నమ్మాలనుకునే గతం

Krishnaveni Article On The Sense Of An Ending Book - Sakshi

కొత్త బంగారం

‘మనకి గుర్తున్నదే, మనం చూసినదై ఉండనవసరం లేదు.’ ఇలా మొదులయ్యే బ్రిటిష్‌ రచయిత జూలియస్‌ బార్న్స్‌ రాసిన ‘ద సెన్స్‌ ఆఫ్‌ యాన్‌ ఎండింగ్‌’ నవలకు ప్రధాన పాత్రా, కథకుడూ అయిన టోనీ, అరవైల్లో ఉన్న వ్యక్తి. ‘జీవితం నన్నెక్కువ అల్లరి పెట్టకూడదనుకున్నాను. జీవితపు చివరి దశలో కొంతయినా విశ్రాంతి అవసరం. దానికి నేను అర్హుడిని’ అనుకునే సగటు మనిషి. అలాంటి వ్యక్తిని, 40 ఏళ్ళ కిందకి లాక్కెళ్లే పరిస్థితులు ఎదురవుతాయి.

టోనీ హైస్కూల్లో చదువుతున్నప్పుడు, యేడ్రియన్‌ అన్న తెలివైన అబ్బాయి అదే స్కూల్లో చేరతాడు. ఇద్దరూ స్నేహితులవుతారు. యూనివర్సిటీలో టోనీకి, వెరోనికా గర్ల్‌ఫ్రెండ్‌ అవుతుంది. ఒక వారాంతం, టోనీ ఆమె ఇంట్లో గడపడానికి వెళ్తాడు. వెరోనికా తల్లయిన సారా– కూతురి గురించి చెడుగా చెప్పి, టోనీతో సరసాలాడుతుంది. వెనక్కి వచ్చిన తరువాత, వెరోనికా– టోనీ మధ్య అన్యోన్యత పోతుంది. యూనివర్సిటీ చివరి సంవత్సరంలో, టోనీకి– తను వెరోనికాతో కలిసున్నానని రాసిన యేడ్రియన్‌ ఉత్తరం అందుతుంది.
‘ప్రియమైన యేడ్రియన్, (వెరోనికా, దీన్ని నువ్వూ చదువుతూనే ఉండి ఉంటావని తెలుసు.) మీరు ఒకరికొకరు సరిగ్గా సరిపోతారు. నేను మిమ్మల్నిద్దరినీ పరిచయం చేసిన రోజుని మీరు తిట్టుకుంటారని అనుకుంటాను. కాలం తీర్చుకునే ప్రతీకారాన్ని నమ్ముతాను కనుక మీకిద్దరికీ ఒక బిడ్డ తప్పక పుట్టాలి. ఆ బిడ్డ, తల్లిదండ్రుల పాపాలకు వెల చెల్లించాలి. వెరోనికా తల్లే నన్ను కూతురి గురించి హెచ్చరించింది. నేనే నీ స్థానంలో ఉండివుంటే, నిర్ణయం తీసుకునేముందు ఒకసారి సారానూ సంప్రదించేవాడిని’ అని విషం కక్కుతూ జవాబు రాసిన టోనీ, దాని గురించి ఇక మరచిపోతాడు. ఆ 40 ఏళ్ళ పాత ఉత్తరం, అందరి జీవితాలనూ మార్చేస్తుంది.

కొన్ని నెలల తరువాత యేడ్రియన్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న కబురు అందుతుంది టోనీకి. ప్రస్తుత కాలపు పుస్తకపు రెండవ భాగంలో, సారా– టోనీకి అయిదు వందల డాలర్ల ‘బ్లడ్‌ మనీ’తో పాటు రెండు పత్రాలను వదిలిపెట్టిందని లాయర్‌ ఉత్తరం వస్తుంది. యేడ్రియన్‌ డైరీ వెరోనికా వద్దే ఉందని తెలుస్తుంది. లాయర్, టోనీకి అతని గతపు ఉత్తరం అందించాక, ‘అది రాసినది నేనేనా!’ అనుకుని, నమ్మడానికి నిరాకరిస్తాడు. వెరోనికా తన వద్దున్న యేడ్రియన్‌ డైరీ ఇవ్వనన్నప్పుడు, టోనీ ఆమెతో ‘మర్యాదగా, స్నేహంగా’ ప్రవర్తిస్తున్నట్టు నటిస్తాడు.

వెరోనికా, టోనీని మానసిక వికలాంగులుండే చోటుకి తీసుకెళ్తుంది. వాళ్ళలో ఒక వ్యక్తికి యేడ్రియన్‌ పోలికలుండటం గమనించిన టోనీ, ‘నీకూ, యేడ్రియన్‌కూ కొడుకున్నాడని తెలియలేదు’ అన్నప్పుడు, తిరుగు మెయిల్లో, ‘నీకె ప్పుడూ, ఏదీ అర్థం కాదేం?’ అన్న ప్రశ్న సమాధానంగా వస్తుంది.‘అప్పుడు జరిగినదాని గురించిన నా పక్షపు కథ ఇది. ఆ సంఘటనల నా జ్ఞాపకం అనుకోండి’ అని టోనీ, పాఠకులకు చెప్తాడు. ఆ వ్యక్తి నిజానికి యేడ్రియన్‌కూ, సారాకూ పుట్టినవాడు. వెరోనికా సవతి తమ్ముడు. యేడ్రియన్, వెరోనికాల సంబంధం తెగిపోవడానికీ, సారాతో అతని సంబంధానికీ, అతని ఆత్మహత్య కారణాలనూ పాఠకుల ఊహకే వదిలేస్తాడు రచయిత. 

గతంలో– ఏది, ఎలా జరిగిందని టోనీ నమ్మాడో, వాటికి వ్యతిరేకంగా జరిగినవే అన్నీ. కాలం, అవగాహనను మార్చేస్తుందని చెప్తుంది పుస్తకం. కష్టపెట్టే నిజాలను మరచిపోడానికి– వాటిని అణచిపెట్టి, మనసులో అల్లుకున్న కథలనే నమ్ముతాం అని కూడా చెబుతుంది. ‘భద్రంగా బతికే ప్రవృత్తి నాలో ఉండివుంటుంది. దాన్ని పిరికితనం అనేది వెరోనికా. నేనైతే అది ప్రశాంతంగా బతకడం అనుకున్నాను’ అని ఆధారపడలేని కథకుడైన టోనీ గుర్తిస్తాడు. స్ఫుటమైన, సంక్షిప్తమైన బ్రిటిష్‌ వచనం ఉన్న యీ 150 పేజీల పుస్తకాన్ని ‘జోనథన్‌ కేప్‌’ 2011లో ప్రచురించింది. నవల– బుకర్‌ ప్రైజుతో పాటు అనేకమైన అవార్డులు గెలుచుకుంది. దీని ఆధారంగా 2017లో భారత దర్శకుడు రితేష్‌ బత్రా దర్శకత్వంలో ఇదే పేరుతో సినిమా వచ్చింది.
కృష్ణ వేణి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top