మంచికి ఆద్యులు

Maneka Gandhi Earns Praise For Tweet Over Injured Monkey - Sakshi

మంచి మార్పు ఏదైనా మహిళలే అందుకు ఆద్యులు అవుతారు అని మరోసారి రుజువైంది.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ‘మానవతావాది’ అని పేరు. ట్విట్టర్‌లో ఏదైనా సమస్యను పెడితే వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆమె తన యంత్రాంగాన్ని ఆమె పరుగులు తీయించేవారు. ఇప్పుడు ఆమె లేరు. ఆమె స్ఫూర్తి మిగిలే ఉంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి మేనకా గాంధీకి సోమవారం ఒక ట్వీట్‌ వచ్చింది. ‘‘ఈ వానరం గాయపడింది. దాని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా ఎన్‌జీవోలు కానీ, యానిమల్‌ యాక్టివిస్టులు కానీ వచ్చి ఈ మర్కటాన్ని కాపాడండి. ఇది ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, రైసీనా రోడ్డు, న్యూఢిల్లీ సమీపంలో ఉంది’ అని ట్వీట్‌ చేస్తూ ఎవరో మేనకా గాంధీని కూడా ట్యాగ్‌ చేశారు.

జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ, ఆ ట్వీట్‌కు కేవలం గంటలోపే స్పందిస్తూ, ‘నన్ను ట్యాగ్‌ చేసినందుకు చాలా సంతోషం, నేను ఇప్పుడే కారు పంపిస్తున్నాను. ఆ మూగప్రాణిని వారు సంజయ్‌గాంధీ యానిమల్‌ సెంటర్‌కి చికిత్స కోసం తీసుకువెళ్తారు. కొద్ది నిమిషాలలోనే కారు అక్కడకు వస్తుంది’ అని రిప్లయ్‌ పోస్టు చేశారు. అన్నట్లే కారు వచ్చింది. వానరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ వానరం వైద్యుల సంరక్షణలో ఉంది. దాని ఆరోగ్యం బాగుంది. మంచి ఏదైనా మార్పు మహిళలతోనే మొదలౌతుంది. ప్రజల కష్టాలకు, కన్నీళ్లకు తక్షణం స్పందించడం అనేది సుష్మతో మొదలైంది. ఆమె తర్వాత మిగతా కేంద్ర మంత్రులు ఆమెను అనుసరిస్తున్నారు. మేనక కూడా సుష్మ బాటలోనే నడుస్తున్నారు. ఇప్పుడీ వానరం గురించి సమాచారం ఇచ్చింది కూడా ఒక మహిళే కావడం విశేషం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top