
హాయ్ అన్నా, మీరు డైరెక్ట్‌గా ఆన్సర్ చెయ్యరు కానీ, చదివి చూస్తే.. అందులోని అసలైన సమాధానం అర్థమవుతుంది. మీ రైటింగ్ స్టైల్ సూపర్. అన్నా... నాది వెరైటీ లవ్. నేను 2012లో ఒక అమ్మాయిని బస్టాప్‌లో చూశాను. తను నా వంక చూసి నా పక్కనే కూర్చుంది. నా పక్కన మా డాడ్ ఉండటంతో అప్పుడు నేను తనతో మాట్లాడలేకపోయా. తరువాత వన్ ఇయర్ పాటు తనని వెతికాను. దాంతో తనని చూసిన సేమ్ ప్లేస్‌లో నా నెంబర్ రాశాను. వన్ వీక్‌లో రిప్లై వచ్చింది. వరల్డ్‌లోనే నాది ఫ్యూర్ లవ్ అని అనుకున్నా. తను నన్ను ఫస్ట్ టైమ్ చూసిన వైట్ షర్ట్‌ని ఫైవ్ ఇయర్స్ అయినా అలానే దాచుకున్నా. కానీ తను జలక్ ఇచ్చింది. మొదట్లో పెళ్లి చేసుకుందాం అనేది. ఇద్దరం బీటెక్ ఫైనల్ ఇయర్. అయితే నాకు ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. తను క్లాస్ టాపర్. దాంతో ‘కెరీర్ ముఖ్యం’ అంటోంది. మనం లైఫ్‌లాంగ్ ఫ్రెండ్స్‌లానే ఉందాం అంటోంది. తను నెక్ట్స్ ఇయర్ జాబ్‌లో జాయిన్ అవుతుంది. మరి నా పొజీషన్ ఏంటన్నా?? – దిలీప్
అట్లాంటిక్ మహా సముద్రంలో ఈత కొట్టు అన్నా..?‘వద్దు సార్ మీ వెటకారాలు భరించలేకపోతున్నాను. అసలు మీరు ఇంత రఫ్‌గా చురకలు పెడుతున్నా ఈ అబ్బాయిలకు ఏంటి సార్ అట్రాక్షన్.? మీకు రాస్తూనే ఉంటారు? అసలు నేను దిలీప్ పొజీషన్‌లో ఉంటే మీ బొమ్మలో ఉన్న మీసాలను గొరిగేసి.. లవ్ డాక్టర్ డౌన్.. డౌన్.. అని బ్యానెర్లు కట్టి.. ప్లకార్డులు పట్టి.. ఉద్యమం చేసి, యువ అబ్బాయిల సంఘం ప్రెసిడెంట్ అయిపోయి.. ‘మీ పతనానికి ఏడు మెట్లు’ అనే పుస్తకం రాసి.. ప్రతి లవర్ బాయ్‌కి టెన్ రూపీస్ డిస్కౌంట్‌లో అమ్మి.. మీ ప్రాక్టీస్ ఖతం చేసే దాన్ని... కానీ...’ కానీ ఏంటి నీలాంబరీ.. ‘కానీ అన్‌ఫార్చునేట్లీ నేను అమ్మాయిని అయిపోయాను..’
పోనీ అమ్మాయిగా ఉద్యమించు నీలాంబరీ.. నీకే నా ఫుల్ సపోర్ట్..!! ‘ఎందుకు సార్.. మీ బోడి సపోర్ట్? అమ్మాయిలెవరూ మీకు అగేన్‌స్ట్‌గా రారన్న ధీమాతో మీరు ఇలా చేస్తున్నారు. పోనీలెండి సార్.. నా మాట విని ఎట్‌లీస్ట్ దిలీప్ అయినా ఉద్యమించాలని కోరుకుంటున్నాను.’ ఆల్ ది బెస్ట్ దిలీప్.. ‘సార్.. మీ విషెస్ ఏం వద్దు.. ఆన్సర్ చెప్పండి..’ నాలుగు సబ్జెక్ట్స్ పల్టీ కొట్టి ప్రేమలో కుప్పిగంతులు వేస్తే.. ఏ అమ్మాయి ఒప్పుకుంటుందన్నా దిలీప్? ముందు లైఫ్‌లో పాస్ అవ్వు. ఆ తరువాత ఆ అమ్మాయిని మించిన అమ్మాయి నీ లవ్ కోసం వస్తుంది. వైట్ షర్ట్‌కి కొత్త రంగు డై కొట్టించు. కోతలు కొట్టడం మానెయ్యి..
‘ఏంటి సార్ దిలీప్ లవ్ స్టోరీ కోతలా సార్???’ ఈ మధ్యే ‘‘హలో’’ అనే సినిమా వచ్చింది.. దాని కథే తిప్పి రాశాడు దిలీప్ అన్న.. చాలా క్రియేటివ్..!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com