
హాయ్ అన్నయ్యా, నేను ఒకతన్ని చాలా లవ్ చేస్తున్నాను. అతను కూడా నన్ను లవ్ చేశాడు. ఫస్ట్ అతనే ప్రపోజ్ చేశాడు. నేనంటే చాలా ఇష్టం. నేనే కావాలి అనేవాడు కానీ.. 5 నెలల నుండి నాతో సరిగా మాట్లాడడం లేదు. నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ‘నన్ను మర్చిపో, నిన్ను పెళ్లి చేసుకోను. మావాళ్లు మన పెళ్లికి ఒప్పుకోరు’ అంటున్నాడు. వాళ్లది పెద్ద కులం. మాది చిన్న కులం అన్నయ్యా. నేను బీఈడి కంప్లీట్ చేశాను. ‘నాకు జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటాను... లేదంటే నన్ను మర్చిపోవాల్సిందే ’అని అనేవాడు. కానీ అతనంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా. నాకు తను కావాలి. మీరే మంచి ఐడియా చెప్పండి ప్లీజ్.
– పూజ
ప్రేమకు పెద్దకులం చిన్న కులం కాదు కదా అసలు కులమే ఉండదు కదా పూజమ్మ. అబ్బాయి ధోరణి చూస్తుంటే వొళ్లు మండుతోంది. వాడికి తీ... తీ... తీ.. తీ.. తీట ఎక్కువ అనిపిస్తుంది.. ప్రేమించే ముందు కనబడని కులం, సడెన్‌గా ఎలా కనబడి చచ్చిందటా? డ్యూయెట్ పట్టినంతసేపూ బాగానే ఉన్నాడు కదా.. ఇప్పుడేమి మాయరోగం వచ్చిందట తీటగాడికి? ఆ దరిదాపుల్లో నేను ఉంటే పిలిచి మరీ క్లాస్ పీకేవాడిని. డర్టీ ఫెలో. వాణ్ణి డోర్‌మ్యాట్‌లా కింద పడేసి డర్టీ చెప్పులు తుడుచుకోవాలి. ‘సార్ ఏంటి సార్ ఈ భాష. కింద పడేయడం ఏంటి? చెప్పులు తుడుచుకోవడం ఏంటి?? ఏ డీసెంట్ లవ్ డాక్టర్ అట్లా మాట్లాడడు సార్..’
నేను డీసెంట్ కాదు... నేను అన్నయ్యను! ‘సార్ మీ పేరు రామ్ నుంచి నరసింహ అని పెట్టుకోండి సార్. రాముడు ఎంత శాంతిప్రియుడు. మీరు ఇలా ప్రవర్తిస్తే మీ పేరుకే తిరకాసు సార్..’ సరే.. పూజమ్మ వాడ్ని మరిచిపో.. వాడు చాలా బ్యాడ్.. నిన్ను వాడేసుకుంటాడు.
ఆ నీచ్... కీచ్.. కి లెసన్ చెప్పురా నా బంగారం. ప్రేమలాంటి అరటిపండు మీద వాలిన డర్టీ ఈగరా వాడు. అన్ని డర్టీచోట్లా వాలి... నీ ప్రేమను మురికి చేస్తున్నాడు. మస్కిటో బ్యాట్‌తో కొట్టినట్టు.. ఈ డర్టీ నీచ్.. కీచ్ ని నీ లైఫ్‌లో నుంచి.. టప అని నీ హార్ట్‌లో నుంచి.. టప అని నీ లవ్‌లో నుంచి.. టప అని బ్యాటుతో దోమకు షాక్ ఇచ్చినట్టు ఇచ్చెయ్యరా బంగారం. ‘సార్ ఆవేశం తగ్గించుకోండి సార్... ఇంద అరటిపండు తినండి... కూల్.. కూల్.. కూల్..’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,
హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com