పుష్కరాల్లో సైనసైటిస్ నివారణ ఎలా..? | How to cure sinusitis in ample | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో సైనసైటిస్ నివారణ ఎలా..?

Jun 25 2015 11:09 PM | Updated on Oct 9 2018 7:52 PM

ముఖంలోని గాలి గదులలో వచ్చే వాపును వైద్యపరిభాషలో సైనసైటిస్ అంటారు...

ఈఎన్‌టి కౌన్సెలింగ్
నేను చాలాకాలంగా సైనస్‌తో బాధపడుతున్నాను. రాబోయే పుష్కరాలకు మేము  పుష్కరస్నానాలకు వెళ్దామనుకుంటున్నాం. ఒక సైనస్ పేషెంట్‌గా నేను ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి?
- రామలక్ష్మి, ఏలూరు

 
ముఖంలోని గాలి గదులలో వచ్చే వాపును వైద్యపరిభాషలో సైనసైటిస్ అంటారు. ఈ వాపే కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. వేలాదిమందితో కలిసి ఒకేసారి నదిలో మునిగి స్నానం చేయడం వల్ల నీరు కలుషితం అయి, సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువే. కలుషితమైన నీరు ముక్కులోకి చేరడం వల్ల సైనస్‌కు ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీంతో సైనసైటిస్ విడవకుండా బాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది న్యుమోనియాకు దారితీసే అవకాశాలూ లేకపోలేదు. అలాగే పుష్కరాల కోసం తరలివచ్చే భారీ జనసమూహాల మధ్య తిరగడం వల్ల క్రాస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఇవి ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సోకుతాయి.

ఇలా జరగకుండా ఉండాలంటే... పుష్కరస్నానంలో భాగంగా నదిలో మునగకుండా చెంబుతో నదీజలాలను తలపై పోసుకొని స్నానమాచరించడం మంచిది. అలాగే వేలాది మంది ఒకేసారి స్నానం చేసే పుష్కరఘాట్‌ల వద్ద కాకుండా జనసమ్మర్థం అంతగా లేకుండా నీరు స్వచ్ఛంగా ఉండే చోట (అది సురక్షితమైన స్థలం కూడా అయి ఉండాలి) స్నానం చేయడం శ్రేయస్కరం. నదీస్నానం పూర్తి చేసుకొని, ఇంటికి లేదా హోటల్‌కు లేదా మీ బసకు తిరిగి వచ్చాక వెంటనే మళ్లీ మంచినీటితో తలస్నానం చేయాలి. అనంతరం తప్పనిసరిగా ముక్కుకు ఆవిరిపట్టాలి. దీనివల్ల సైనస్ తెరచుకొని, వాటిలో చేరిన కఫం ముక్కుద్వారా బయటకు వచ్చేస్తుంది. అలాగే దుమ్ము, ధూళి, వైరస్‌ల నుంచి రక్షణ కోసం ముక్కుకు మాస్క్ ధరించాలి. చల్లని వాతావరణం, ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
 
నేను తరచూ జలుబుతో బాధపడుతున్నాను. వెంటనే దగ్గర్లోని మెడికల్ షాపుకు వెళ్లి ఉపశమన మందులు వాడుతున్నాను. దీనివల్ల రిలీఫ్ తాత్కాలికంగానే ఉంటోంది. మళ్లీ జలుబు తిరగబెడుతోంది. ఇది చీటికీమాటికీ రాకుండా నివారించే మార్గం ఏమైనా ఉందా?
- ఆనందరావు, హైదరాబాద్

 
జలుబు నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించే మందుల వల్ల నష్టమే ఎక్కువ. సాధారణంగా జలుబు చేయగానే చాలామంది ఓవర్ ద కౌంటర్ మందులు వేసుకుంటారు. ఈ మందుల వల్ల కఫం చిక్కబడి, గొంతు పొడిబారిపోతుంది. జలుబు చేసినప్పుడు కఫం పలచబడి తేలిగ్గా వెలుపలికి వచ్చేయాలేగానీ, చిక్కబడి ఎండిపోయేలా చేసే మందులు వాడకూడదు. కఫం లోపల నిల్వ ఉండిపోతే ఇన్ఫెక్షన్ మరింతగా పెరిగిపోతుంది. తరచూ జలుబుతో బాధపడేవారు సొంతవైద్యంతో ఏ మందులు పడితే అవి వాడటం మున్ముందు మరింత ప్రమాదానికి దారితీస్తుంది. అలాంటివారు ముందుగా సొంతవైద్యం మాని వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే మందులు వాడాలి. ఎక్కువసార్లు ఆవిరిపట్టడం వల్ల వీళ్లకు ఎంతో ఉపశమనం ఉంటుంది. రోజులో ఎక్కువసేపు ఆవిరిపట్టడం కంటే తక్కువ వ్యవధితో ఎక్కువసార్లు ఆవిరి పట్టడం వల్ల ముక్కులోని సైనస్ తెరుచుకొని అక్కడ చేరిన కఫం పలచబడి కరిగిపోయి ముక్కుద్వారా బయటకు వచ్చేస్తుంది.  ఆవిరిపడుతున్నా జలుబు విడవకుండా పీడిస్తుంటే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించండి.
 
డాక్టర్ కేవీఎస్‌ఎస్‌ఆర్‌కె శాస్త్రి,
సీనియర్ ఈఎన్‌టి, హెడ్ అండ్ నెక్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement