
చీకటిని చిలుకుతున్న మిణుగురు
పునాది మీద మేడ కట్టడం కష్టమైన పనేమీ కాదు కానీ శూన్యంలో రాళ్లు పేర్చడమే సాహసం...
తనిఖీకి వస్తున్న పోలీసువాడికి...
తన వీథి వేశ్య వీథి కాదని, తన ఇల్లు వేశ్యాగృహం కాదని, తన తల్లి వేశ్య కాదని, పాఠ్యపుస్తకం తీసుకుని, గట్టిగట్టిగా చదవడం, మొదలుపెట్టింది నసీమా.
చదువున్నచోట బురదుండదని, చితికిన జీవితాలుండవని, చీకటి సంబంధాలు ఉండవని, తెలియజేయడానికే గట్టిగట్టిగా చదివింది.
ఇది చిన్నప్పటి కథ.
ఇప్పుడు నసీమా రాస్తోంది.
జుగ్ను... అన్న పత్రికను నడుపుతోంది.
వేశ్యా వృత్తి అనే బురదలో నుంచి బయటపడి వికసించిన కమలాలెన్నో సరస్వతికి సింహాసనాలయ్యాయి.
వాళ్లూ రాస్తున్నారు.
జుగ్ను.... చీకటిని
చిలుకుతున్న మిణుగురు.
పునాది మీద మేడ కట్టడం కష్టమైన పనేమీ కాదు కానీ శూన్యంలో రాళ్లు పేర్చడమే సాహసం!
అమ్మానాన్నలు ఇచ్చిన కీర్తితో పేరు పొందడం గొప్పేమీ కాదు.. అసలు వినడానికే ఇష్టపడని ఉనికిని పదిమందీ గర్వంగా ఉచ్చరించేలా చేయడమే హీరోయిజం!
శూన్యంలో రాళ్లు పేర్చిన సాహసి, తనకో చిరునామా కల్పించుకున్న నాయిక నసీమా!
బిహార్‌లోని ముజఫర్‌పూర్ ఆమె ఊరు. చతుర్భుజ్‌స్థాన్ ప్రాంతంలో ఉంటుంది. ఖవ్వాలీ కళాకారులు, సెక్స్ వర్కర్స్ ఉండే ఈ ప్రాంతం తవైఫ్ మండీ, లాల్టెన్ పట్టీ అనే రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. నసీమా ఉండేది లాల్టెన్ పట్టీలో.
పీడకల
ఎంత పేదరికంలో పెరిగినా బాల్యం కొన్నయినా బంగారు జ్ఞాపకాలను మూటకట్టుకుంటుంది. కానీ నసీమాకు బాల్యమంటేనే పీడకల. విటుల రాకపోకలు, పోలీసు దాడులతోనే గడిచిపోయింది. నిజానికి నసీమా ఆ ఇళ్లల్లో పుట్టలేదు. ఆమెను కన్నతల్లి ఆ వాడలోని ఓ ఇంటి తల్లికి ఆ పిల్లను ఇచ్చేసి వెళ్లిపోయింది. అలా ఆ ఇంటి అమ్మాయి అయింది నసీమా. రాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు పోలీసు బూట్లు, లాఠీల చప్పుళ్లకు హఠాత్తుగా మెలకువొచ్చేది. అంతే వెంటనే లేచి పక్కనే ఉన్న స్కూల్‌బ్యాగ్‌లోంచి ఏదో ఒక పుస్తకం తీసి గట్టిగా చదివేది.. తమ ఇల్లు సెక్స్ వర్కర్స్ ఉండే ఇల్లు కాదని నమ్మించడం కోసం.
అంతా సద్దుమణిగాక తెరిచిన ఆ పుస్తకంలో మొహం దాచుకొని వెక్కివెక్కి ఏడ్చేది. అలా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో మళ్లీ నిద్రలోకి జారుకునేది. తను నాలుగో తరగతికి వచ్చాక అనుకుంటా.. కుటుంబ నేపథ్యం గురించి భయపడ్డం మొదలుపెట్టింది. స్కూల్లో స్నేహితులెవరికీ ఇంటి అడ్రస్ చెప్పొద్దని వారించేది తల్లి. అప్పటి నుంచే నలుగురిలో కూడా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంది నసీమా. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా.. పెంపుడు తల్లి రెండో పెళ్లి చేసుకుంది. నసీమాకు దిగులు ఎక్కువైంది. డాబా మీద కూర్చోని భవిష్యత్తు గురించి బెంగపడేది. అప్పుడే చీకట్లో వెలుగు రేఖలా ఆమె అమ్మమ్మ వచ్చింది. నసీమాను తీసుకొని సీతామాధి (అదో ఊరు)కి తీసుకెళ్లింది. అక్కడే ఓ ఎన్‌జీవోలో చేరి చదువు కొనసాగించింది. అడ్డంకులను ఎదుర్కొంటూనే మొత్తమ్మీద పదో తరగతి పూర్తి చేసింది.
2002లో ఒకరోజు..
