అమ్మ చిత్ర కథలు

Mothers Day Special Tollywood Actress Special Interviews - Sakshi

వంట చేస్తూ అమ్మ తీసిన రాగాలు దేవిశ్రీని మ్యూజిక్‌ డైరెక్టర్‌ని చేశాయి!కథల పుస్తకాల్లో అమ్మ తిప్పిన పేజీలు రానాను కథానాయకుణ్ణి చేశాయి!అమ్మ కొంగు పట్టుకుని వెంట తిరిగిన రోజులునమ్రతను ఇంటికి పట్టుగొమ్మను చేశాయి! స్టార్‌లకైనా.. సామాన్యులకైనా..కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ అన్నీ అమ్మే.

పాలు పట్టినట్లే కథల్ని పడుతుంది అమ్మ.తేనెల్ని చిలికినట్లే మాటలు నేర్పుతుంది అమ్మ.పాలబువ్వ పెడుతూనే..బతుకు తోవల్ని చూపుతుంది అమ్మ. నేడు ‘మదర్స్‌ డే’. ఈ సందర్భంగా ఇస్తున్నఈ మూడు ఇంటర్వ్యూలు.. ముగ్గురమ్మల చిత్ర కథలు!

అమ్మ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? 
దేవిశ్రీ ప్రసాద్‌: అమ్మ అనగానే ఎవరికైనా ప్రేమే గుర్తుకు వస్తుంది. లైఫ్‌లో మనం  ఏం చేసినా, ఏమీ చేయకపోయినా మనల్ని మనస్పూర్తిగా సపోర్ట్‌ చేసేది అమ్మ మాత్రమే. కేవలం తల్లిదండ్రులు మాత్రమే. ఒకవేళ తప్పు చేసినప్పుడు కూడా క్షమించేసి మళ్లీ చేయరు అని మనల్ని నమ్మి, మరోసారి చేయకూడదని కోరుకునేది అమ్మ మాత్రమే. పిల్లలకు, అమ్మకు ఉండే గ్రేట్‌ కనెక్షన్‌ అది. ఈ ప్రపంచం ఇంత అందంగా, ఆనందంగా ఉంటుందంటే అది అమ్మ ప్రేమ వల్లే. 

మీరు రాక్‌స్టార్‌ కదా... మీ అమ్మగారికీ మ్యూజిక్‌ మీద ఇంట్రెస్ట్‌ ఉందా?
మా మదర్‌కు మ్యూజిక్‌ అంటే చాలా ఇంట్రెస్ట్‌. మా అమ్మమ్మగారు (దేవి మీనాక్షి) చాలా పెద్ద సింగర్‌. అమ్మ వంట చేస్తూ రాగాలు పాడతారు కానీ పూర్తిస్థాయిలో ఆమ్మ పాడటం మేం విన్నది లేదు. అమ్మకు చాలా సిగ్గు. తను ఏ పని చేసినా అందులో సంగీతం ఉండాల్సిందే. మ్యూజిక్‌ వింటూనే వంట చేస్తారు. అలాగే అమ్మ మ్యూజిక్‌ని బాగా జడ్జ్‌ చేయగలుగుతారు. ‘రేయ్‌ ఈ పాట చాలా బావుంది రా’ అని అమ్మ చెప్పిన పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి.

మీకు సంగీతంపై ఆసక్తి పెరగడంలో మీ అమ్మగారి పాత్ర ఎంత? 
నా కెరీర్‌ ఇలా బిల్డ్‌ అవ్వడానికి కారణం మా మదర్‌. మేం చెన్నైలో కొత్త ఇల్లు రెడీ అయ్యే వరకూ అద్దె ఇంట్లో ఉన్నాం. అప్పుడు మా అమ్మమ్మగారు ఊరికి వచ్చారు. మా అమ్మమ్మగారు మా అమ్మతో ‘ఇక్కడ ఎవరో సంగీత విద్వాంసులు ఉన్నట్టున్నారు. వాళ్లు వేసుకునే బట్టలు ఆ ఇంటి ముందు ఆరేసున్నాయి. ఎవరో కనుక్కో’ అని చెప్పారు. మా అమ్మ కనుక్కోగా అది మాండలిన్‌ శ్రీనివాస్‌గారి ఇల్లు అని తెలిసింది. మా అమ్మగారి ఆనందం అంతా ఇంతా కాదు. నాకు మ్యాండలిన్‌ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. మ్యాండోలిన్‌ శ్రీనివాస్‌గారు ఎవరో కూడా తెలియదు. వెంటనే నన్ను తీసుకెళ్లి శ్రీనివాస్‌గారి దగ్గర జాయిన్‌ చేశారు అమ్మ.

అప్పుడే పాడటం, వయోలిన్‌ నేర్చుకుంటున్నాను. శ్రీనివాస్‌గారి దగ్గరకు వెళ్లినప్పుడు నా కళ్లలో కళ్లు పెట్టి చూసి ‘నీకు నిజంగా ఆసక్తి ఉందా?’ అని అడిగారు.  ‘ఉంది’ అన్నాను. ‘రేపటి నుంచి రా’ అన్నారు. అప్పటినుంచి అన్నీ మానేసి ఆయనతో సంగీతం నేర్చుకున్నాను. అన్నయ్య అని పిలిచేవాణ్ణి. మా అమ్మగారి ఇంట్రెస్ట్‌ మీద నేర్చుకోవడం స్టార్ట్‌ చేసిన నేను సంగీతంలో గొప్పతనం తెలుసుకొని ఆయన దగ్గర 10–12 ఏళ్లు సంగీతం నేర్చుకున్నాను. ఎక్కువ శాతం వాళ్లింట్లోనే ఉండేవాణ్ణి. వాడ్ని కొంచెం ఇంటికి పంపిస్తారా? అని మా వాళ్ల శ్రీనివాస్‌గారి ఇంటికి ఫోన్‌ చేసేవారు.

అమ్మ బ్యాడ్‌ మూడ్‌లో ఉన్నప్పుడు పాట పాడి చీర్‌ చేస్తారా? 
ఆవిడ ఇప్పటి వరకు బ్యాడ్‌ మూడ్‌లో ఉండటం నేను చూడలేదు. ఆవిణ్ణి మేము చీర్‌ చేసే అవకాశం మాకెవ్వరికీ ఇప్పటివరకూ ఇవ్వలేదు. అందుకే తను చాలా గ్రేట్‌. ఎప్పుడూ మాకేం కావాలో చూసుకోవడమే తప్ప తనని చూసుకోనివ్వరు. హాలీడే వెళ్దాం అంటే అవన్నీ ఎందుకులే మీ పని చేసుకోండి అంటారు.

మిమ్మల్ని చూసి మీ మదర్‌ ప్రౌడ్‌గా ఫీల్‌ అయిన సందర్భం ఏదైనా ఉందా?
ఎప్పుడూ ప్రౌడ్‌గానే ఫీల్‌ అవుతుంటారు. ప్రత్యేకంగా ఒక్క సందర్భం మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ‘కలుసుకోవాలని’ సినిమాలో ‘ఆకాశం తన రెక్కలతో నను కప్పుకుపోవాలి’ అనే పాట రాశాను. అది రాసిన వెంటనే అమ్మ, నాన్నలకు వినిపించా. నేను ఏ పాట రాసినా అమ్మానాన్నలకు ఫస్ట్‌ వినిపించడం నాకు అలవాటు. అందరం డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుంటాం. చెల్లి, తమ్ముడు, బావ అందరికీ వినిపిస్తా.  ఒక అమ్మాయి తనకు రాబోయే వాడు ఎలా ఉండాలనే సందర్భంలో ఆ పాట రాశాను.

పాట వినిపించిన  వెంటనే నన్ను హగ్‌ చేసుకున్నారు. ‘ఒక అమ్మాయిలా ఆలోచించి ఎలా రాయగలిగావు? నాకు పెళ్లయ్యే ముందు నా ఆలోచనలు ఇలానే ఉండేవి. చాలా బావుంది.. చాలా బావుందంటూ’ మెచ్చుకున్నారు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే ‘బావుంది’ అని మాత్రమే చెప్పే ఆవిడ ఇంత బాగా మెచ్చుకున్నారంటే నాకు ఇంకా ఆనందంమేసింది. నాన్నగారి రచయిత కాబట్టి బాగా రాశావు, ఇంకోసారి పాడు అన్నారు. ఆ పాటను, అమ్మ పొగడ్తను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. పది ఆస్కార్లు ఒకేసారి వచ్చినంత ఆనందం.  

మీరు కంపోజ్‌ చేసిన పాటల్లో మీ అమ్మకు బాగా నచ్చిన పాటలు? 
 ఇందాక చెప్పిన ‘ఆకాశం తను రెక్కలతో’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో ‘ఘల్‌ఘల్‌ ఘల్‌ఘల్‌..’ మా అమ్మ, నాన్న ఇద్దరికీ ఇష్టం. అలాగే నేను చేసిన వాటిలో క్లాసికల్‌ టచ్‌ ఉన్న సాంగ్స్‌ అన్నీ తనకు ఇష్టం. బేసిక్‌గా అమ్మకు నేనేం చెసినా నచ్చుతుంది. అలా అని పార్షియాలిటీ ఉండదు. వేరే మ్యుజిషియన్స్‌ సాంగ్స్‌ నచ్చినా జెన్యూన్‌గా అభినందిస్తారు.

మీ పేరు కూడా మీ అమ్మ వాళ్ల పేరెంట్స్‌ పేర్లని తెలిసింది?
మా అమ్మమ్మగారి పేరు దేవి మీనాక్షి. తాతగారి పేరు ప్రసాదరావు. దేవి ప్రసాద్‌ ఇద్దరి పేర్లు కలిపి శ్రీ జత చేసి దేవి శ్రీ ప్రసాద్‌ అని పెట్టారు. పెట్టింది కూడా నాన్నగారే. మా అమ్మగారి పేరెంట్స్‌కి మా నాన్నతో అటాచ్‌మెంట్‌ ఎక్కువ. వాళ్లు కూడా అమ్మ కంటే నాన్ననే ఎక్కువ సపోర్ట్‌ చేసేవారు. నాన్న అల్లుడిలా కాక కొడుకులా ఉండేవారు. నేను కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఆల్బమ్స్‌ చేసేటప్పుడు మ్యుజిక్‌ కంపెనీ వాళ్లు  ‘దేవి శ్రీ ప్రసాద్‌’ అంటే చాలా పెద్ద వాళ్ల పేరులా ఉంది. పేరు మార్చుకోమని అడిగారు. నేను మార్చుకోను అని చెప్పాను. నేనేం చేసినా ఇదే పేరుతో చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నన్ను చీర్‌ చేస్తూ నా ఫ్యాన్స్‌ డీఎస్పీ డీఎస్పీ అని అరుస్తారు. వాళ్లు నాకోసం అరుస్తున్నారనే దానికంటే వాళ్లు పెట్టిన పేరుకి అందం తెచ్చిపెట్టాను అనిపిస్తుంది. 

పెళ్ళి చేసుకోమని అడగరా?
అది ఎప్పుడూ ఉంటుంది. పెళ్ళి చేసుకోవడం ఒకరి చేతిలో ఉండదు. ఏ పేరెంట్స్‌ అయినా వాళ్ల పిల్లల్ని పెళ్ళి చేసుకో అని ఫోర్స్‌ చేయకూడదు. అది కరెక్ట్‌ కాదేమో. నా కోసం కార్‌ కొను, పరిగెత్తు, అది చేయ్‌ ఇది చేయ్‌.. ఇలా ఏది అడిగినా ఓకే. కానీ నా కోసం నువ్వు పెళ్ళి చేసుకో అని చెప్పకూడదు అని నా ఫీలింగ్‌. 

మీ సక్సెస్‌లో ఎంత క్రెడిట్‌ మీ అమ్మగారికి ఇస్తారు. 
నా అచీవ్‌మెంట్‌ అంతా మా అమ్మకే ఇస్తాను. నేను డే అండ్‌ నైట్‌ వర్క్‌ చేస్తాను అది ఇదీ అని అంటారు. అది నా జాబ్, నా డ్రీమ్‌. వచ్చిన పేరు నిలబెట్టుకోవాలి ఇలా చాలా కారణాలుంటాయి. అదెప్పుడూ కష్టం అనిపించలేదు. అది నా లైఫ్‌స్టైల్‌ అయిపోయింది. ఫేమ్, నేమ్‌ ఇలా అన్నీ వస్తాయి. హోమ్‌ మేకర్స్‌గా ఉండే మదర్స్‌కు ఎక్కువ గుర్తింపు ఉండదు.

అమ్మకు నచ్చితే అది నాకు ఆస్కారే 
హోమ్‌ మేకర్స్‌ని మించిన అచీవ్‌మెంట్‌గానీ, జాబ్‌గానీ లేదని నా ఫీలింగ్‌. ఎవరెన్ని పనులు చేసినా ఇంటిని వాళ్లు మేనేజ్‌ చేయడం టఫ్‌ జాబ్‌. వాళ్ల త్యాగం, వాళ్ల వల్ల మిగతా వాళ్ల లైఫ్‌ అంతా ఈజీ అయిపోతుంది. మా అందరి కంటే ముందు లేస్తారు. అందరు పడుకున్న తర్వాత పడుకుంటారు ఇప్పటికి అదే అలవాటు. ఇంక వద్దూ రెస్ట్‌ తీసుకో అమ్మా అన్నా వినరు. మదర్స్‌ అంటే అంతేనేమో? వాళ్లు లైకపోతే మన లైఫ్‌ ఇంత ఈజీగా ఉండదు. మా నాన్నగారు మాకు ధైర్యం.      అమ్మ నా కాన్ఫిడెన్స్‌.

మీ అమ్మ చేసే వంటల్లో మీకేది ఇష్టం?  
నాకు రెగ్యులర్‌ టైమింగ్స్‌ అని ఉండవు. ఒక్కోసారి 2కి తింటా. మరోసారి 3, 4.  ఎప్పుడు ఆకలి వేసినా అమ్మ కాల్‌ చేస్తుంది. రేయ్‌ ఆకలవుతుందా? అని. నాకు షాక్‌ అనిపిస్తుంది. నా ఆకలి తనకెలా తెలిసిపోతుందని? ఫస్ట్‌లో షాక్‌ అయ్యేవాణ్ణి. తర్వాత అలవాటైపోయింది. అమ్మగారు చేసే ఎగ్‌రైస్‌ అంటే చాలా ఇష్టం. షోలు చేస్తూ విదేశాల్లో ఉన్నా ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్‌ తినాలినిపించేది ఎగ్‌రైస్‌. అది తిన్న తర్వాత  మళ్లీ ఇంట్లో పడ్డాం అనే ఫీలింగ్‌ వస్తుంది. పైనా స్టూడియోలో ఉంటాను. సేమియా తినాలిపించింది అని నాకు అనిపించినా తనకు తెలిసిపోతుంది. కింద నుంచి ఫోన్‌ చేస్తుంది. ‘రేయ్‌ సేమియా చేశాను తినడానికి కిందకు రా’ అని. మదర్స్‌కు మాత్రమే వాళ్ల పిల్లలతో ఓ విచిత్రమైన బంధం ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా వాళ్లలో ఓ భాగమే కదా. 

మీ అమ్మగారు తనకు ఏదైనా కావాలని అడుగుతారా? 
అమ్మ ఎక్కువ ఏదీ అడగరు. మా ఫాదర్‌ ఆ టైమ్‌లో ఆయన టాప్‌ రైటర్‌. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చుపెడుతున్నారో తెలియదు. ఆయన రెమ్యునరేషన్‌ లెక్క చూసుకుంది లేదు. అంతా అమ్మగారు హ్యాండిల్‌ చేసేవారు. ఇంటికి, మా అందరికీ ఖర్చుపెట్టడం తప్ప ఆవిడ సొంతంగా ఖర్చు పెట్టుకోవడం తనకు అస్సలు తెలియదు. ‘నువ్వేమైనా కొనుక్కో’ అని నాన్న తిట్టేవారు. ఎప్పుడో ఓసారి షిరిడీ తీసుకెళ్లమన్నారు. మా అందరి షెడ్యూల్స్‌ ఎప్పుడు బిజీగానే ఉండేవి. అమ్మానాన్న ఇద్దర్నీ కలిపి తీసుకెళ్లడం కుదర్లేదు. ఇటీవల ఓసారి షిరిడీ వెళ్లాం. చిన్నపిల్లలా చాలా సంతోషపడింది. లోపలికి వెళ్లాం. బయటకు రాగానే మళ్లీ ఇంకోసారి చూద్దాం రా అని అడిగింది. అమ్మ అలా ఎప్పుడూ అడగలేదు. ఏదైనా అడగండి అని చెబుతుంటా. అడగరు. 

కెరీర్‌ బెస్ట్‌ మూమెంట్స్‌ అన్నీ అమ్మతో షేర్‌ చేసుకుంటారా? 
కచ్చితంగా షేర్‌ చేసుకుంటాను. చిరంజీవిగారు ఇలా అన్నారు. మహేశ్‌ ఇది చెప్పారు అని చెబుతుంటాను. 

మీకు ఏదైనా హార్డ్‌ టైమ్స్‌లో మీ మదర్‌ స్ట్రాంగ్‌గా నిలబడి మీకు స్ఫూర్తిగా నిలిచిన సందర్భాలున్నాయా?
మా చిన్నప్పుడు నాన్నగారికి హార్ట్‌ అటాక్‌ రావడంతో ఆరోగ్యం దెబ్బతింది. చాలా పెద్ద ప్రమాదం. చాలా రోజులు హాస్పిటల్‌లోనే ఉన్నారు. తర్వాత కోలుకున్నారు. ఇది మెడికల్‌ మిరాకిల్‌ అని డాక్టర్స్‌ అన్నారట. ఆ అద్భుతానికి ఆయన కాన్ఫిడెన్సే కారణమట. మనకేం జరగదు అని అనుకునే స్వభావం ఆయనది.  చెన్నైకు మేం కొత్త. సిటీకి అటువైపు మా స్కూల్, హాస్పిటల్‌ ఏమో ఇటువైపు. ఉదయాన్నే వెళ్లి డాడీకి ఏం కావాలో చూసుకొని మమ్మల్ని స్కూల్‌ దగ్గర డ్రాప్‌ చేసి మళ్లీ హాస్పిటల్‌కి వెళ్లేవారు. మా స్కూల్‌ అయిపోయే టైమ్‌కు మమ్మల్ని తీసుకొచ్చేవారు. ఇలా ఇబ్బంది అవుతుందని హాస్పిటల్‌ నుంచి స్కూల్‌కు వెళ్లే ఈ గ్యాప్‌లో డ్రైవింగ్‌ క్లాసులకు వెళ్లి కార్‌ డ్రైవ్‌ చేయడం నేర్చుకొని హాస్పిటల్‌ టు స్కూల్‌ తిరిగేవారు.

నాదీ, తమ్ముడిది వేరే స్కూల్‌ చెల్లిది వేరే స్కూల్‌. ఇప్పుడు తలుచుకుంటే భయమేసేది.  30 ఏళ్లు నాన్నగారిని గాజుబొమ్మలా చూసుకున్నారు అమ్మ. అలానే ఉండిపోయారు. అది త్యాగం అని కూడా కాదు. నాన్నకు ఏ టాబ్లెట్‌ దేనికో కూడా తెలియదు. అమ్మ ఏది ఇస్తే అదే వేసుకోవడమే. అలాంటి కాంబినేషన్‌ ఎక్కడా చూడలేదు.  వాళ్లకు ఏ విషయంలో అసంతృప్తి లేదు. మేం నేర్చుకున్నది అదే. ఇద్దరూ మా కోసం చేసిన త్యాగాలు, మమ్మల్ని ప్రోత్సహించిన తీరు మాటల్లో చెప్పలేనిది. ఆవిడ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.  నువ్వు కానీ ఏదైనా జాబ్‌ టేకప్‌ చేసుంటే మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ అయ్యేదానివి అని చాలాసార్లు చెప్పాను. మా అందరికంటే సక్సెస్‌ఫుల్‌ తనే నా అభిప్రాయం. 

నేను ‘లీడర్‌’లా ఉండడం అమ్మకు ఇష్టం 

మదర్స్‌ డే జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా?
రానా: మదర్స్‌ డే అనేది కొత్తగా వచ్చింది.. అంతే. అమ్మతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఎక్కువ అమ్మ ప్రభావమే. నాన్నగారు, తాతగారు సినిమాల్లో ఉన్నప్పటికీ చిన్నప్పుడు నేను సినిమా కథలకన్నా కామిక్‌ బుక్స్‌ బాగా చదివాను. ఆ బుక్స్‌ అన్నీ అమ్మ ఇచ్చినవే. ఇప్పుడు ‘అమర్‌చిత్ర కథ’ కామిక్‌ బుక్స్‌తో అసోసియేట్‌ (అమర్‌ చిత్రకథ లెర్నింగ్‌ సెంటర్‌ ఏర్పాటు) అయ్యున్నానంటే అది అమ్మ వల్లే. నా చిన్నప్పుడు అమర్‌ చిత్రకథ పుస్తకాలు ఇచ్చింది. ఆ పుస్తకాలన్నీ నాతో ఇంకా ఉన్నాయి. 

అమ్మ కథలు కూడా చెప్పేవారా? 
చెప్పేవారు. అలా నాకు అలవాటు అయింది. చాలా సైలెంట్‌గా నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది మా అమ్మే. చిన్నపుడు నాకు లెక్కలు వచ్చేవి కాదు. మా స్టూడియో (రామానాయుడు)లో చాలా పనులు చేసేవాణ్ణి. లెక్కల విషయానికొస్తే మాత్రం దూరం పారిపోయేవాణ్ణి (నవ్వుతూ). దాంతో మా అమ్మ నన్ను స్టూడియోలో కూర్చోబెట్టి అకౌంట్స్‌ రాయించేది. ప్రతి సమ్మర్‌ హాలిడేస్‌లో కాసేపు ఇలా ఎంగేజ్‌ అయ్యేవాణ్ణి. ఈ రోజు ఇలా సక్రమంగా లెక్కలు వేస్తున్నానంటే అప్పుడు స్టూడియోలో రాసిన అకౌంట్సే కారణం. ఆ తర్వాత చదివింది ఏమీ లేదు. 

