జగమంత కుటుంబంపాట కాదు... నా జీవితం!

జగమంత కుటుంబంపాట కాదు... నా జీవితం! - Sakshi


పాట తప్ప, సీతారామశాస్త్రికి...

 వేరే స్వరూపం లేదు, సారూప్యం లేదు,

 సదృశమూ లేదు.

 పోనీ మాటల్లో?  

 ‘బూడిదిచ్చేవాడినేది అడిగేది’ అని కదా అన్నాడు...

 అహాన్ని దహనం చేసుకుని,

 ఆ బూడిదగా కూడా మిగలని వాడితో...

 ఏం మాట్లాడి ఏం రాబడతాం?

 ఏం రాబట్టి ఏం రాస్తాం?

 ఒకర్ని ఒక మాట అనడు, అననివ్వడు.

 ‘మీరు గ్రేట్ సర్ ’ అంటే ఒప్పుకోడు.

 తనలోని జగమంత కుటుంబాన్ని చూపిస్తాడు.

 అందులో ఆయన తప్ప

 అంతా గ్రేట్‌గా కనిపించేలా చేస్తాడు!

 జీవితాన్ని, జీవితంలోని ప్రేమను,

 కవినీ, కవి డిగ్నిటీని...

 కళ్లకద్దుకుంటూ మాత్రమే తను కనిపిస్తాడు.

 మరెలా ఆయన్ని క్యాచ్ చెయ్యడం?

 కాని పని.

 నిర్నిమిత్తంలో, నిర్వికారంలో, నిరహంకారంలో...

 లుప్తమై విశ్వవ్యాప్తమైన సృజనశీలి ‘సిరివెన్నెల’!

 ఆ వెన్నెలలో లభించిన ఒకటీఅరా సాక్షాత్కారాలే...

 ఈవారం మన ‘తారాంతరంగం’!


 

 

 జీవితంలో సక్సెస్ మొదలయ్యేది మన ప్రజ్ఞ మనం తెలుసుకున్నప్పుడే. మీలో ఓ కవి ఉన్నాడని మీకెప్పుడు తెలిసింది?

 సిరివెన్నెల: అటు పల్లెటూరు, ఇటు పట్టణం.. రెండూ కాని ఓ ప్రాంతం. చదువుకున్నదేమో గవర్నమెంట్ బడి. ‘పాడిన వారు ఘంటసాల, సుశీల’ అని రేడియోలో చెబుతుంటే... ‘అదేంటి? పాడింది అక్కినేని, సావిత్రి అయితే.. ఘంటసాల, సుశీల అంటారు?’ అని నాకు నేనే ప్రశ్నించుకునే ఇన్నోసెన్స్. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన నాకు... రాయడం అనే ఒక ప్రక్రియ ఉంటుందని, రాస్తారని ఎలా తెలుస్తుంది? కానీ ఏదో రాస్తూ ఉండేవాణ్ణి... నాకు తెలీకుండానే! నేను రాస్తున్నది కవిత్వం అని ఓ రోజు నా తమ్ముడు చెబితే కానీ నాకు అర్థంకాలేదు.

 

 అంటే.. బాల్యం నుంచీ అక్షరసాన్నిహిత్యం ఉండేదన్నమాట!


 సిరివెన్నెల: పుస్తకాల్లో అక్షరాలు కనిపిస్తే చాలు, నమిలి మింగేసేవాణ్ణి. మా నాన్నగారు గొప్ప పండితుడు, మానవతావాది, సాహితీ ప్రేమికుడు, గొప్ప ఫిలాసఫర్. హిమాలయ శిఖరం అంచుని నేలపై నిలబడి చూస్తే కనిపించదు... ఆయన కూడా అంతటి వారే! కానీ దురదృష్టం ఆయన 40 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. ఇప్పుడుంటే అద్భుతాలు చేసి ఉండేవారు. ఆయన ద్వారా నాకు సంక్రమించిన ఆస్తే నాకు అక్షరం.

 

 మీ నాన్నగారితో మరచిపోలేని సంఘటన ఏమైనా ఉందా?


 సిరివెన్నెల: నాకు చిన్నప్పుడు డైరీ రాసే అలవాటు ఉండేది. ఓరోజు ఆయన నా డైరీని చదువుతూ కనిపించారు. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ‘అదేంటి? ఒకరి డైరీని అలా చదవడం కుసంస్కారం కాదా?’ అని ఆయన్ను సీరియస్‌గా ప్రశ్నించాను. ‘ఏం? దొంగల డైరీలు పోలీసులు చదవడంలేదా?’ అన్నారు నింపాదిగా నాన్న. ‘నేను దొంగనా...’ అన్నాను ఉక్రోషంగా. ‘నువ్వు దొంగవు కాకపోవచ్చు, కానీ నేను పోలీసునే. నా కొడుకు ఆలోచనాధోరణి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది’ అన్నారు. పరులకు తెలియకూడని పనులు నువ్వెందుకు చేయాలి? పోనీ చేశావే అనుకో... అవన్నీ పుస్తకాల్లో రాయడమేంటి అర్థం లేకుండా? అవి నేను చూస్తే సంస్కారం లేదా అని నన్నడగటం ఏంటి?’ అంటూ ఆపకుండా అక్షింతలు వేశారు. ‘చూడు నాయనా... ప్రైవసీ, సీక్రెసీ అని రెండు ఉంటాయి. ప్రైవసీ అందరికీ ఉండాలి.. కానీ, సీక్రెసీ మాత్రం ఉండకూడదు. శరీరం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగని బట్టలు విప్పేసి తిరగం కదా’ అని నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి.  

