
హాయ్ సర్! మీ లవ్ డాక్టర్ డైలీ ఫాలో అవుతాను. నా బాధ కూడా మీకు చెప్పాలనిపించింది సార్. నేను ఒక అబ్బాయిని ఏడేళ్లుగా లవ్ చేస్తున్నా. తను నన్ను ఇష్టపడ్డాడు. మా నేపథ్యాలు వేరు. మా ఇంట్లో కూడా ఓకే అన్నారు. ఇద్దరం కూడా మంచి పొజీషన్‌లోనే ఉన్నాం. బట్ వాళ్ల మమ్మీ నన్ను అంగీకరించడంలేదు. ‘‘మా అమ్మకి ఇష్టంలేదు, నువ్వింక నన్ను మరిచిపో’’ అంటున్నాడు. నేను వన్ ఇయర్ మెంటల్‌గా షాక్‌లోకి వెళ్లిపోయాను. ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నా. ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనే ఊహే చాలా కష్టంగా ఉంది. ప్రేమించిన వ్యక్తి దూరం కావడం చాలా నరకంగా ఉంది అన్నయ్యా. ఏదైనా మంచి సలహా ఇవ్వండి ప్లీజ్! – అను
రమ్మన్నప్పుడు రావడానికి.. పొమ్మన్నప్పుడు పోవడానికి.. ప్రేమ ఏమైనా కుక్క పిల్లా..????? ‘మరి ఏంటి సార్ ప్రేమ??’ కోతి! ‘ఏంటి సార్ ప్రేమను కోతి గీతి అంటున్నారు???’ ఎప్పుడయినా కోతి కొమ్మచ్చి ఆట ఆడావా? ‘ఏ కాలం ఆట సార్ అది నేను విననుగూడా వినలేదు.. అసలు రూల్స్ ఏంటి సార్?’ చెట్టు కింద ఫోర్ ఫీట్ సర్కిల్ గీస్తారు.. ఒక త్రీ ఫీట్ కర్రను దూరంగా విసిరేస్తారు. ఒకడు కర్రను తెచ్చి సర్కిల్‌లో పెట్టే లోపు అందరూ కోతుల్లా చెట్టెక్కేస్తారు. కర్ర తెచ్చి సర్కిల్‌లో పెట్టి.. ఎవరినైనా టచ్ చేస్తే.. ఈ సారి వాడు పోయి కర్రను తీసుకురావాలి.
కానీ టచ్ చేసే లోపలే ఎవరైనా చెట్టు దిగి కర్రను పట్టుకుంటే మళ్లీ మొదటి నుంచి గేమ్ స్టార్ట్... ‘సార్.. ఇప్పుడు కోతి ఎవరు? చెట్టు ఎవరు? కర్ర ఎవరు సార్!?’ చెట్టు ప్రేమ.. అందకుండా చెట్టెక్కింది ప్రేమికుడు.. పట్టుకోవడానికి ఎక్కుతున్నది మన అను.. కర్ర లవర్ బాబు గారి మమ్మీ..! ‘అంటే కర్రను చూపించి చెట్టెక్కి కూర్చున్నాడు బ్యాడ్ బాబు.. అను పైకెక్కితే బాబు దొరుకుతాడని.. అను పైకి వస్తే బాబు ప్రేమ చెట్టు నుంచి దూకేసి.. అమ్మ సాకు చెప్పేద్దామని చీటింగ్ చేస్తున్నాడు అంటున్నారా సార్?’ భలే క్యాచ్ చేశావు నీలూ! అను హ్యాపీగా ఉండాలంటే.. ఈ కోతిని మరిచిపోవాలి..! ‘మమ్మీడాడీ చూపించిన చెట్టును గుండెల్లో నాటుకోవాలి..’ అబ్బా.. ఏం కవిత్వం నీలూ!? ఇదిగో అరటిపండు.!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com