అమ్మ లెక్కలు నేర్పారు. ఎలా బతకాలో కూడా నేర్పించారా? 
కథలతో బతకాలని నేర్పింది అమ్మే. ఆర్టిస్ట్‌ కథ (చేసే సినిమా కథలను ఉద్దేశించి)ల మీదే బతుకుతాడు. ఆ కథలు నాకు త్వరగా తెలిసింది అమ్మ ద్వారానే. అమ్మ కథలు నేర్పిన విధానమే ఇప్పుడు నా లైఫ్‌స్టైల్‌లో రిఫ్లెక్ట్‌ అవుతోంది.

చిన్నప్పుడు స్కూల్‌కు బాగానే వెళ్లేవారా? అమ్మ కొట్టి పంపించాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయా?
ఆ.. కొట్టిందండీ.. చాలాసార్లు. ఆ తర్వాత పెద్దోడిని అయిపోయా. సైజ్‌లో చిన్నప్పటికే పెద్ద సైజ్‌లో ఉండేవాణ్ణి (నవ్వుతూ). దాంతో చేయి దాటిపోయాడు అని ఆపేసింది. అక్కడితో కొట్టుడు ఆగిపోయింది. నేను వెరీ బ్యాడ్‌స్టూడెంట్‌ని. అయితే ఇప్పుడు మా అమ్మ చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడులా ఇప్పుడు అల్లరి చేయలేను కదా.

ప్రోగ్రెస్‌ కార్డ్‌ సంతకం కోసం అమ్మను కాకా పట్టిన సందర్భాలు ఉన్నాయా? 
అన్నీ అమ్మే చూసుకునేది. మేం ఏం చేస్తున్నాం? ఏంటి? ఇలా అన్నీ నాన్నకు తెలుసు కానీ అమ్మే చూసుకునేది. నాన్న చదువు గురించి చాలా తక్కువ మాట్లాడేవారు. నాన్న మమ్మల్ని ఎప్పుడూ తిట్టలేదు. కొట్టలేదు. దేని గురించీ అరిచింది లేదు. ఇష్టమొచ్చింది చేసుకోనిచ్చారు. అయితే వెనక నుండి గమనిస్తూనే ఉండేవారు. అమ్మ మాత్రం కొట్టడం, తిట్టడం.

అయితే తక్కువ మార్కులు వచ్చాయని పెద్దగా ఫీలయ్యేది కాదు. ఒక బ్యాడ్‌ స్టూడెంట్‌తో లైఫ్‌ గడిపితే ఎలా ఉంటుందో అదంతా చూసింది మా అమ్మ. బ్యాడ్‌ అంటే బాగా బ్యాడ్‌. క్లాస్‌లో లాస్ట్‌ వచ్చే వాళ్లు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా. అందులో నేనొకడిని. అందులోనూ హైట్‌ కాబట్టి లాస్ట్‌ బెంచ్‌. నాకు సైట్‌ ఉండేది. దాంతో బోర్డ్‌ కనిపించేది కాదు. ఓహ్‌.. నాతో అమ్మ చాలా టెన్షనే పడింది.

ఎడ్యుకేషన్‌ ఇంపార్టెంట్‌ అంటారు. మీలాంటి రిచ్‌ కిడ్స్‌కు జాబ్‌ చేస్తేనే... అనే పరిస్థితి లేదు కాబట్టి మీకు తక్కువ మార్కులొచ్చినా ఇంట్లో ఫీలవ్వలేదా?
ఎడ్యుకేషన్‌ అనేది ఎవ్వరికైనా కచ్చితంగా ఇంపార్టెంట్‌. నాకు ఆర్ట్స్‌ అంటే ఇష్టమని నా చిన్నప్పటి నుంచే వాళ్లకు అర్థం అయింది. చిన్నప్పుడు నేను చదివినన్ని కామిక్‌ బుక్స్‌ బహుశా ఎవ్వరూ చదివి ఉండరేమో. అప్పుడే నా ఇంట్రెస్ట్‌ ఏంటో వాళ్లకు అర్థం అయ్యుంటుంది. ఫిఫ్త్‌ క్లాస్‌ టైమ్‌లోనే ఎడిటింగ్‌ నేర్చుకున్నాను. టెన్త్‌ క్లాస్‌లో అకౌంట్స్‌ చేసేవాణ్ణి.

నా జీవితంలో ఏ దశలో అయినా నేను సినిమాకు సంబంధించినవే నేర్చుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు వాళ్లు ఏం కావాలో దానికి సంబంధించినదే నేర్చుకుంటుంటారు కదా. నాకు స్టాండర్డ్‌ ఎడ్యుకేష  మీద నమ్మకం లేదు. ఇవాళ ఏదైనా నేర్చుకోవాలంటే ఇంటర్న్‌నెట్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. అన్నీ తెలుస్తాయి. ఆ సిస్టమ్‌లో నేను పెరగలేదు. వీడు ఇలానే నేర్చుకుంటాడేమో అని మా అమ్మ అనుకుంది.. అర్థం చేసుకుంది. అందుకే ఆర్ట్స్‌లో షైన్‌ అవుతానని అనుకుంది.
 

ఏదో సందర్భంలో అమ్మ కన్నీళ్లు పెట్టుకునే పనులు చేస్తాం కదా... అలాంటివి ఏమైనా మీ లైఫ్‌లో ఉన్నాయా?
అబ్బో! లెక్కలేదండి బాబు. బోలెడు అంటే బోలెడు ఉన్నాయి. సిగిరెట్‌ తాగానని.. ఇలా చాలా ఉన్నాయి.