 

 ఒక కవిగా సాహిత్యానికి మీరిచ్చే నిర్వచనం?


 సిరివెన్నెల: సాహిత్యం.. ఓ విరాట్ స్వరూపం! ఆ విరాట్ స్వరూపాన్ని ఒక్కసారిగా చూడలేక దాన్ని మనం విభజించుకున్నాం. కథ, కథానిక, కవిత, నాటకం, నాటిక, వ్యాసం... ఇలా!  ఇది పాశ్చాత్యుల ప్రభావంతో జరిగిన విభజన. సాహిత్యానికి అసలైన రూపం మహాభారతం! అందులో వచనం ఉంటుంది, వర్ణనలుంటాయి, శ్లేషలు, ధ్వనులు ఉంటాయి.

 

 ‘సిరివెన్నెల వంటి సాహితీవేత్త సినీరంగంలోకి రావడం సినిమా అదృష్టం.. ఆయన చేసుకున్న దురదృష్టం. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి ఆయన’ అని ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ మీ గురించి అన్నారు. దానికి మీరు ఏకీభవిస్తారా?

 సిరివెన్నెల: కచ్చితంగా ఏకీభవించను! ఓ వ్యక్తి నా గురించి వ్యక్తపరిచిన అభిప్రాయం మాత్రమే అది. అదేం గీటురాయి కాదు, సర్టిఫికెట్ కాదు..  శిలాశాసనం అంతకన్నా కాదు. ‘ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి సీతారామశాస్త్రి’ అంటే.. ప్రేక్షకులకు స్థాయి లేదనా? ఇప్పటివరకూ అందరూ స్థాయిలేని పాటలు రాశారనా? శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సినారె ఇత్యాది కవుల పాటలను ఆదరించిన అలనాటి శ్రోతలు స్థాయి లేనివారనా? అది తప్పు. సినిమాను నేను మరోతల్లిగా భావిస్తాను. నా భావాలను, ప్రతిభను ప్రపంచానికి వ్యక్తపరచడానికి సినిమా ఓ వేదిక అయ్యింది. అంతకంటే ఓ కళాకారుడికి ఏం కావాలి? సినిమా అంటే సకల కళల  సమన్వయ వేదిక. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే పదానికి పరిపూర్ణమైన రూపం సినిమా. అలాంటి సినిమాలో నేనూ ఓ భాగం అయినందుకు ఎప్పుడూ గర్విస్తాను. నాపై ఉన్న అభిమానంతో నా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాడు త్రివిక్రమ్. అనేకమంది భావాలను తన మాటగా వ్యక్తపరచినందుకు తివిక్రమ్‌కి రుణపడి ఉంటానని ఆ వేదికపైనే చెప్పాను. అంతేకానీ ‘అక్షర సత్యాలు మాట్లాడాడు త్రివిక్రమ్’ అని చెప్పలేదే!

 

 సినిమా సకల కళల సమన్వయ స్వరూపం అన్నారు. కానీ ప్రస్తుతం సినిమా అలా లేదు కదా?

 సిరివెన్నెల: నేను చెబుతున్నది సినిమా గొప్ప వేదిక అని! అందులో ఏ మాత్రం సందేహం లేదు. వేదిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా సినిమా లేకపోతే.. చూడకండి. శుభ్రంగా చాగంటి కోటేశ్వరరావుగారితో పురాణ కాలక్షేపం చెప్పించుకోండి. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ‘పాడుతా తీయగా’ చూసుకోండి. సినిమా ఎవరు చూడమన్నారు? వేదిక అనేది పరమేశ్వర స్వరూపం. అది ఎప్పుడూ పూజనీయమైనదే!

 

 పాట ద్వారా సాహిత్యాన్ని వినిపించడమే కాదు, ఆ పదాల అర్థాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెంచిన రచయిత సిరివెన్నెల అని చాలామంది అభిప్రాయం...

 సిరివెన్నెల: అవునా.. ‘చిలక తత్తడి రౌతా.. ఎందుకీ హూంకరింత..’. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రాసిన ‘రహస్యం’ సినిమాలోని ఈ పాటను శ్రోతలు వినలేదా? ‘చిలక తత్తడి రౌతా..’ అంటే.. చిలకను వాహనంగా కలిగినవాడా. అంటే... ‘మన్మథుడా..’ అని! జనాలు విన్నారు... అర్థం తెలుసుకున్నారు. శ్రోతల మేథస్సును తక్కువ అంచనా వేయకూడదు. నా ‘విధాత తలపున’ పాటను అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే కారణం.. నేను ఆ పాటను ‘సిరివెన్నెల’ సినిమా కోసం రాశాను కాబట్టి! అదే ఏ ‘యమకింకరుడు’ కోసమో రాసుంటే ఆ పాట గురించి మాట్లాడుకునేవారా? మీకు తెలీని విషయం ఏంటంటే... నేను కొన్ని రకాల పాటలు ఇప్పటికీ రాయలేను.

