ఆతిథ్య రచయిత్రి

Lots of dishes in South India - Sakshi

టూరిస్ట్‌ కిచెన్‌

దక్షిణ భారతదేశంలోని వంటకాల్లో తమదైన విలక్షణత ఉంటుంది. ఇక్కడి వంటకాలలో ఎక్కువగా కొబ్బరి, రకరకాల మసాలాలు, పచ్చిమిర్చి, బియ్యం, కరివేపాకు, అల్లం వెల్లుల్లితో వండిన స్థానిక కూరగాయలు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఒరుగులు వంటి ఎండబెట్టిన కరకరలాడే వంటకాలు.. ఎక్కువగా ఉంటాయి. ఒక రాష్ట్రంలోని ఆహారం మరొక రాష్ట్రాన్ని పోలకుండా ఉంటుంది. ఎవరి విలక్షణత వారిది. అంతెందుకు? ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే ఉత్తరాది ప్రాంతాలకు, దక్షిణాది ప్రాంతాలకు వంటల విషయంలో పూర్తి తేడా ఉంది. మంగళూరు ప్రాంతపు వంటలకి, కొడవ వంటకు, ఉడిపికి ఎంతో తేడా ఉంటుంది. ఇన్ని రకాల వైరుధ్యం గురించి చదివి తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోదు. విమలా పాటిల్‌ రచించిన ‘‘ఎ కుక్స్‌ టూర్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’’ పుస్తకంలో పండుగ వంటలు, నిత్యం వండుకునే వంటకాల గురించి పూర్తిగా తెలుస్తుంది. దక్షిణాది వంటకాల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఇదొక గైడ్‌లాంటిది.

భోజనంలో ఆప్యాయత
విమల మంచి రచయిత, ఎడిటర్‌ కూడా. ప్రముఖ మహిళా పత్రిక ‘ఫెమినా’ను రెండు దశాబ్దాల కాలం పాటు ముందుండి నడిపారు. కళలు, విహారం, సాంఘిక అంశాలు, మహిళా విముక్తి వంటి రకరకాల అంశాల మీద అనేక వ్యాసాలు రచించారు. భారతీయ వస్త్ర పరిశ్రమను, చేనేతలను ప్రచారం చేయడం కోసం ప్రపంచపర్యటన చేశారు. ఇన్నిటికీ విలక్షణంగా వంటలకు సంబంధించి 12 పుస్తకాలు రచించారు. ‘ద వర్కింగ్‌ ఉమెన్స్‌ కుక్‌ బుక్, ఎంటర్‌టెయినింగ్‌ ఇండియన్‌ స్టయిల్, రెసిపీస్‌ ఫర్‌ ఆల్‌ అండ్‌ ఫాబ్యులస్‌ రెసిపీస్‌ ఫ్రమ్‌ ఇండియన్‌ హోమ్స్‌... వంటివి కొన్ని పుస్తకాలు.‘ఎ కుక్స్‌ టూర్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ పుస్తకంలో, దక్షిణాది వారి ఆప్యాయత, అభిమానం, ఆదరణల గురించి ప్రస్తావించారు. ‘వెండి పళ్లెం, కంచు కంచం, స్టీల్‌ కంచం, అరటి ఆకు, విస్తరాకు... ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి స్థితిగతుల మీద ఆధారపడి ఎందులో భోజనం పెట్టినా వారు చూపే ఆప్యాయతలో మాత్రం పేదధనిక తేడాలు ఉండవు... అని రాశారు ఈ పుస్తకంలో.

తేలిగ్గా అర్థమయ్యేలా
‘ఎ కుక్స్‌ టూర్‌ ఆఫ్‌ సౌత్‌ఇండియా’ పుస్తకం స్పయిసీ బ్రింజాల్‌ కర్రీతో మొదలవుతుంది. తమిళనాడు విభాగం నుంచి, మసాలాలు గ్రైండ్‌ చేసిన వంటకాలను రుచి చూపించారు. ఈ పుస్తకంలో నూనె కొలతల దగ్గర నుంచి అన్నీ ఎంతో పద్ధతిగా రచించారు విమల. ఇందులో ప్రత్యేకంగా... ఎంతసేపు ఉడికించాలి అనేదానికి బదులుగా, ‘గ్రేవీ చిక్కబడేవరకు’ అని, ‘వంకాయలు సగం వేగేవరకు’ అని ప్రత్యేకంగా వివరించారు. ఇలా రాయడం వల్ల, ఆ వంటకంలో ప్రావీణ్యత సంపాదించడంతో పాటు, ఇతరులకు కూడా వంటకాన్ని తేలికగా వివరించగలుగుతారు.ఈ పుస్తకాన్ని ఆరు విభాగాలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, స్నాక్స్, స్వీట్స్‌. చివరి రెండు రకాలు కేవలం దక్షిణ భారత దేశానికి మాత్రమే చెందినవి కాదు. ఇందులో కొన్ని సరుకులకి (ఇంగ్రెడియంట్స్‌) ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో అనువాద పదాలు కూడా ఇచ్చారు. ఈ పుస్తకం దక్షిణాది భోజనం సంప్రదాయాన్ని పూర్తిగా వివరిస్తోంది.
– జయంతి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top