అప్పుడు ఇలాంటివి మళ్లీ చేయకూడదు అనుకున్న సందర్భాలు..? 
మా అమ్మ స్ట్రిక్ట్‌గా ఎప్పుడూ లేరు. ఆ ఫ్రీడమ్‌ ఎప్పుడూ ఉంటుంది. నేను బాగా చదువుకునేవాణ్ణి కాదు కానీ, అంత పెద్ద బ్యాడ్‌ మూమెంట్స్‌ ఏం లేవు. అన్నీ చిన్న చిన్నవే. వాటిని కరెక్ట్‌ చేసుకుంటూ వెళుతుంటాను.

మీ బర్త్‌డేలు ఎలా చేసేవారు?
మాది జాయింట్‌ ఫ్యామిలీ. మేం 8, 9 మంది పిల్లలం కలసి ఉండేవాళ్లం. మా ఇంట్లో చాలా మంది నవంబర్‌  – డిసెంబర్‌ టైమ్‌లో పుట్టాం. అలా సెలబ్రేషన్స్‌ రెండు నెలలు సాగుతుండేది. మనకు నచ్చినా నచ్చకపోయినా సెలబ్రేషన్స్‌ అనేవి జరుగుతూనే ఉండేవి. 

అమ్మ చేసే వంటకాల్లో బాగా ఇష్టపడి తినేవి? 
తను రెగ్యులర్‌గా కుక్‌ చేయకపోయినా అప్పుడప్పుడూ బిర్యానీ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. అది ఇష్టంగా తింటాను.

అమ్మ కోసం ఏదైనా చేసి పెట్టారా?
అంత ట్యాలెంట్‌ నాకు లేదు. బ్రెడ్‌ టోస్ట్‌ లాంటిది ఏదైనా చేసుంటానేమో కానీ పెద్ద పెద్దవి కష్టం. 

మీ అమ్మగారు కుటుంబం మొత్తాన్ని బాగా చూసుకుంటారని, కుటుంబం మొత్తం కలసి ఉండటానికి ఈవిడ మెయిన్‌ పిల్లర్‌ అని విన్నాం.. 
100 పర్సెంట్‌ కరెక్ట్‌. ఆమె అందరూ కలసి ఉండాలనుకుంటుంది. చాలా సింపుల్‌ పర్సన్‌. మనీ, ఫేమ్‌ ఇవేమీ తనను ఎఫెక్ట్‌ చేయవో లేక తను అసలు వాటిని పట్టించుకోదో నాకు తెలియదు. ఆవిడ చేసేది ఏదైనా చాలా నార్మల్‌గా, రియల్‌గా ఉంటాయి. ఆర్టిఫీషియల్‌గా ఏదీ ఉండదు. 

మీ అమ్మ నుంచి అడాప్ట్‌ చేసుకున్న క్వాలిటీ? 
అమ్మ ఏదైనా ఫిక్స్‌ అయితే ఫిక్స్‌ అయినట్టే. దాని గురించి లాగడం, నాన్చడం ఉండవు. చాలా విషయాల్లో స్ట్రయిట్‌ ఫార్వార్డ్‌. అది నాకు నచ్చుతుంది. ఆ లక్షణాన్ని ఫాలో అవుతుంటా.

కొడుకు పెళ్లి చేయాలని అమ్మకు బాగా ఉంటుంది. మరి ప్రెషర్‌ చేయడం లేదా? 
అస్సలు లేదు. ఓ సరదా సంఘటన జరిగింది.. అది చెబుతాను. ఇది వింటే మీకు మా మదర్‌ ఎలాంటి ఆవిడో అర్థం అవుతుంది. ఓ రోజు అమ్మా నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను. నువ్వే వేస్ట్‌గా ఇంట్లో పడున్నావు.. ఇంకో అమ్మాయిని కూడా తెచ్చి పెట్టుకోవాలా మేము? అన్నారు. ఆవిడ  అంత సరదాగా, ప్రాక్టికల్‌గా ఉంటారు (నవ్వుతూ).

కొడుకు చిక్కిపోతే అమ్మకు కంగారుగా ఉంటుంది. ‘బాహుబలి’ కోసం లావైన మీరు ఇప్పుడు మరీ సన్నగా ఉన్నారు..  
ఏదైనా కథ కోసమే. నేను సక్సెస్‌ఫుల్‌ ఫ్యామిలీలో పుట్టాను. ఏ పని చేయకపోయినా నన్ను చూసుకునే పరిస్థితిలో మా వాళ్లు ఉన్నారు. అలాగని నేనేమీ చేయకుండా ఉండలేను. నా లైఫ్‌కి ఓ అర్థం ఉండాలిగా. మా అమ్మ దాన్ని అర్థం చేసుకుంది. జస్ట్‌ ఊరికే ఓ పని చేయాలనుకుని చేయడం మానేశాను. ఊరికే ఓ సినిమా చేయను నేను. కథ లేకపోతే సినిమా మొదలుపెట్టను. అలాంటి థాట్‌ ప్రాసెస్‌లో ఉన్నాను. ఆ విషయాన్ని అమ్మ గ్రహించింది. అందుకే బరువు తగ్గినా, పెరిగినా సినిమాల కోసమే కాబట్టి టెన్షన్‌ పడదు.

