వంటింటి ఆరోగ్యం... | Sakshi
Sakshi News home page

వంటింటి ఆరోగ్యం...

Published Sat, Jun 16 2018 12:34 AM

Mustard will protect our family from many health problems - Sakshi

వంటింట్లో పోపుల డబ్బాలో ఉండే ఆవాలు మన కుటుంబాన్ని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. చిన్నగా అతి సూక్ష్మంగా కనిపించే ఆవాలలో ప్రకృతి ఎన్నో శక్తులు నింపింది. తాలింపులో ఆవాలను ఉపయోగిస్తాం. మన పూర్వీకులు ఆవాలలో ఉండే గుణాలు గుర్తించి వీటిని వంటల్లో వేశారు. ఆవాలు ఎరుపు, నలుపు, తెలుపు రంగుల భేదాలతో కొద్దిగా కారపు రుచితో వగరుగా ఉంటాయి.ఈ ఆవాలను ఉపయోగించి, వ్యాధులు రాకుండా నివారించుకుంటూ,  ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. వజ్రాయుధంలాంటి ఆవాల గురించి కొన్ని విశేషాలు... 

ప్రతిరోజూ నాలుగు గ్రాముల నల్ల ఆవాలను మింగి, నీరు తాగితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్దకం పోతుంది. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి, దానిని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్‌ తలనొప్పి తగ్గుతుంది.పచ్చిఆవాలను నీళ్లతో కలిపి మెత్తగా నూరి, దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి జుట్టు రాలి అప్పుడప్పుడే బట్టతల వస్తున్న చోట రాయాలి. ఇలా చేస్తే అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి.జలుబు వల్ల ముక్కు నుంచి నీరు కారుతుంటే పాదాల మీద, పాదాల కింద ఆవాల తైలాన్ని రాయాలి. ఇలా చేస్తే తెల్లవారేసరికి మంచి గుణం కనిపిస్తుంది. ఆవాలపిండిని నీటితో కలిపి తాగడం వల్ల, వాంతులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ అవి వెంటనే తగ్గిపోతాయి. ఆ తరవాత నల్ల ఆవాల పిండిని తడి చేసి పొట్ట మీద రాయాలి.  నల్ల ఆవాల తైలాన్ని గొంతుపై మర్దన చేస్తే గొంతు వాపు తగ్గుతుంది.  ఆవాలు, పత్తి ఆకులు కలిపి మెత్తగా నూరి, తేలు కుట్టిన చోట పట్టిస్తే ఒక్క నిమిషంలో విషం విరిగిపోతుంది. కఫం, వాతం, అజీర్ణం, దురదలు, మెదడులోని దోషాలు, తలలోని చెడు నీరు, కుష్ఠు, పక్షవాతం వంటి రోగాలకు ఆవాలు బాగా పనిచేస్తాయి. 

ఆవాలను కొంచెం దోరగా వేయించి, మంచినీళ్లతో మెత్తగా నూరి ఆ ముద్దను ముక్కు దగ్గర వాసన తగిలేట్టుగా పెడితే, మరుక్షణంలోనే మూర్ఛరోగి మేల్కొంటాడు.  కొంచెం దోరగా వేయించిన ఆవాలు, బెల్లం సమంగా కలిపి మెత్తగా దంచి, బఠాణీ గింజంత మాత్రలు చేసుకుని నిలవ చేసుకోవాలి. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు ఈ మాత్రలను మంచినీళ్లలో కలిపి పూటకి ఒక మాత్ర చొప్పున, రెండు మూడురోజులు సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు తగ్గుముఖం పడతాయి. కడుపులో నులిపురుగులు ఉన్న పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతారు. అటువంటి వారికి ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలను దోరగా వేయించి, దంచి, జల్లించి నిల్వ ఉంచాలి. పళ్లు కొరుకుతున్న పిల్లలకు, అర గ్రాము పొడిని అర కప్పు పెరుగుకి  జతచేసి తాగిస్తే   పురుగులు మలంలో నుంచి బయటకు పోతాయి. పిల్లలు పళ్లు కొరకడం మానేస్తారు.కఫాన్ని తగ్గించి వేడిని పెంచుతాయి.  ఆవనూనెలో ఉప్పు కలిపిన మిశ్రమంతో చంటిపిల్లల పళ్లు తోమితే, పళ్లు గట్టిగా ఉంటాయి. 

Advertisement
Advertisement