 

 మీరు రాయలేని పాటలు కూడా ఉన్నాయా?

 సిరివెన్నెల: ఎందుకుండవు? కొన్నికొన్ని పాటలుంటాయి. భలే తమాషాగా, తిక్కగా ఉంటాయి. ఉదాహరణకు ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘మండపేట.. మలక్‌పేట.. నాయుడుపేట.. పేటర్యాప్..’ పాటనే తీసుకోండి. భలే ఉంటుంది ఆ పాట. ఎప్పుడు విన్నా కూడా ‘ఇలా రాయడం నావల్ల కాదేమో’ అనిపిస్తుంది. ‘జీన్స్’ సినిమాలో ‘కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవూ’ పాట విన్నప్పుడూ అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. డెఫినిట్‌గా అలాంటివి నేను రాయలేను.

 

 మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి ఓసారి వెళితే.. అసలు ఇంతటి సాహితీ ప్రియులు టెలిఫోన్ శాఖలో ఎలా ఇమడగలిగారు?

 సిరివెన్నెల: జీవన కర్మక్షేత్రంలో తనకివ్వబడ్డ పనిని చేసుకొని పోవడం మానవధర్మం. ఇందులో ఇమడకపోవడానికి ఏముంది? ఇప్పుడు నేను చేస్తున్నది అదే!

 

 సద్గురువు సాంగత్యం లేకపోతే... ఇంత జ్ఞానసంపద అసాధ్యం! మీ గురువుల గురించి...


 సిరివెన్నెల: జన్మసిద్ధంగా మా నాన్నగారి నుంచి నాకు చాలా లక్షణాలు అలవడ్డాయి. సో... ఆ విధంగా నా తొలి గురువు ఆయనే! నా రెండో గురువు జీవితం! ప్రపంచంలో నేను చూసిన ప్రతి ఒక్కటీ నాకు గురువే! ఇష్టపడేవారు, ఇష్టపడనివారు... ఇలా అందరూ నాకు గురువులే! యోగీశ్వరులు శివానందమూర్తిగారు నా మూడో గురువు!

 

 కెరీర్ ప్రారంభంలోనే ‘విధాత తలపున’ లాంటి గొప్ప సాహిత్యంతో పాటలు రాసిన మీరు... కొన్ని సాధారణమైన పాటలు రాయడానికి అంతర్మథనానికి లోనౌతారా?

 సిరివెన్నెల: మీరంటున్న నా ‘సాధారణమైన పాట’...  నా ‘విధాత తలపున’ కంటే ఏ విధంగా తక్కువో చెప్పండి. అప్పుడు అది రాయడానికి నేను పడ్డ అంతర్మథనం ఏంటో చెబుతాను.

 

 సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి సినిమాల్లోని మీ పాటలన్నీ కావ్యాలని చాలామంది అభిప్రాయం...

 సిరివెన్నెల: ‘గుండెనిండా గుడిగంటలు, గువ్వల గొంతులు, ఎన్నో మోగుతుంటే... కంటి నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే... వెంటనే.. పోల్చాను నీ చిరునామా ప్రేమా...’ ఈ కాన్సెప్ట్‌ని ఏ విధంగా వాటికంటే తక్కువ చేసి చూస్తారు మీరు?        

 

 ఈ పాటలు ఆ పాటలంత గౌరవాన్ని పొందాయంటారా?

 సిరివెన్నెల: ఎందుకు పొందలేదు? ఎన్నో రసాల సమ్మేళనం జీవితం. ఒక చెట్టుని నువ్వు ఎన్ని రకాలుగా చూస్తే అన్ని రకాలుగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. నీ బిడ్డను చూస్తూ... ‘అబ్బా... పువ్వులా నవ్వుతుంది...’ అని నీ  భార్యతో మురిపెంగా నువ్వంటున్నప్పుడు నువ్వో తండ్రివి. నీ భార్యను చూసి ‘నువ్వు ఈ రోజు ఎంతో నాజూగ్గా, తాజా పువ్వులా ఉన్నావ్’ అన్నప్పుడు నువ్వొక ప్రేమికుడివి. ఇవన్నీ జీవితానికి అవసరమే. కాబట్టి ‘విధాత తలపున’ రాస్తేనే పాట, ‘గుండెనిండా గుడిగంటలు’ రాస్తే పాటకాదు అనడం అసమంజసం. ‘గుండెనిండా గుడి గంటలు’ లాంటి సాహిత్యాన్ని రాయవలసి వచ్చినప్పుడు.. ‘ఎలా రాస్తే దానికి ఆ డిగ్నిటీ వస్తుంది’ అని ఆలోచించి రాసినప్పుడే కవిగా నీ డిగ్నిటీ ఏంటో తెలుస్తుంది. శృంగారం అనేది ఓ చెడు ప్రక్రియే అయితే... ఈ సృష్టే లేదు గుర్తుంచుకోండి. కాబట్టే శృంగారగీతం ఎంతో బాధ్యతాయుతమైనదని తెలుసుకోండి. ఇంకా ఎక్కువ పూజనీయమైనది, ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందని అర్థం చేసుకోండి.