‘బాహుబలి’లో మీరు అతి కిరాతకుడు భల్లాలదేవగా కనిపించినప్పుడు మీ అమ్మగారు ఏమన్నారు?
‘బాహుబలి’ సినిమా  చేసే సమయంలో సినిమా కథ చెప్పాను అమ్మకు. ముఖ్యంగా సినిమాలో నేను మా అమ్మను చంపేసే సీన్‌ ఉంది కదా.. దాని గురించి చెప్పాను. ఒక్కసారి నా వైపు చూసి ‘ఒరేయ్‌.. ఇలాంటి సినిమాలు చేస్తున్నావేంట్రా నువ్వు?’ అని నవ్వింది. ఆ రోజు ఆ సీన్‌ చెప్పకుండా ఒకేసారి థియేటర్లో డైరెక్ట్‌గా సినిమా చూపిస్తే ఆవిడకు అనవసరమైన ఆలోచనలు వచ్చే చాన్స్‌ ఉండేదేమో (పెద్దగా నవ్వుతూ).

మీరు చేసిన సినిమాల్లో ఏ పాత్ర ఆమెకు బాగా ఇష్టం?
‘లీడర్‌’లో అర్జున్‌ ప్రసాద్‌ పాత్ర తనకు బాగా ఇష్టం. ఎందుకంటే అర్జున్‌ ప్రసాద్‌ బాగా చదువుకున్నవాడు. యాక్చువల్లీ రానా అనే తన కొడుకు అంత గుడ్‌ బాయ్‌లా ఉండాలని అమ్మ కోరుకుంది. అందులో ఓ డైలాగ్‌ ఉంటుంది. ‘అతను అమెరికాలో చదువుకున్నాడు. కంపెనీ సీఈఓ’ అంటూ పొగిడే డైలాగ్‌ అది. ఆ సీన్‌ చూసి ఎంత మురిసిపోయానో తెలుసారా అంటుంది అమ్మ. 

అమ్మకు ఏదైనా గిఫ్ట్స్‌ ఇచ్చారా?
చిన్న చిన్నవే. బుక్స్‌. అందులోనూ కామిక్స్‌ ఎక్కువ ఇస్తుంటాను. మా కమ్యూనికేషన్‌ అంతా ఎక్కువ బుక్స్‌ ఇచ్చుకోవడమే.

ఎలాగూ బ్యాడ్‌ స్టూడెంట్‌ అన్నారు.. చదువు కాకుండా అమ్మకు మీ నుంచి వేరే ఏదైనా ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయా?
మళ్లీ అమ్మ చెప్పిన ఓ సంఘటన చెబుతాను. ఒకరోజు ‘ఒరేయ్‌.. చిన్నప్పుడు నువ్వు అంత బ్యాడ్‌ స్టూడెంట్‌గా ఉండటంతో నువ్వు ఇప్పుడు ఏం చేసినా బాగానే ఉంది రా’ అంది. అంటే.. ఒక్క టెన్త్‌ క్లాస్‌ పాస్‌ అవ్వడానికే బాగా కష్టపడినవాడు లైఫ్‌లో వేరే ఏది చేసినా బాగానే ఉంటుంది కదా? (నవ్వుతూ). మా అమ్మకు అలా ఉంది ఇప్పుడు. 

అమ్మ హెల్త్‌ గురించి మీరు కేర్‌ఫుల్‌గా ఉంటారా?
నేను ప్రత్యేకంగా పట్టించుకోనక్కర్లేదు. తనే చాలా జాగ్రత్తగా ఉంటుంది. హెల్దీ ఫుడ్‌ తీసుకుంటుంది.

మిమ్మల్ని ఏమని పిలుస్తారు?  
బాబు అని పిలుస్తుంది.

ఫైనల్లీ .. ఇప్పుడు ‘అమర్‌ చిత్రకథ’తో మీ అసోసియేషన్‌ మీ అమ్మగారికి రిటర్న్‌ గిఫ్ట్‌లా అనుకోవచ్చా? 
నేను అమర్‌ చిత్రకథలో ప్రస్తుతం చిన్న భాగం అయ్యానంటే కచ్చితంగా అమ్మ వల్లే. అందులో సందేహమే లేదు. అమ్మకి గిఫ్ట్‌ అని పెద్ద మాట అనను కానీ, ఇవాళ ఇలా ఉన్నానంటే తనే కారణం.

చిన్నప్పుడు మీ అమ్మగారు మీకు ఆడపిల్ల వేషం వేసి ఫోటోలు తీసిన సందర్భాలు ఉన్నాయా? 
ఒకసారి తీసింది. అప్పుడు తాత (రామానాయుడు) అబ్బాయికి అమ్మాయి వేషం ఏంటి? అని తిట్టారు. ఆ తర్వాత మళ్లీ అలా వేషం వేయలేదు. ఆ ఫొటో ఏ వయసులో తీశారో సరిగ్గా గుర్తు లేదు. 

మ్యాన్లీగా ఉండే రానా ఆడపిల్ల వేషంలో ఎలా ఉంటారో తెలుసుకుందాం.. ఫొటో చూపిస్తారా?
అస్సల.. అస్సల. అస్సల... చాన్సే లేదు. నేను బయటివాళ్లకు కనపడనివ్వకుండా లైఫ్‌ లాంగ్‌ జాగ్రత్తగా దాచుకుంటున్న ఫొటో అది. ఎవరికీ చూపించను (నవ్వేస్తూ).

అమ్మకు ముద్దు పెట్టందే కదలం 

మీ అమ్మగారి గురించి చెప్పాలంటే..
నమ్రత: ఆమెతో నా రిలేషన్‌షిప్‌ వెరీ వెరీ స్పెషల్‌. అన్‌ ప్యారలెల్‌. తనే నా ధైర్యం. నా బ్యాక్‌బోన్‌. ఫ్రెండ్‌. చాలా త్వరగా చనిపోయారు. ప్రస్తుతం నాతో లేకపోయినప్పటికీ ఆమె నేర్పిన విషయాలు నాతోనే ఉంటాయి. ఆమె తాలూకు జ్ఞాపకాలు నా మనసులో పదిలంగా ఉంటాయి.

