గ్రేట్‌ రైటర్‌; పాట్రిక్‌ మొజానో

Great Writer Patrick Modiano - Sakshi

జాన్‌ పాట్రిక్‌ మొజానో (Patrick Modiano) ఫ్రాన్స్‌లో 1945లో జన్మించాడు. తండ్రి ఇటలీ–యూదు మూలాలున్నవాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చీకటి వ్యాపారం చేసేవాడు. తల్లి బెల్జియన్‌. యూదుల మీద అప్పుడు ఉన్న ఒత్తిడి; నటి అయిన తల్లి ఊళ్లు తిరగాల్సిరావడం; మొజానో పుట్టినతర్వాత తల్లిదండ్రులు విడిపోవడం; ఇలాంటి కారణాల వల్ల మొజానో చిన్నతనంలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగాడు. దాంతో ఉత్తర బెల్జియంలో మాట్లాడే ఫ్లెమిష్‌ భాష మాధ్యమంలో తొలుత చదువుకున్నాడు. తరువాత ఫ్రెంచ్‌లోకి మళ్లాడు. చిన్నప్పుడు తమ్ముడు రూడీతో ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు.

రూడీ తొమ్మిదేళ్లప్పుడు జబ్బుచేసి హఠాత్తుగా చనిపోయాడు. రాయడం మొదలుపెట్టిన మొదటి పదిహేనేళ్లు మొజానో రాసిన ప్రతి పుస్తకాన్నీ తమ్ముడికే అంకితం ఇచ్చాడు. 22 ఏళ్లప్పుడు రాసిన ఆయన తొలి నవల రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఒక యూదు గురించి రాసింది. ఆ నవల తండ్రికి అసంతృప్తి కలిగించింది. మార్కెట్‌లో ఉన్న ప్రతి కాపీని కొనేందుకు ప్రయత్నించాడు. తర్వాత కూడా తండ్రి నుండి ఏ రూపంలోనూ మొజానోకు సహకారం అందలేదు. ఈ నవల తర్వాత్తర్వాత హాలోకాస్ట్‌ అనంతరం వచ్చిన ఉత్తమ సృజనల్లో ఒకటిగా నిలిచింది. సుమారు ఇరవై నవలలు రాశాడు మొజానో. గతంలోంచి తన మూలాలకు సంబంధించిన ఒక్కో శకలాన్నీ ఏరుకుంటూ తన అస్తిత్వాన్ని రూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆయన్ని ‘మన కాలపు మార్సెల్‌ ప్రూస్ట్‌’ అంటారు. 2014లో నోబెల్‌ పురస్కారం వరించింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top