బొద్దుగా ఉంటే ఓకే...మరీ బరువు పెరగవద్దు!! | health tips for kids fat and plump | Sakshi
Sakshi News home page

బొద్దుగా ఉంటే ఓకే...మరీ బరువు పెరగవద్దు!!

Sep 15 2016 12:08 AM | Updated on Sep 4 2017 1:29 PM

బొద్దుగా ఉంటే ఓకే...మరీ బరువు పెరగవద్దు!!

బొద్దుగా ఉంటే ఓకే...మరీ బరువు పెరగవద్దు!!

పిల్లలు కాస్తంత బొద్దుగా ఉంటే ఆరోగ్యంగా కనిపిస్తారు.

పిల్లలు కాస్తంత బొద్దుగా ఉంటే ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ అదే ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువుంటే మాత్రం అది వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.  ఎక్కువ లావుగా ఉంటే అది ఏమాత్రమూ మేలు కాదు. ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయంతో ఉన్న పిల్లల సంఖ్య పెరుగుతోంది.

ఒకప్పుడు మన దగ్గర తక్కువేమో గానీ ఇటీవల మన దేశపు ఆహారపు అలవాట్లలో మార్పు వల్ల మన పిల్లల్లోనూ బరువు పెరుగుతోంది. పిల్లల్లో బరువు పెరగడం వల్ల వారికి భవిష్యత్తులో గుండెజబ్బులు, డయాబెటిస్ ముప్పు ఎక్కువ. ఇక సాధారణంగానే జన్యుపరంగానే మన దేశవాసుల దేహం పరిమాణం ఒకింత తక్కువే. ఈ అంశాన్ని థ్రిఫ్టీ ఫీనోటైప్‌గా పేర్కొంటారు.  దీనికి తోడు బరువు పెరగడం అన్నది కదలికలు మందగింప జేయడంతో పాటు పైన పేర్కొన్న ప్రమాదాల రిస్క్‌ను పెంచుతుంది.

ఇతర కారణాలు...
ఆహారంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం  క్రమబద్ధంగా లేని ఆహారపు అలవాట్లు  టీవీ చూస్తూ ఆహారం తీసుకోవడం  తగ్గుతున్న శారీరక వ్యాయామం పరీక్షల ఆందోళన, ఫ్రెండ్స్ లేదా కుటుంబం వల్ల కలిగే ఒత్తిళ్లు.

పిల్లల్లో స్థూలకాయంతో కలిగే అనారోగ్యాలు...
అధిక కొలెస్ట్రాల్ వంటి అనారోగ్యకరమైన ఆహారం వల్ల పిల్లల్లోనూ హైబీపీ, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు పెరగడం పెరిగిన బరువు వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రావడం ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం  పరీక్షల్లో తగిన సామర్థ్యం చూపలేకపోవడం  ఆడపిల్లల్లో త్వరగా ప్యూబర్టీ రావడం (రుతుక్రమం రావడం)

ముప్పు నివారణ కోసం...
కాస్త జాగ్రత్తగా ఉంటే పిల్లల్లో బరువు పెరగడం అనే సమస్యను నివారించవచ్చు. ఆ జాగ్రత్తలు ఇవే...

పిల్లలకు ఇచ్చే ఆహారం సమతులంగా ఉండాలి. అంటే అన్ని పోషకాలు దొరికేలా ఆ సీజన్‌లో లభ్యమయ్యే తాజా ఆకుకూరలు, కాయగూరలు వాళ్లకు ఇవ్వాలి. అన్ని రంగుల్లో ఉండే కాయగూరలు వాళ్లు తినేలా చూడాలి.

వాళ్లు తీసుకునే ఆహారంలో వరి, గోధుమతో పాటు బార్లీ, ఓట్స్, తృణధాన్యాల వంటి అన్ని రకాల ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. పాలిష్ పట్టించిన వాటి కంటే ముడిబియ్యం, హోల్‌వీట్ వంటి వాటితో వండిన పదార్థాలు వాళ్లకు ఇవ్వాలి.

ఆయా సీజన్‌లలో దొరికే అన్ని రకాల తాజా పండ్లు తినేలా జాగ్రత్త తీసుకోవాలి.

పాలు, పాల ఉత్పాదనలు వాళ్లు తీసుకునేలా చూస్తూనే, వాటిల్లో కొవ్వు పాళ్లు లేకుండా జాగ్రత్త వహించాలి. అంటే లో-ఫ్యాట్ డెయిరీ ప్రాడక్ట్స్ ఇవ్వాలి. ఇలా పాల ఉత్పాదనలు ఇవ్వడం వల్ల వాళ్లకు పుష్కలంగా క్యాల్షియమ్ లభ్యమయ్యేలా చేసుకోవాలి  వాళ్లు తీసుకునే ఆహారంలో నట్స్ ఉండేలా చూసుకోవాలి. అయితే అవి మళ్లీ ఒళ్లు వచ్చేలా చేయకుండా జాగ్రత్త వహించాలి. 

తల్లిదండ్రులకు సూచనలు...
పిల్లల ఆహారం సమతుల్యంగా ఉంచడానికి (బ్యాలన్స్‌డ్ డైట్ కోసం) తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు తీసుకునే ఆహారం, వాళ్లు రోజువారీ చేసే పనులు సమతౌల్యంగా ఉండేలా చేడాలి. అలాగే వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తగినట్లుగా ఆహారం ఉండాలి.

వారు తీసుకునే ఆహారం ఎప్పటికప్పుడు వైవిధంగా (వెరైటీ ఆఫ్ ఛాయిస్) ఉండేలా చూడాలి.

పేరెంట్స్ తయారు చేసే ఆహారాలు (రెసిపీస్) / వంటలు ప్రతిసారీ కాస్తంత వేరుగా ఉండేలా మార్పు చేయడం వల్ల వాళ్లు తినే ఆహారాన్ని రొటీన్‌గా ఫీల్ కారు.

(కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు మార్పులతో ఇది తేలిగ్గానే సాధ్యమవుతుంది).

తినే సమయంలో టీవీ చూడకుండా జాగ్రత్త వహించాలి.

ఇంట్లో కూర్చొని ఆడే ఆటల కంటే ఆరుబయట చురుగ్గా సంచరిస్తూ ఆడే ఆటలు మంచివని వారికి చెప్పాలి. వాటిని ఎక్కువగా ప్రోత్సహించాలి.

అధికంగా కొవ్వులు ఉండే మాంసాహారాలు కాకుండా చేపలు, బీన్స్ వంటి ఆహారాలతో లభ్యమయ్యే తేలికపాటి ప్రోటీన్లు వాళ్లు తీసుకునేలా చూడాలి. జంతుసంబంధమైన కొవ్వుల నుంచి వారిని దూరంగా ఉంచాలి.

పిల్లలు కనీసం 60 నిమిషాల పాటు అధిక శారీరక శ్రమ ఫీల్‌కాకుండా ఉండేలాంటి వ్యాయామాల్లో పాల్గొనేలా చూడాలి.

 ఉదాహరణకు: ఈత (స్విమ్మింగ్), డాన్సింగ్, వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement