నాలుగో రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి | Sakshi
Sakshi News home page

నాలుగో రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి

Published Mon, Oct 3 2016 11:16 PM

నాలుగో రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి

ఈ రోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడ యిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది.  అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస పుణ్యం లభిస్తుందని ఆర్యోక్తి.
 
శ్లోకం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే  జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహిచ పార్వతి
భావం: ఓ అన్నపూర్ణాదేవీ, సాక్షాత్తూ శంకరుని ప్రాణేశ్వరివైన నీవు మాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్నీ భిక్షగా ప్రసాదించు తల్లీ!
నివేదన: అప్పాలు, షడ్రసోపేత మహానైవేద్యం (ఓపిక లేనివారు స్నానం చేసి శుచిగా వండిన అన్నం, పప్పు, కూరలను కూడా నివేదించవచ్చు)
ఫలమ్: పాడిపంటలు, ధనధాన్యాభివృద్ధి, నూతన గృహ యోగం కలుగుతాయి. ఉపాసకులకు జ్ఞానం, వైరాగ్యం ప్రాప్తిస్తాయి.
 -దేశపతి అనంత శర్మ
 
 

Advertisement
Advertisement