నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేను ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. తను చనిపోతే నేను కూడా చనిపోవాలన్నంతగా ఇష్టపడ్డాను. తను కూడా నన్ను లవ్‌ చేసింది. పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నాం. నా భార్యగా తనని తప్ప ఎవరినీ ఊహించలేని పరిస్థితి నాది. తనే ఎవ్రీ థింగ్‌ అనుకున్నా. కానీ ఇప్పుడు తను నన్ను పెళ్లి చేసుకోను అంటోంది. నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ల పరువు పోతుందట. పెళ్లి చేసుకుందామని చాలా బతిమాలాను. చాలా ఏడ్చాను. వాళ్ల అమ్మని, నాన్నని కూడా బాగా చూసుకుంటానని మాట కూడా ఇచ్చాను. మీ వాళ్లు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుందాం అని అడిగాను. చావైనా, బతుకైనా నీతోనే అన్నాను. అయినా కానీ, తను ఒప్పుకోవడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చివాడిలా ఏడుస్తున్నాను. నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారు అన్నయ్యా?? ప్లీజ్‌ సలహా ఇవ్వండి! – ప్రేమ్‌
అమ్మో! ఈ బాధ పగవాడికి కూడా వద్దు!‘అమ్మాయిలు కొంచెం మారిపోయారు కదా సార్‌?’నీ....లాంబరీ...!!‘ఏంటి సార్‌! అట్లా అరిచారు.. శృతి మిస్‌ అయ్యిందని.. శంకరాభరణం సినిమాలో సోమయాజులు గారు ‘‘శారదా..!!’’ అని అరచినట్టు?’మరి అమ్మాయిలు మారిపోయారు అంటే గుండె అరవదా?‘ప్రేమ్‌కి ఏమి చెబుతారు సార్‌!?’ప్రేమ్‌కి ప్రేమ చెబుతా!!‘ముందు ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా.. హ్యాపీగా ఉందాం అంది కదా సార్‌!’ అంది.. ప్రేమించినప్పుడు అనరా?‘ఇప్పుడు.. దొబ్స్‌ అంటోంది కదా సార్‌ మీ సిస్టర్‌?’అనరా కుదరనప్పుడు!???‘ఏంటి సార్‌ ఇదేమయినా ప్రేమా!?! లేక దోమా!?! కుదిరితే నువ్వు.. కుదరకపోతే నేను.. అని డిసైడ్‌ చేసుకోవడానికి..?? అమ్మాయిలు కమిట్‌ అయ్యేముందు జాగ్రత్త పడాలి కానీ, కమిట్‌ అయ్యాక జాగ్రత్త పడితే.. ప్రేమలు ఏమి కావాలి? ప్రేమ్‌ ఏం కావాలి సార్‌??’ ఇప్పుడు పాయింట్‌కి వచ్చావు!! కుదురుద్ది అనుకున్నప్పుడు ప్రేమించిన నా చెల్లెలు.. పరువు, ప్రతిష్ట అని ఆలోచించలేదు!! ఇంట్లో పేరెంట్స్‌ ఎంత ప్రెషర్‌ పెడితే తాను ఒక అడుగు వెనక్కి వేసిందో.!? ప్రేమ్‌ అర్థం చేసుకోవాల్సింది అమ్మాయి ప్రేమను.. అంతకంటే గొప్ప త్యాగాన్ని...!!

‘దొబ్స్‌ అని చెప్పడం కూడా త్యాగమేనా సార్‌????’ప్రేమ్‌కి అమ్మాయంటే ప్రేమ..! ఎలాంటి అడ్డంకులు లేవు..!! అమ్మ ప్రేమ.. నాన్న ప్రేమ.. అడ్డం పడటంలేదు!! అందుకే, తన ప్రేమను ప్రదర్శించుకోగలుగుతున్నాడు!! అమ్మాయికి ఆ అవకాశం లేదు! తల్లిదండ్రుల ప్రేమ కూడా ప్రేమే అని నమ్ముతుంది. వాళ్ల పరువు.. తన పరువు అని ఒప్పుకుంటుంది. నమ్ముతుంది. అందుకే తన ప్రేమను త్యాగం చేసుకుంది. ప్రేమ్‌ అర్థం చేసుకోవాలి. తన ప్రేమను పదిలంగా ఉంచుకోవాలి. తన తల్లిదండ్రులను ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. అమ్మాయికి ఇస్తానన్న ప్రేమలో సగం పేరెంట్స్‌కి పంచాలి. లవ్‌ ఒక పరీక్ష కాదు! ఒక అవకాశం!! పంచడానికీ... పంచుతూ ఉండడానికీ...‘ఏదో తిప్పి తిప్పి నన్నయితే కన్విన్స్‌ చేశారు సార్‌! ప్రేమ్‌ కూడా కన్విన్స్‌ అయితే లైఫ్‌ బాగుంటుంది కానీ, మిగతా సగం లవ్‌ ప్రేమ్‌ ఎవరికి ఇవ్వాలి సార్‌!?!’అట్లానే సగం ప్రేమతో విలవిలలాడుతున్న ఓ ప్రేమికురాలు ఎక్కడో ఉండే ఉంటుంది ఫర్‌ ప్రేమ్‌!!‘బాగుంది సార్‌.. అక్కడో సగం.. ఇక్కడో సగం.. మొత్తం కలిపితే ఫుల్‌...... లవ్‌ సార్‌!’ అంటూ నవ్వింది నీలాంబరి!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,
హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top