 

 ఆ పాటల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. గొప్ప సాహిత్యంతో పాటలు రాసిన మీరు... నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రాయవలసి వచ్చినప్పుడు పడే అంతర్మథనం గురించి అడుగుతున్నా...

 సిరివెన్నెల: నాకు ట్రెండ్ అనేది లేదు. ‘కళ్లు’లో ‘తెల్లారింది లెగండో..’ పాట నేనే రాశాను. మొన్నమొన్ననే ‘ఓనమాలు’లో ‘పిల్లలూ బాగున్నారా?’ అనే సందేశాత్మక గీతాన్నీ నేనే రాశాను. ‘కృష్ణంవందే జగద్గురుమ్’లో దశావతార రూపకం నేనే రాశాను. ఆ పక్కనే యూత్‌కోసం ‘స్పైసీ స్పైసీగాళ్...’ పాటనూ నేనే రాశాను. ‘స్పైసీ స్పైసీగాళ్’ పాటలో ఎక్కడైనా మీకు అశ్లీలత స్ఫురించిందేమో చెప్పండి. సో, ఇక్కడ అంతర్మథనానికి తావేది?

 

 ఓ పక్క ఆధ్యాత్మికం, మరో పక్క శృంగారం, ఇంకో పక్క విప్లవం.... ఓ వ్యక్తిలో ఇన్ని కోణాలా?

 సిరివెన్నెల: ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పగలిగే సహజ లక్షణం మనిషికి మాత్రమే ఉంది. అవన్నీ చూపించకపోతేనే తప్పు. మనిషి శరీరంలో ప్రతి అవయవం పనిచేయాలి. అందులో ఒక్కటి పనిచేయకపోయినా... ‘వికలాంగుడు’ అంటారు. ఇదీ అంతే!

 

 మీరు రాసిన కొన్ని పాటలు వింటుంటే.. సమాజంపై మీకు కోపమేమో అనిపిస్తుంది

 సిరివెన్నెల: ‘సమాజం వేరు.. నేను వేరు’ అని అనుకోను. నాకు జ్వరం వస్తే.. నాపై నేను ఆగ్రహం వ్యక్తం చేసుకోను కదా. ‘కాస్త ఇబ్బందిగానే ఉందండీ’ అంటాను. కారణం... అది నాకొచ్చింది కనుక. నన్ను నేను ప్రేమించుకుంటాను కనుక. ఇక్కడ సమాజమే నేను! సమాజంలోని అవకతవకలన్నీ నావే! అలాంటప్పుడు కోపానికి తావెక్కడిది.

 

 వర్మ, కృష్ణవంశీ, త్రివిక్రమ్, క్రిష్.. ఇలా కొందరు దర్శకులతో మీకు అటాచ్‌మెంట్ ఎక్కువ అంటారు. నిజమేనా?

 సిరివెన్నెల: కొందరితో అటాచ్‌మెంట్, కొందరితో డిటాచ్‌మెంట్ ఉండదు. ఉదాహరణకు మనిద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆసక్తి ఉన్నంతవరకూ మీరు నా మాటలు వింటారు. ఎక్కడో ఒక చోట ఆ ఆసక్తి తెగిపోతుంది. దాంతో ఏదో కారణం చెప్పి నా దగ్గరనుంచి తప్పుకుంటారు. దానికి కారణం కోపమే కానక్కరలేదు. దీన్నే మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ‘వేవ్‌లెంగ్త్ కలవడం’ అంటుంటాం. సో... వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా వాళ్లు తీస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన నా ఒపీనియన్స్ కానీ, సలహాలు కానీ వాళ్లకు నచ్చి ఉండొచ్చు. దాంతో వాళ్లు నాతో కలిసి పనిచేయడం జరుగుతుంది.

 

 ఇప్పుడున్న దర్శకుల్లో మీకు ప్రియమైనవాళ్ళు...

 సిరివెన్నెల: ఏ రంగంలోనూ, ఏ అంశంలోనూ ఒక వ్యక్తిని ఇష్టపడటం ఉండదు నాకు. నాకే కాదు... ఎవరికీ ఉండకూడదు. ప్రతి దర్శకుడూ ఓ మంచి సినిమా తీసే ఉంటాడు. అలాగే ప్రతి దర్శకుడూ ఓ చెత్త సినిమా కూడా తీసే ఉంటాడు. వారి పనిని ఇష్టపడతాను కానీ.. వ్యక్తిని కాదు!

 

 కవిగా మీకు సాటి, పోటీ ఎవరనుకుంటున్నారు?

 సిరివెన్నెల: బాగుందా, లేదా అని చెప్పగలం కానీ... ఒక శిల్పంతో మరో శిల్పాన్ని ఎలా  పోల్చగలం? వంద మీటర్ల పరుగుపందెంలో ఒకడు ఫస్ట్ వస్తాడు. ఆ వంద మీటర్లను రెండొందల మీటర్లు చేస్తే... ఆ ఫస్ట్ వచ్చినవాడే థర్డ్ రావచ్చు. చెప్పలేం కదా. సో... పోటీ అనేది తీసుకునే సంవిధానాన్ని బట్టి ఉంటుంది. ‘వశిష్టుడు’ అనే ఓ వేల్యూని చూసుకుంటూ... ‘బ్రహ్మర్షి’ అనే స్కేల్ పెట్టుకొని... విశ్వామిత్రుడు తన ధర్మప్రయాణాన్ని సాగించాడు. ఆ సంవిధానాన్నే పోటీ అంటారు. అలా ప్రయాణిస్తే జ్ఞానం సమృద్ధి అవుతుంది!

