బొట్టు బొట్టు కూడబెట్టు!

A Glass of Water, and How It Turned This Bengaluru  - Sakshi

వై వేస్ట్‌?!

‘‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా’’ అంటాడు ఓ సినిమాలో హీరో. ‘‘నీటి చుక్కే కదా అని వృథా చేస్తే.. గుక్కెడు నీళ్లు కూడా దొరకని గడ్డు కాలం వస్తుందని’’ హెచ్చరిస్తోంది గర్విత. ఈ అమ్మాయి సినిమా హీరోయిన్‌ కాదు. నీరు ఎంత విలువైనదో చెప్పడానికి ఒక ఉద్యమమే నడుపుతోన్న వాటర్‌ వారియర్‌!

భోజనానికి కూర్చుంటాం, పక్కనే గ్లాసు నిండా నీటిని పెట్టుకుంటాం. తాగినన్ని తాగి మిగిలిన వాటిని వదిలేస్తాం. హోటళ్లలో అయితే ఇది మరీ ఎక్కువ. భోజనానికి ముందే నీటిని పెడతారు, భోజనం చేస్తున్నంత సేపు వెయిటర్‌లు గ్లాసు నింపుతూనే ఉంటారు. భోజనం చివరికి వచ్చిన తర్వాత కూడా గ్లాసు సగానికి తగ్గితే వెంటనే నింపేస్తుంటారు. ఇది వాళ్లకు ఆదేశించిన ఉద్యోగ నియమావళి. కస్టమర్‌లు తాగినన్ని తాగి మిగిలినవి వదిలేస్తారు సహజంగానే. అయితే కేవలం ఈ ఒక్క కారణంగానే ఏడాదికి రెస్టారెంట్‌లో 14 మిలియన్‌ లీటర్ల నీరు వృథా అవుతోంది.

మొదట ఎవరూ వినలేదు
ఇక ఇళ్లలో మంచి నీటిని ఒక బిందెలో పట్టుకుంటాం. ఆ రోజు వాడినన్ని వాడి మరుసటి రోజు ఉదయం వాటిని పారబోసి బిందె కడిగి తాజా నీటిని పట్టుకుంటాం. అలా పారబోసేటప్పుడు కనీసం ఆ నీటిని మరో బకెట్‌లోకి మార్చుకుని ఇతర అవసరాలకు వాడుకోవడం కొంతమంది మాత్రమే చేస్తారు. చాలామంది నీటిని వృథా చేస్తున్నామనే స్పృహ ఏ మాత్రం లేకుండా ‘నీళ్లే కదా’ అన్నంత ఈజీగా పారబోసేస్తారు. ఈ పారబోతకు ఇంకా ఎవరూ లెక్కకట్టలేదు. అయితే రెస్టారెంట్‌లలో వృథా అయ్యే నీటి మీద బెంగళూరు అమ్మాయి గర్విత ‘వై వేస్ట్‌’ అంటూ ఒక ఉద్యమాన్ని లేవదీసింది. బెంగళూరులోని రెస్టారెంట్‌లకు, హోటళ్లకు వెళ్లి నీటిని వృథా చేయవద్దని చెప్పి చూసింది. ‘నీరు అత్యంత విలువైన వనరు, దానిని పొదుపుగా వాడుకోవాలి’ అని వారి మైండ్‌కి ఎక్కించే ప్రయత్నం చేసింది. అయితే నీటి పరిరక్షణ అనే సామాజిక బాధ్యత నిర్వర్తించడం కంటే తమ వ్యాపారాన్ని పరిరక్షించుకోవడమే తమకు ముఖ్యం అని ఆ రెస్టారెంట్‌లు చెప్పకనే చెప్పేశాయి. దాంతో ఆమె తన ఉద్యమాన్ని ‘చేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇదే భావసారూప్యం కలిగిన వారితో పంచుకుంది.  ఇలా ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుంచి వెయ్యి మంది ఆన్‌లైన్‌లో తోడయ్యారు. వారంతా 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు వారే. 

