పదములే చాలవు...  భామా! 

New fashion show  - Sakshi

ఫ్యాషన్‌

ఇండోవెస్ట్రన్‌ అయినాఇంటింటి వేడుకైనా తల నుండి పాదం వరకు ఒకే కాంబినేషఒకే థీమ్‌ ఆభరణాలు అలంకరణలో చేరితే ఆ రూపాన్ని వర్ణించడానికి పదములే చాలవు

సాయంకాలం షికారుకు వెళ్లాలన్నా, సంప్రదాయ వేడుకైనా ఆభరణాలు ధరించే దుస్తులకు సరిపోయేలా ఉన్నాయో లేవో సరి చూసుకోవడం అనేది తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆభరణాలతో పాటు ఇతర అలంకరణ వస్తువులన్నీ ఒకే థీమ్‌తో ఉండేలా జాగ్రత్త తీసుకునే టైమ్‌ వచ్చేసింది. అదే ఇప్పుడు ట్రెండ్‌ అయ్యింది. 

పాపిట బిళ్ల నుంచి పాదం వరకు 
ముత్యాలు, రత్నాలు, కుందన్స్, పూసలు.. ఆభరణమేదైనా పాపిట్లో అలంకరించిన నగమాదిరే పాదరక్షల డిజైన్‌ కూడా ఉండాలి. అదెలా?! అనే వారికి ఇప్పుడీ డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి.  చెవి జూకాలు – చెప్పుల డిజైన్‌ ఒకేలా ఉంటే అదీ ఓ స్టైల్‌.  కాలి పట్టీల రాళ్ల డిజైన్‌తో పోటీ పడే షూ ఉంటే ఆ కాలి అందం ఎన్నింతలు పెరుగునో అని మగువలు మురిసిపోవచ్చు. చేతి గాజులు – కాలి చెప్పుల డిజైన్‌తో జత కలిస్తే ధరించే దుస్తుల అందం రెట్టింపు అవకుండా ఉంటుందా! అనుకున్నారేమో అందమైన కాంబినేషన్‌గా జత కట్టేశారు.  మెడలో హారం రంగు కాలి చెప్పుల రంగు ఒకేలా కాంతులీనుతుంటే! ఆ చెప్పుల మీదుగా పారాడే చీర అంచు డిజైన్‌ వాటితో పోటీపడుతుంటే నిలువెత్తు అందం నడిచివచ్చినట్టే! ముక్కుబేసరి పెట్టుకుంటేనే ముఖకాంతి పండువెన్నెల పోటీపడుతుంది. ఇక బేసరితో పోటీ పడేలా చెప్పుల జత కూడా తోడైతే మేలి ముసుగులో వధువు మెరిసిపోకుండా ఉండగలదా అనేది డిజైనర్స్‌ చెబుతున్న మాట. 

ఇన్ని డిజైనర్‌ అలంకరణతో పాటు వీటితో జత కలిసే హ్యాండ్‌ బ్యాగ్‌ లేదా క్లచ్‌ మరో అదనపు ఆకర్షణను నింపుతుంది. అలంకరణ వస్తువులన్నీ మ్యాచ్‌ చేయాలంటే అందుకే సమయం పడుతుంది. పైగా అన్నీ ఒకేలా దొరుకుతాయన్న గ్యారంటీ ఉండదు. ఇలా అన్నీ ఒకే థీమ్‌తో లభించే ఆభరణాలు, అలంకరణ వస్తువుల డిజైన్, నాణ్యతలను బట్టి ధరలు ఉన్నాయి.వెస్ట్రన్‌స్టైల్‌ నుంచి మన సంప్రదాయ దుస్తులకూ ఈ ట్రెండ్‌ అనుకరణ వచ్చింది. డ్రెస్‌లో ఒక ముఖ్యమైన డిజైన్‌ ప్యాటర్న్‌ తీసుకొని దానికి తగ్గట్టుగా చెప్పులు, బ్యాగ్, బ్యాంగిల్‌.. ఇలా అన్నీ ఒక సెట్‌లా ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. ఈ మోడల్‌ సెట్స్‌ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాచింగ్‌ కోసం ఎక్కువ పాట్లు అవసరం లేని ఈ కొనుగోళ్లు ఆన్‌లైన్‌ మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top