తినగానే ఈ సమస్యలు ఎందుకిలా? | Sakshi
Sakshi News home page

తినగానే ఈ సమస్యలు ఎందుకిలా?

Published Fri, Dec 13 2019 12:15 AM

Homeopathic Medicines Are Available For IBS - Sakshi

నా వయసు 45 ఏళ్లు. భోజనం పూర్తికాగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కడుపులో మెలిపెట్టినట్లుగా నొప్పి వస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి.

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే
జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు
దీర్ఘకాల జ్వరాలు
మానసిక ఆందోళన
కుంగుబాటు
ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం
జన్యుపరమైన కారణలు
చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్‌ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్‌ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్‌ బ్రీత్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.

వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు:
పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి
ఒత్తిడిని నివారించుకోవాలి
పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి
రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

హోమియోలో చికిత్స: ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్‌ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

Advertisement
Advertisement