 

 రాయడంలో ఎప్పుడైనా బోర్‌గా ఫీలయ్యారా?


 సిరివెన్నెల: నా జీవితంలో మార్పు లేని రెండే విషయాలు నా భార్య, నా పాట. ఈ రెండూ నాకెప్పుడూ బోర్ కొట్టవు. ఆ విషయం మా ఆవిడక్కూడా తెలుసు.

 

 ఇంతటి జ్ఞానితో జీవితాన్ని పంచుకున్న మీ సహధర్మచారిణి గురించి తెలుసుకోవాలని ఉంది...

 సిరివెన్నెల: ‘సహ.. ధర్మ.. చారిణి’ అని మీరే అన్నారు. ధర్మంగా తను నడుస్తూ.. తనతో పాటు తన భర్తనూ నడిపించేది సహధర్మచారిణి. ఆ పదానికి అక్షరాలా యోగ్యురాలు నా భార్య పద్మావతి. నేను ఓ అద్భుతమైన శిల్పాన్ని అనుకుంటే...  ఆ ‘అద్భుతం’ అనే పదం చెందాల్సింది ఆవిడకే. ఎందుకంటే... ఈ శిల్పాన్ని చెక్కింది తనే. అందమైన పాటలా నా జీవితం సాగిపోవడానికి కారణం ఆవిడ. నన్ను ఈ విధంగా మలచడానికి తన జీవితంలో చాలా భాగాన్ని పణంగా పెట్టి, తాను చాలా కోల్పోయి, నేను చాలా పొందేలా చేసిన త్యాగమయి నా భార్య. షీఈజ్ మై బెటర్ త్రీఫోర్త్! నేను వన్ ఫోర్త్ మాత్రమే. అందులో అసత్యం కానీ, నిష్టూరం కానీ, అతిశయోక్తి కానీ ఏమీ లేదు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఓ ఇంటి కోడలిగా తన ప్రతి బాధ్యతనూ పరిపూర్ణంగా నిర్వర్తించింది కాబట్టే.. నా ఒక్క బాధ్యతను నేను గొప్పగా నిర్వర్తించగలిగాను.

 

 మీకోసం మీ భార్య ‘ఎంతో కోల్పోయింది’ అన్నారు. అదేంటో కాస్త వివరంగా చెబుతారా?

 సిరివెన్నెల: నేను మీ ముందు కూర్చొని ఇంటర్‌వ్యూ ఇచ్చేంత స్థాయికి రాగలిగానంటే, ఇన్ని వందల పాటలు రాయగలిగానంటే.. నాకెంత విశ్రాంతి లభించి ఉండాలి? ఈ విశ్రాంతి కోసం ఎన్ని బాధ్యతల నుంచి నేను తప్పుకొని ఉండాలి? చెప్పండి?  ‘నీ బిడ్డలమైన మాకు.. ఓ తండ్రిగా నువ్వు ఏ మాత్రం ప్రేమనందించావ్?’ అని నా పిల్లలు నన్ను ప్రశ్నించొచ్చుగా? ‘అందరు తండ్రుల్లా ఏనాడైనా నువ్వు మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లావా? పేరెంట్స్‌డేకి ఎన్నిసార్లు నువ్వు కాలేజీకొచ్చావ్? అసలు మేం చదువుతున్న స్కూళ్ల పేర్లయినా నీకు తెలుసా?’... ఈ ప్రశ్నలన్నీ నా పిల్లలు నాపై సంధించొచ్చుగా? అడక్కపోగా నన్ను గౌరవిస్తున్నారెందుకు? దీని వెనుక ఏ మెకానిజం ఉండుండాలి? పెళ్లిళ్లనీ, అశుభాలనీ, చుట్టాలనీ, పక్కాలనీ... అందరిలా తానూ ఓ పద్ధతి ప్రకారం జీవిస్తానంటే... ఇంత తపస్సు నాకు సాధ్యమయ్యేదా? రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు గడపగలిగానంటే... ఎన్ని సామాజికమైన బాధ్యతల నుంచి నేను తప్పుకొని ఉండి ఉండాలి? నేను సామాజిక బాధ్యతల నుంచి తప్పుకోలేదని జనాలు అనుకుంటున్నారు. అలా అనిపిచేలా చేసింది ఆవిడ కదా? దానికి ఆమె ఎంత సమయాన్ని కేటాయించి ఉండాలి? తన జీవితం తాను జీవిస్తూ ..ఇన్ని రకాలుగా నా ఖాళీలను పూరిస్తూ.. ఆమె ముందుకెళ్లింది కాబట్టే, ఈ రోజు బంధువుల్లో కూడా నన్నెవరూ బాధ్యతారహితుడనట్లేదు. ఓ యోధుణ్ణి కవచం కాపాడటం మనం చూస్తాం. కానీ ఆ కవచానికి తగిలే బల్లేల దెబ్బలు మనం చూస్తామా? నా కవచమే నా  భార్య. మా చిన్నబ్బాయి ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడే ఓసారి ఇదే విషయాన్ని అందంగా, క్లారిటీతో చెప్పాడు. ‘మాకు మీకంటే అమ్మంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే.. మిమ్మల్ని ప్రేమించడం ఎలాగో అమ్మే మాకు నేర్పించింది’ అని.