అలాగని పట్టు వదల్లేదు
ఆన్‌లైన్‌ మిత్రులు ఇచ్చిన నైతిక మద్దతులో గర్విత  తన ఉద్యమాన్ని కొనసాగించింది. రెస్టారెంట్‌లకు వెళ్లి మళ్లీ చెప్పి చూసింది. వెళ్లిన రెస్టారెంట్‌కే మళ్లీ మళ్లీ వెళ్లేది. తానొక్కతే ఎంత చెప్పినా కంఠశోష తప్ప విన్న వాళ్లలో చలనం కనిపించట్లేదని తన స్నేహితులను కలుపుకుంది. అలా రెండేళ్లు నగరమంతా పర్యటించింది. ఆడపిల్లలు అదే పనిగా చెప్తుండటం, ‘ఒక్కసారి ట్రై చేయండి అంకుల్‌’ అంటూ రిక్వెస్ట్‌ చేయడంతో క్రమంగా కొందరిలో ‘ఒకసారి ప్రయత్నించి చూద్దాం’ అనే ఆలోచన రేకెత్తింది.  2015లో మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఒక గాడిన పడటానికి రెండేళ్లు పట్టిందని చెబుతోంది గర్విత. ఈ రెండేళ్లలో ఆమె స్కూలు దాటి కాలేజ్‌కొచ్చింది. పరీక్షలు, ఎంట్రన్స్‌ టెస్ట్‌ల సమయంలో కొంత విరామం తీసుకుంటూ, అవి పూర్తి కాగానే మళ్లీ ‘వై వేస్ట్‌’ నినాదాన్ని బయటకు తీస్తున్నారీ అమ్మాయిలు.

ఇంట్లో కూడా పాటించాలి
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సామాజికోద్యమా లను నిర్వహిస్తున్న 60 మందిని ‘గ్లోబల్‌ చేంజ్‌ మేకర్స్‌’ అవార్డుతో సత్కరించింది చేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ. స్విట్జర్లాండ్, జ్యూరిక్‌లో గడచిన ఆగస్టు నెలలో 12 నుంచి 18 వరకు జరిగిన వర్క్‌షాప్‌లో ఈ అరవై మందిని సత్కరించారు. వారిలో ఇండియా అమ్మాయి గర్విత ఒక్కరే. పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నట్లు రాబోయే తరాలు నీటి యుద్ధాలు చేయకుండా, భూమి పొరల్లో నీటిని నాలుగు కాలాలపాటు పరిరక్షించుకోవాలంటే.. రెస్టారెంట్‌లే కాదు, ఇళ్లలో కూడా నీటిని నీళ్లే కదా అని పారబోయకుండా జాగ్రత్తగా వాడటం అలవరచుకోవాలి. 

రెస్టారెంట్‌లలో మార్పు వచ్చింది!
గర్విత చేపట్టిన ఉద్యమ ప్రభావంతో చాలా రెస్టారెంట్‌లు గ్లాసు సైజు తగ్గించాయి. కొన్ని రెస్టారెంట్‌లు కస్టమర్‌ రాగానే గ్లాసు నిండా నీటిని పెట్టకుండా అరగ్లాసు నీటినే పెట్టడం, భోజనం చేస్తున్నప్పుడు కూడా గ్లాసును సగం వరకే నింపడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కస్టమర్‌కి చిరాకు కలగకుండా ఉండటానికి అందుబాటులో జగ్‌ని ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు బెంగళూరులో ముప్పై రెస్టారెంట్‌లు ‘వై వేస్ట్‌’ ఉద్యమంలో భాగమయ్యాయి. నీటి వినియోగం గణనీయంగా తగ్గిందని, వేలాది లీటర్ల తేడా వచ్చిందని చెబుతున్నాయి ఆ రెస్టారెంట్‌లు. అంతకు ముందు ఈ అమ్మాయిలను ‘మీకు టైమ్‌ వేస్ట్‌ తప్ప, ఈ ప్రచారంతో మీరు సాధించేదేమిటి’ అన్న రెస్టారెంట్‌ నిర్వాహకులు కూడా ఇప్పుడు ‘మంచి పని చేస్తున్నారు’ అంటూ గర్విత బృందాన్ని ప్రశంసిస్తున్నారు.
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top