లెదర్ ఫుట్‌వేర్ రంగంలో పెట్టుబడులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు లెదర్ ఎగుమతుల మండలి(సీఎల్‌ఈ) చైర్మన్ ఆర్‌కే జలాన్ పేర్కొన్నారు. ప్రధానంగా తైవాన్, వియత్నాం కంపెనీలు ముందున్నట్లు తెలియజేశారు. అయితే ఇందుకు ప్రభుత్వ మద్దతు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. తైవాన్, వియత్నాం దేశాల సంస్థలు చైనా తదితర దేశాల నుంచి షూ సోల్స్, మౌల్డ్స్, మెషీనరీ, ఫ్యాబ్రిక్స్ తదితర ప్రొడక్టులను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
వెరసి ఈ రెండు దేశాల కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలియజేశారు. ఆయా సంస్థలకు మద్దతిస్తే తయారీకి అవసరమయ్యే నాన్‌లెదర్ సంబంధ ఫుట్‌వేర్ ప్రొడక్టులను సులభంగా దిగుమతి చేసుకోగలుగుతాయని వివరించారు. భారత్ నుంచి పటిష్టస్థాయిలో ఎగుమతులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
గతేడాది(2024–25) 5.75 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదైనట్లు ప్రస్తావించారు. వీటిలో యూఎస్‌కు అత్యధికంగా 95.7 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని, వీటి వాటా 20 శాతమని తెలియజేశారు. తదుపరి 11 శాతం వాటాతో యూకే, జర్మనీ నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తే ఎగుమతులు పుంజుకోవడంతోపాటు.. మరింత ఉద్యోగ కల్పనకు వీలుంటుందని వివరించారు.