 

 మీకోసం ఇంత చేసిన ఆమెకోసం మీరేమి చేశారు. ఆమె కోసం కొంతైనా చేయాలని మీకు అనిపించలేదా?

 సిరివెన్నెల: అరవైకి దగ్గరపడ్డాను. ఎవ్వరికీ రుణపడకుండా రిటైర్ అవ్వాలనేదే నా కోరిక! నిజంగా కూడా నేనెవ్వరికీ రుణపడిలేను... నా భార్యకు తప్ప! తన రుణం మాత్రం తప్పకుండా తీర్చుకుంటా. 30 ఏళ్ల సంసారంలో ఏనాడూ ఆమె ఒక్క పుణ్యక్షేత్రానికి కూడా వెళ్లలేదంటే నమ్ముతారా! అంతెందుకు... తన పుట్టింటికి కూడా నేను లేకుండా ఆమె వెళ్లలేదు. ఎందుకంటే... నేను లేని జీవితాన్ని ఆమె కోరుకోదు. అంతెందుకు.. ఇప్పుడామెను ‘ఏదైనా కోరుకో’ అంటే.. మహా అయితే.. ‘తిరుపతి తీసుకెళ్లండి’ అంటుంది. స్త్రీ అంటే ఏంటో.. స్త్రీత్వం అంటే ఏంటో.. తెలీని ఈ కాలంలో... అనవసరమైన బాధలు కొనితెచ్చుకుంటూ జీవితాన్ని నరకం చేసుకుంటున్న ఈ రోజుల్లో, ‘ఇవ్వడం ద్వారా ఏం పొందచ్చు’ అనే విషయం తెలుసుకోవడానికి నా భార్య గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. తను ఎంతో ఇచ్చింది. తద్వారా అన్నీ పొందింది.  

 

 మీ మాటల్ని బట్టి చూస్తుంటే... మీది ప్రేమ వివాహమేమో అనిపిస్తోంది.

 సిరివెన్నెల: ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం... ఇలాంటి కాన్సెప్టుల మీద నాకు సరైన అవగాహన లేదు. ప్రేమించడం ‘ఒక పని’ అని నేను అనుకోను. ఒకానొక క్షణంలో ఒకానొక చోట అది మొదలవుతుందని కూడా భావించను. నా పెళ్లి పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగానే జరిగింది. ఇక స్త్రీ, పురుషుల మధ్య ఉండవలసిన సహవాసం, సహచర్యం, సాన్నిహిత్యం, సాంగత్యం... ఇవన్నీ ప్రేమ అనే కాన్సెప్ట్‌లో ఉంటే కనుక... మాది కచ్చితంగా ప్రేమే! తెలుగులో ఓ సామెత ఉంది. ‘పేదవాడికి గంజే పరమాన్నం. పెళ్లామే ప్రియురాలు’ అని! దానితో నేను వందశాతం ఏకీభవిస్తా.

 

 అసలు ప్రేమ అనే కాన్సెప్ట్‌ని మీరు నమ్ముతారా?

 సిరివెన్నెల: సత్యాన్ని నమ్మడమేంటి? పగలు అనే కాన్సెప్ట్‌ని నమ్ముతారా? రాత్రి అనే కాన్సెప్ట్‌ని నమ్ముతారా? అనడిగితే ఏం సమాధానం చెబుతాం. ప్రేమ అనేది ఈ రోజు మనం ప్రశ్నించే స్థితికి దిగజారిందంటే... కారణం దానికి మనం వేరే వేరే అర్థాలు ఆపాదించడం వల్లే. ఈ విశ్వంలో ప్రేమ కానిది ఏది? ఎండ ప్రేమకాదా? వాన ప్రేమ కాదా? జీవితం పట్ల మనకున్నది ప్రేమ కాదా? మనపట్ల జీవితానికి ఉన్నది ప్రేమకాదా? ప్రేమ సర్వాంతర్యామి. భగవంతుడు ఆదిమధ్యాంతరహితుడంటూ గుళ్లూ గోపురాలు తిరిగే ఈ మనిషి... సర్వే సర్వత్రా ఉన్న ప్రేమను మాత్రం గుర్తించలేకపోతున్నాడు.

 

 ఇంతకీ మీరు ప్రేమికుడా? భక్తుడా? లేక విప్లవకారుడా?

 సిరివెన్నెల: మనిషిని. మనిషంటే ఇవన్నీ ఉండాలి.

 

 మీకు బలహీనతలున్నాయా?