నసీమా జీవితం మలుపు తిరిగింది. ముజఫర్‌పూర్ రెడ్‌లైట్ ఏరియాలోని బంధువుల ఇంట్లో నసీమా ఉన్నప్పుడు పోలీస్ రైడ్ జరిగింది. ఆ రైడ్‌ని లీడ్ చేసింది లేడీ పోలీస్ ఆఫీసరే. ఆడవాళ్లు, చిన్నపిల్లల్ని కూడా కొట్టుకుంటూ తీసుకెళ్లారు మగ పోలీసులు. పట్టుకెళ్లిన వాళ్లలో తన స్నేహితులు, బంధువులూ ఉన్నారు. నిజానికి వాళ్లెవరూ సెక్స్ వర్కర్స్ కారు. సెక్స్‌వర్క్ చేస్తున్న వాళ్లు కూడా ఎక్కడి నుంచో ఎవరో అమ్మేస్తే ఈ రొంపిలోకి వచ్చిపడ్డవాళ్లు. ఆ దృశ్యం నసీమాను కలచివేసింది. సెక్స్ ట్రాఫికింగ్‌కి చెక్‌పెట్టే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో పడింది.
పర్‌చమ్.. జుగ్ను
ఆలోచనల్లోంచి వచ్చిందే పర్‌చమ్ అనే సంస్థ. వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టేసిన టీనేజ్ పిల్లలు, ఏళ్లుగా వేశ్యావృత్తిలో ఉంటున్న వాళ్ల పిల్లల చదువు, మంచి జీవితం కోసం ఏర్పడ్డదే పర్‌చమ్. 2003 నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల మందిని ఆ రొంపిలోంచి బయటకు లాగింది నసీమ్. అదేమంత తేలికగా జరగలేదు. పోరాటమే చేయాల్సి వచ్చింది. చేసింది.. చేస్తోంది కూడా. దాడులు జరిగాయి. లెక్కచేయలేదు. ఇంకా మొండిగా ముందుకెళ్లింది. పర్‌చమ్ లక్ష్యం, తన ఆలోచనలు పది మందికీ చేరడానికి ‘జుగ్ను’ అనే చేతిరాత పత్రికను మొదలుపెట్టింది. ఏ ఇంట్లో అయితే బిక్కుబిక్కుమంటూ తన బాల్యాన్ని గడిపిందో ఆ ఇల్లే జుగ్నూకి ఆఫీస్ చేసుకుంది.
సెక్స్ వర్కర్స్ పిల్లలతోనే ఈ పత్రికను తెచ్చింది. అంతే త్వరగా అది ఫేమస్ అయ్యింది. ఒక్క ముజఫర్‌పూర్‌లోనే కాదు బిహార్‌లోని ఇతర జిల్లాల్లోని రెడ్‌లైట్ ఏరియాల్లోనూ ప్రచారం అయింది. దాంతో నసీమా, ఆమె చేస్తున్న పని జాతీయా మీడియా దృష్టిలోనూ పడ్డాయి. పత్రికలు, చానళ్లు ఆమె గురించి రాశాయి, చూపించాయి. సీఎన్‌ఎన్-ఐబీఎన్, రిలయెన్స్ కలిసి ప్రతి యేటా ఇచ్చే రియల్ హీరో అవార్డుకూ ఎంపికైంది. 2010లో ఈ అవార్డును అందుకుంటూ ‘మేం సెక్స్‌వర్కర్స్ కాదు, మీ అందరిలా మేమూ ఈ సమాజం బిడ్డలమే’ అని నసీమా అన్నప్పుడు స్టేజ్ మీదున్న ఆమిర్‌ఖాన్, ముఖేశ్ అంబానీ, అవార్డ్ ఇచ్చిన సచిన్‌టెండూల్కర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ప్రస్తుతం..
నసీమాకు పెళ్లి అయింది. రాజస్థాన్‌కు చెందిన దళిత ఉద్యమకారుడు హన్స్‌రాజ్ కబీర్ ఆమెను ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు హన్స్‌రాజ్ కబీర్ వాళ్ల తల్లిదండ్రులను కలవడానికి వెళ్తూ నసీమా తను రాసిన తన కథను, మరో ఐదుగురు సెక్స్‌వర్కర్స్ మీద తాను రాసిన పుస్తకాలను తీసుకెళ్లింది. కబీర్ వాళ్ల నాన్నకు ఇచ్చింది అవి చదివాకే తన గురించి నిర్ణయం తీసుకొమ్మని. చదివి నసీమాకు కబురు పంపాడు కబీర్ తండ్రి.. ‘నిన్ను మా కోడలిగా అంగీకరిస్తున్నాను’ అని. అలా 2010, జనవరి 14న కబీర్, నసీమాల పెళ్లి అయింది. అయితే ఈ పెళ్లి కోసం కబీర్ ముస్లింగా మారలేదు, నసీమా హిందువు కాలేదు. ‘జుగ్ను’ పత్రికను విస్తృతం చేసింది. ఇప్పుడా పత్రికకు బిహార్‌లోని అన్ని జిల్లాల్లో విలేకరులున్నారు. అందరూ అమ్మాయిలే. పన్నెండేళ్ల నుంచి పాతికేళ్లలోపు వాళ్లు. పర్‌చమ్, జుగ్నూ పనులతోపాటు భర్త కబీర్ దళిత్ ఉద్యమానికీ ఊతంగా ఉంటోంది నసీమా.