శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం

శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం


విశ్వరూపాన్ని చూపమని అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మను ప్రార్థింపగా ఆయన అర్జునునికి దివ్యచక్షువు ప్రసాదించి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ రూపాన్ని చూసే అదృష్టం అర్జునునికి కలిగింది. ఆ తేజస్సును మన మాటలచే వర్ణించగలమా?


 ఆకాశాన వేయిమంది సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు కలిగే ప్రకాశం విశ్వరూప ప్రకాశానికి సరిపోలుతుందేమో! అర్జునునికి ఏమి కనపడిందంటే... అనేక రూపాలుగా విభక్తమైన జగత్తు అంతా శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని ఒక్కటిగా చేరి ఉండటం కనిపించింది. ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, అశ్వినీదేవతలు సమస్త మరుద్గణాలు నానావిధ వర్ణాలు, ఆకృతులు గల అఖిల చరాచరాలు బ్రహ్మాదిదేవతలు సకల లోకాలు- ఇంకా ఎన్నియో కనిపించినాయి.


 ఇటువంటి మహత్తరమైన జగత్తంతా పరమాత్మయొక్క ఒక్క అంశం మాత్రమే.

ఈ సకల జగత్తు పరమాత్మ ఒక పాదం మాత్రమే అనే విషయం వేదాలలో చెప్పబడి ఉంది. దీనిని బట్టి పరమాత్మకు ఒక రూపం ఉన్నదని మనం భావించకూడదు. పరమాత్మ సర్వమయత్వాన్ని, అనంతత్వాన్ని మనకు తెలియజెప్పేందుకు మన సామాన్య భాషలో ఈ విధంగా చెప్పబడింది. పరమాత్మకు ఈ విశ్వం ఒక్క పాదం మాత్రమే అయినట్లయితే, పరమాత్మ తత్వం ఎటువంటిదో మనం ఊహించుకోవడానికి వీలుగా ఈవిధంగా చెప్పబడిందేకానీ వేరు కాదు. - కూర్పు: బాలు శ్రీని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top