 సిరివెన్నెల: మనిషంటే అవి కూడా ఉంటాయి కదా. మానవత్వానికి మహత్తరమైన కానుక మనదేశమే మనకిచ్చింది. అదే ‘రామాయణం’. మనిషితనానికి ప్రతిరూపం రాముడు. వాల్మీకి అనే కవి.. రాముడు అనే పాత్రను సృష్టించి, మనిషి అనేవాడు ఎలా బతకాలో సమాజానికి తెలియజేశాడు. ‘రాముడు మహావిష్ణువు అవతారం’ అని రామాయణంలో వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. ‘నేను దశరథుని కుమారుడును.. రాముడను’ అని విజిటింగ్ కార్డు పట్టుకొని తిరిగాడు రాముడు. ఏం... ఆయన ఏడవలేదా? ఆయనకు కోపం రాలేదా? ఆయనకు నొప్పి కలగలేదా? ఒక మనిషికి ఎన్ని లక్షణాలుంటాయో రాముణ్ణి చూస్తే తెలుస్తుంది. మనల్ని రాముడితో పోల్చి చూస్తే కొన్ని ఆయన కంటే ఎక్కువ క్వాలిటీలు కనిపిస్తాయి. కొన్ని తక్కువ క్వాలిటీలు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువైనా రోగమే, తక్కువైనా రోగమే. అదే మనం గ్రహించాల్సింది. వాటినే ‘బలహీతనలు’ అంటాం. అవి నాకూ ఉన్నాయి.

 

 మీ అబ్బాయ్ యోగీశ్వరశర్మ స్వరపరచిన తొలి గీతం విని మౌనం వహించారట కారణం?

 సిరివెన్నెల: నేను ఇంతవరకూ వినని ఓ నోవెల్ ప్రయోగం చేశాడు తను! అది వినడానికి చాలా బావుంది. కానీ రాయలేకపోయాను. దాంతో ఓ ముప్ఫై రోజుల పాటు నాలో నేను స్టడీ చేసి ఆ పాట రాశాను. సెలైంట్‌గా ఉండటం అనేది పాజిటివ్ కాంప్లిమెంటే కానీ, కామెంటూ కాదు, విమర్శ అంతకన్నా కాదు.

 

 తాను సంగీత దర్శకుడవ్వడంలో మీ ప్రోద్బలం  ఉందా?


 సిరివెన్నెల: వాళ్ల అభిరుచిని, పాండిత్యాన్నీ వాళ్లే పెంపొందించుకున్నారు. దానికి తగ్గ కృషి వాళ్లే చేసుకున్నారు. ఇందులో నా ప్రోద్బలం లేదు అనడం కంటే.. నా ‘అడ్డు లేదు’ అనడం కరెక్ట్. సినిమాలోకి రావాలనేది వాళ్ల కోరిక. దాన్ని ఏనాడూ నాపై రుద్దలేదు. వాళ్ల ప్రయత్నాలు వాళ్లే చేసుకున్నారు. ప్రోత్సహించేవారు ప్రోత్సహించారు. ఒక తండ్రిగా.. సాయం చేసినవారికి థ్యాంక్స్ చెబుతుంటా.

 

 దర్శకుడు సందర్భం చెబుతాడు. దానికి తగ్గట్టు గేయరచయిత పాట రాస్తాడు. ప్రస్తుతం ఈ పద్ధతే నడుస్తోంది. కానీ మీరు మాత్రం అందుకు భిన్నంగా... సినిమా కథంతా తెలుసుకుంటారు. దాని ఆత్మను గ్రహిస్తారు. దాన్ని బట్టి పాట రాస్తారు. ఇంకా ఒకడుగు ముందుకేసి, దర్శకులుగా వాళ్లేమైనా తప్పులు చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇంత స్ట్రగులు అవసరమా?

 సిరివెన్నెల: ఎముకల డాక్టర్లు చాలా మందే ఉంటారు. కానీ ఒకరిద్దరి పేర్లే గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం? అందరు చదివిందీ అదే చదువుగా?... అంటే.. ఎక్కడో వారి వ్యక్తిత్వాన్ని  పనిలో లీనం చేస్తున్నారు వాళ్లు. తాము తెలుసుకున్న విషయాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేనూ అంతే. సినిమా కథ ఎలాంటిదైనా అది మనిషి జీవితానికి నీడలా ఉండాలని కోరుకుంటాను. నా పాటను నా తాత్వికాన్వేషణను ఆవిష్కరించే సాధనంగా భావిస్తాను. ఓ అమ్మాయి ఏడుస్తుంది. దానికి ఓ పాట రాయాలి. ‘ఏడవకమ్మా ఏడవకు..’ అని ఏదో ఓ పాట రాయొచ్చు. కానీ నేను అలా రాయను. ‘కన్నీళ్లే కురవాలా లోకానికి తెలిసేలా..? ముస్తాబే చెదరాలా.. నిను చూస్తే అద్దం దడిచేలా’ అని రాస్తా. ఏదో చెప్పాలి. అందులో ఫన్ ఉండొచ్చు. పరామర్శ ఉండొచ్చు. ప్రతిఘటన ఉండొచ్చు. అలా ఉండాలంటే.. కథ ఆత్మ తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కథకు పాట సరిపోతే చాలదు. ఆ తర్వాత కూడా శ్రోత హృదయంలో ఆ పాట చిరస్థాయిగా నిలవాలి. అంత కష్టపడేది అందుకే.

 

 గీత రచయితగా ఎంతో సాధించారు. పద్మశ్రీ రాలేదని ఎప్పుడైనా బాధపడ్డారా?

 సిరివెన్నెల: మెడ ల్ కోసం మెడలు వంచడం నాకు చేతకాదు. అయినా, పద్మశ్రీ కోసం నేను పాటలు రాయలేదు. దాని మీద నాకు ఆసక్తి కూడా లేదు. ఇంతమంది అభిమానాన్ని పొందగలిగాను. ఇన్ని కోట్లమందికి కుటుంబ సభ్యుణ్ణి కాగలిగాను. ‘జగమంత కుటుంబం నాది’ అని ఓ పాట రాశాను. తాము రాసిన పాట ఎంతమంది రచయితల జీవితాల్లో నిజమయ్యాయంటారు? నాకు మాత్రం నిజమైంది. ఇప్పుడు నాది ‘జగమంత కుటుంబం’... ఇంతకంటే గొప్ప అవార్డు ఇంకేదైనా ఉంటుందా? అందుకే అంటాను... ‘జగమంత కుటుంబం పాట కాదు... నా జీవితం’ అని!
 - బుర్రా నరసింహా
***********
 మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి?

 సిరివెన్నెల: నచ్చే సినిమా అనే సైంటిఫిక్ ఫార్ములా ఉంటే... ఆ ఫార్ములాను ఫాలో అవుతూ అందరూ సినిమాలు తీసేస్తారుగా. ఈ మధ్య ‘పా’ సినిమా చూశా. నచ్చింది. ఆ మధ్య ‘అదుర్స్’ అనే సినిమా చూశా. అదీ నచ్చింది. ఫలానా సినిమాలే నచ్చుతాయనేం లేదు.

 

 తప్పక రాసిన పాట ఏమైనా ఉందా?

 సిరివెన్నెల: అసలు అలాంటి పాటల్ని నేను రాయను.

 

 మీ కెరీర్‌లో కష్టపడి రాసిన పాట?

 సిరివెన్నెల: పాట రాయడం ఎప్పుడూ కష్టంగా ఫీలవ్వను. అయినా... కష్టపడి కోసే మామిడిపండు మహత్తరంగా ఉంటుంది. పాట కూడా అంతే.
 ***********
 ఇల్లాలుగా కాకుండా... ఆమెలో మీరు చూసిన అదనపు ప్రత్యేకతలేమైనా ఉన్నాయా?

 మొన్నటిదాకా నాకూ తెలీదు. ఈ మధ్య తెలిసింది. తాను అద్భుతంగా రాస్తుంది. ఆ మాటకొస్తే నాకన్నా బాగా రాస్తుంది. కొన్ని కొన్ని విషయాలను నేను సింపుల్‌గా చెప్పలేను. మా ఆవిడ అలా కాదు. ‘సంసారం-బంధములు’ అనే విషయాన్ని సరిగ్గా ఒకటిన్నర పేజీలో.. అయిదు పేరాల్లో విపులంగా చెప్పేసింది. అది చదివి షాక్ అయ్యాను. ఎందుకంటే.. అంతకు మించి చెప్పడానికి నాకేమీ కనిపించలేదు. అంత అద్భుతంగా రాసింది తను. మా నాన్నగారి గురించి వ్యాసాలు రాస్తున్నప్పుడు, తనూ ఓ భాగం రాసిచ్చింది. ఆమెలో నేను రచయిత్రిని చూసింది అప్పుడే. ఆమె శైలిని, వాక్య నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. అందుకే ఆ వ్యాసంలో మనసు విప్పి ఓ మాట చెప్పాను. ‘మా తమ్ముడంత సరళంగా, నా భార్య అంత గొప్పగా నేను రాయలేకపోయానేమో’ అని.

 

 మరి నవ రచయిత్రికి అభినందన ఎలా తెలిపారు?

కెరీర్ ప్రారంభంలో అనంతశ్రీరామ్ నా దగ్గరకొచ్చాడు. అప్పటికి అతను ఓ నాలుగైదు పాటలు రాసుంటాడు. ‘నువ్వు రాసిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు’ అనడిగాను. తను చెప్పాడు. పల్లవిలోనే నాలుగైదు తప్పులు చెప్పాను. ‘నువ్వు గొప్పగా రాయబోతున్నావ్. నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండబోతోంది. సో... నిరంతరం నీ తప్పుల్ని వెతికి చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. మెచ్చుకోడానికి లేను’ అని చెప్పాను. తను నా మాటల్ని స్పోర్టీవ్‌గానే తీసుకున్నాడు. బాగా రాసేవాళ్లను నేను అభినందించను. వాళ్ల విషయం కఠువుగా ప్రవర్తిస్తా. ఎందుకంటే నిజమైన రచయిత అభినందనలకోసం చూడడు. మెప్పులు పొందకపోయినా.. అక్షరంతోనే జర్నీ చేస్తాడు. అలాంటి వాళ్లు ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే.. నా భార్య విషయంలోనే కూడా అలాగే ఉన్నాను. ‘గొప్పగా రాశావ్. రాయడంలో ఆనందాన్ని పొందు. ఇంకొకరికి చూపించి మెప్పు పొందాలని మాత్రం చూడకు. అలా చేస్తే రాయాలనే తపన ఆగిపోయే ప్రమాదం ఉంది’ అని చెప్పాను. అలా అన్నానని నాపై అలిగింది తను.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top