
‘పో’కాలజ్ఞానం..
అమెరికన్ కవి, రచయిత ఎడ్గర్ అలన్ పో 1838లో ‘ద నెరేటివ్ ఆఫ్ అర్థర్ గార్డన్ పైమ్ ఆఫ్ నాన్‌టకెట్’ అనే నవల రాశాడు...
అమెరికన్ కవి, రచయిత ఎడ్గర్ అలన్ పో 1838లో ‘ద నెరేటివ్ ఆఫ్ అర్థర్ గార్డన్ పైమ్ ఆఫ్ నాన్‌టకెట్’ అనే నవల రాశాడు. రచయిత అన్నాక కథలు.. కాకరకాయలు రాయడంలో విశేషం ఏముందంటారా..? నిజమే! అందులో ఏమంత వింతా విశేషం లేనేలేదు. పో ఇతర రచనలకు సంబంధించి ఎంలాంటి వింతలూ లేకపోయినా, అతడి నవల ‘ద నెరేటివ్ ఆఫ్ అర్థర్ గార్డన్ పైమ్ ఆఫ్ నాన్‌టకెట్’ మాత్రం వింతాతి వింతగా గుర్తింపు పొందింది.
పో తన జీవితకాలంలో పూర్తి చేసిన నవల ఇదొక్కటే! ఇందులో పో వర్ణించిన సన్నివేశం ఆ తర్వాతి కాలంలో యథాతథంగా జరిగింది. ఇంతకీ ఆ సన్నివేశం ఏమిటంటే, సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఓడ దారి తప్పుతుంది. ఓడలోని ఆహార పదార్థాలన్నీ నిండుకుంటాయి. ఓడలో నలుగురు నావికులు ఉంటారు.
ఏదో ఒకటి తిననిదే ప్రాణాలను నిలుపుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వారి చూపు అందరి కంటే చిన్నవాడైన కేబిన్ బాయ్ రిచర్డ్ పార్కర్‌పై పడుతుంది. నావికులు ఆ కేబిన్ బాయ్‌ని చంపి, అతడి మాంసాన్ని తినేస్తారు. సరిగ్గా ఈ నవల విడుదలైన నలభయ్యారేళ్ల తర్వాత ఈ సన్నివేశంలాంటి సంఘటన జరిగింది. దారి తప్పిన ఓడలోని నావికులు కేబిన్ బాయ్‌ని తినేశారు. నావికులకు ఆహారంగా మారిన ఆ బాయ్ పేరు కూడా రిచర్డ్ పార్కర్ కావడమే విధి వైచిత్రి.