మీ అమ్మగారి నుంచి అడాప్ట్‌ చేసుకున్న క్వాలిటీస్‌? 
నాకు ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్‌. ఆ తర్వాతే ఏదైనా. ఇది అమ్మ నుంచే అలవాటైంది. ఆమె ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇచ్చేది. ఒక స్త్రీ ఎలా ఉండాలో అమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నాను. ఇవాళ నేను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నానంటే అమ్మే కారణం.

మీతో మీ అమ్మ ఎలా ఉన్నారో మీరు మీ పిల్లలతో అలానే ఉంటారా?
అవును. మా అమ్మ చాలా శుభ్రంగా ఉండే మనిషి. అన్నీ క్లీన్‌గా ఉండాలనుకుంటారు. నేను కూడా అలానే ఉంటాను. మా పిల్లలకు కూడా అదే వచ్చింది. మహేశ్‌ కూడా (నవ్వుతూ). మా మమ్మీ ఒకేసారి ఎన్ని పనులైనా హ్యాండిల్‌ చేయగలిగేది. నేను కూడా అందులో బెస్ట్‌ అని చెప్పుకోగలను. పిల్లలకు ఫ్రెండ్‌గా, గైడ్‌లా ఉండేది. నేను నా పిల్లలతో అలానే ఉంటాను. 
     
మహేశ్‌ వాళ్ల మదర్‌తో ఎలా ఉంటారు. ఆయనెంత గుడ్‌ సన్‌? 
మహేశ్‌ చాలా మంచి కొడుకు. మహేశ్‌ తన ఫీలింగ్స్‌ని ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ చేయకపోయినా తన హార్ట్‌ గోల్డ్‌. మా అమ్మంటే నాకు ఇష్టం అదీ ఇదీ అని మహేశ్‌ ఎప్పుడూ బయటకు చెప్పడు. వాళ్ల అమ్మ మీద తనకున్న ప్రేమ అన్‌ప్యారలెల్‌. 

‘మదర్స్‌ డే’ అంటే పిల్లలు గిఫ్ట్‌లు ఇవ్వాలని కోరుకుంటారా?
మనుషుల్ని గిఫ్ట్స్‌తో గెలవాలనుకోవడం కరెక్ట్‌ ఐడియా కాదని నేననుకుంటాను. వాళ్లతో మనం ఎలా ఉంటున్నాం? ఎలా నడుచుకుంటున్నాం? వాళ్లతో మన ఎమోషన్‌ ఏంటి... అన్నది ముఖ్యం. తల్లిదండ్రులకు గిఫ్ట్స్‌ ముఖ్యమే కాదు. వాళ్లతో మంచిగా ఉంటున్నామా? జాగ్రత్తగా చూసుకుంటున్నామా? ప్రేమ చూపిస్తున్నామా? అవి ముఖ్యమని నేననుకుంటాను. నేనొక తల్లిగా నా పిల్లల నుంచి ఇలాంటివి కోరుకుంటాను తప్పితే నెక్లెస్, ఫోన్, ఫ్లాట్‌ ఇవేం కాదు. వాటి బదులు నా మీద ప్రేమ, ఆప్యాయత, గ్రాటిట్యూడ్‌ చూపించాలని కోరుకుంటాను. 
     
మీరు మీ, సిస్టర్‌ (శిల్పా శిరోద్కర్‌) లో మీ అమ్మకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?
మా అమ్మకు మా సిస్టర్‌ అంటే బాగా ఇష్టం. 

ఎందుకలా?
ఎందుకంటే నేను మా ఫాదర్‌ ఫేవరెట్‌ కాబట్టి. 

మహేశ్‌ తన మదర్‌ని ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు?
ఇంట్లో ఉంటే ప్రతి ఆదివారం కలుస్తూనే ఉంటాం. వీలున్నప్పుడల్లా కలుస్తూనే ఉంటాం. ఏప్రిల్‌ 20న మా అత్తయ్య బర్త్‌డే. ఏప్రిల్‌ 19న కలిశాం. కేక్‌ కట్‌ చేయించాం. 

గౌతమ్, సితార మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డాడీ, మమ్మీ? అమ్మ, నాన్న?
అమ్మ, నాన్న. మహేశ్‌ ఫస్ట్‌ నుంచి చాలా క్లారిటీగా ఉన్నాడు. పిల్లలు నన్ను నాన్న అనే పిలవాలి అని నాతో చెప్పాడు. మా ఇంట్లో నేను మా అమ్మానాన్నలను మా, పప్పా అని పిలిచేదాన్ని. 

‘మదర్స్‌ డే’ని ఒకరోజు సెలబ్రేట్‌ చేసుకునే పద్ధతిని నమ్ముతారా?
మనకు ప్రతిరోజు మదర్స్‌ డేనే. మా ఇంట్లో ఒక రూల్‌ ఉంది. మా పిల్లలు ఇల్లు వదిలి ఇంటికి వెళ్లేప్పుడు అది ట్యూషన్‌కి అయినా, స్విమ్మింగ్‌కి అయినా సరే వాళ్లు అమ్మకు ముద్దు పెట్టి వెళ్లాలి. ఒకవేళ వాళ్లు ఇంట్లో ఉండి నేను బయటకు వెళ్లాను అనుకోండి.. వాళ్లకు నేను ముద్దిచ్చి బయటకు వెళ్లాలి. మహేశ్‌ కూడా ఈ రూల్‌కి అలవాటుపడ్డాడు. ఇది మాకో అలవాటు అయిపోయింది. మా తల్లిదండ్రులు అలా చేసేవారు. మా అమ్మానాన్న బతికి ఉన్నంతవరకూ ఇలానే చేసేవాళ్లం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top