
ప్రేమంటే ఏంటో తెలియని వయసులో ఒక అబ్బాయిని లవ్ చేశాను. అతన్ని ఎందుకు ప్రేమించానో మీకు చెప్పాలనుకుంటున్నాను. అతడు నన్ను మా అమ్మలా చూసుకుంటాడు. మా నాన్నలా కాపాడతాడు. నా ఫ్రెండ్‌లా నాతో చాలా సరదాగా ఉంటాడు. నా రిలేటివ్‌లా నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. అతడితో ఉంటే నాకు వాళ్లందరితో కలిసి ఉన్నట్లు ఉంటుంది. ఏ అమ్మాయికైనా ఇంతకన్నా కావల్సింది ఏం ఉంటుంది. అయితే మా నేపథ్యాలు వేరు. ఒకే ఊరిలో ఉంటాం. మా వాళ్లకి తనతో పెళ్లి చెయ్యడం ఇష్టంలేదు. తను లేకపోతే నేను బతకలేను. ఈ విషయం చెబితే ‘‘తల్లిదండ్రుల కంటే ఎక్కువైపోయాడా?’’ అంటున్నారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎలా మా ఫ్యామిలీని ఒప్పించాలో తెలియడంలేదు. అతడితో పెళ్లికి ఒప్పించేలా చెయ్యండి. అలా జరిగితే ఈ చెల్లెలు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాగైనా ఒప్పించండి అన్నయ్యా! – అమూల్య
రామచంద్రా..! రాఘవేంద్రా!! వీళ్లెవరు సార్? నా ఆయాసానికి ఎనర్జీ పోసే ఇలవేల్పులు! ‘ముక్క అర్థం కాలేదు సార్!’ దే ఆర్ ఎనర్జీ గివింగ్ గాడ్స్ వెన్ ఐ ఫీల్ లాస్ట్ అండ్ డ్రెయిన్డ్ అండ్ వీక్ అండ్.. ‘సార్ ఈ అండ్ అండ్ అండ్ ఏంటి సార్.. తెలుగులో చెప్పండి సార్..!’ అలసిపోయాను నీలాంబరి! ‘చెప్పాను కదా సార్ అదే పనిగా అరటిపండ్లు తింటూ ఉంటే దవడలు వాచిపోయి మీసాలు కనబడవు. ఫుల్‌గా టైర్డ్ అయిపోతారని.. కాసిన్ని రోజులు అరటిపండ్లు తినడం మానేస్తే అలసట తగ్గుద్ది సార్!!’ నీకో దండం పెడతా ఏది మాట్లాడినా అరటిపండును మధ్యలోకి తెస్తావు.. అందరిముందు నా ప్రొఫెషన్ తొక్క అయిపోతుంది. ‘సార్ అరటిపండు మీ ఫ్యామిలీ లాంటిది. అది ఉంటే మీకు ఇంకేమీ అక్కర్లేదు సార్!’ అమూల్య చెప్పినట్టు ఉంది వాడుంటే మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టు ఉందని! ‘అవునా సార్ మీరు అరటిపండు లేకుండా; అమూల్య ఆ అబ్బాయి లేకుండా హ్యాపీగా ఉండలేరు సార్!’ అంతగా ఇష్టపడితే ఇద్దరూ ఒక పని చెయ్యాలి!
‘ఏమి చెయ్యాలి సార్!’ అబ్బాయి ఒక లెటర్ రాయాలి! ‘మరి అమ్మాయి సార్?’ అమ్మాయి ఒక లెటర్ రాయాలి! ‘ఏమని సార్?’
వాళ్లు ఎంతగా ప్రేమిస్తున్నారో.. వాళ్ల ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో.. వారి పవిత్రమయిన.. ప్రేమ ఎందుకు ఫలిస్తుందో.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంత ఆదర్శవంతంగా ఉంటుందో.. వారి జంటను చూసి ఊరంతా ఎంతగా సంబర పడుతుందో రాయాలి! ‘ఎవరికి రాయాలి సార్!’ అమ్మాయి... అబ్బాయి వాళ్ల పేరెంట్స్‌కి, అబ్బాయి... అమ్మాయి వాళ్ల పేరెంట్స్‌కి రాయాలి ‘అబ్బాయి తాట తీస్తారు..! అమ్మాయి తిక్క తీరుద్ది.. సార్..!!’ నీకు ప్రేమ పవర్ ఏంటో తెలియదు నీలూ.. పేరెంట్స్ తప్పకుండా ఆలోచిస్తారు..! ‘అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారు సార్?’ ప్రేమ పవర్ ఆ లెటర్లో కనబడితే.. ప్రేమ గెలుస్తుంది! ‘లెటర్ రాయడం సరిగా రాయకపోతే..?’ ఈ ప్రేమ రాత మారుద్ది!?!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com