పిల్ల బంట్లు.. న్యాయపోరాటం

Forest Officer Fight For Justice From Five Years - Sakshi

‘దిస్‌ ఈజ్‌ యాన్‌ ఆర్డర్‌’ అని పై అధికారి చెప్పినప్పుడు ఇక మాట్లాడేందుకు ఏమీ ఉండదు. చెప్పింది చేసేయడమే. కానీ బ్రైస్‌ కసావెంట్‌ ‘ఐకాంట్‌’ అనేశాడు గన్‌ తీసి లోపల పెట్టేసుకుంటూ! బ్రైస్‌ కెనడాలో అటవీ సంరక్షణ అధికారి. అప్పటికీ ఒకసారి తన పైఅధికారి ఆర్డర్‌ మీద తల్లి ఎలుగుబంటిని షూట్‌ చేసేశాడు. తల్లిని అంటి పెట్టుకుని ఉన్న ఆ రెండు ఎలుగు పిల్లల్ని కూడా షూట్‌ చేసేయమన్నాడు పై ఆఫీసర్‌. ‘పాపం పోనివ్వండి’ అన్నాడు బ్రైస్‌.

మాంసం, చేపలు ఉన్న ఫ్రీజర్‌ డోర్‌లను బద్దలు కొట్టేసి లోపలంతా చెల్లాచెదురు చేసింది తల్లే గానీ పిల్లలు కాదు. పైగా వాటి ఒంటి మీద చిన్న చిన్న గాయాలు కూడా ఏవో ఉన్నాయి. ఆ పిల్లబంట్లను పశువైద్యశాలకు తరలించాడు బ్రైస్‌. పై అధికారికి ఇదంతా కోపం తెప్పించింది. ముఖ్యంగా తన ఆర్డర్‌ని లెక్కచెయ్యకపోవడం! వెంటనే బ్రైస్‌ని ఉద్యోగంలోంచి ఫైర్‌ చేసేశాడు. ఐదేళ్ల క్రితం మాట ఇది. ఐదేళ్లుగా బ్రైస్‌ తన ఉద్యోగం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. చివరికి కోర్టు బ్రైస్‌కి అనుకూలంగా శుక్రవారం తీర్పు ఇచ్చింది. ‘ఆదేశాలను, విధానాలను ఎవరైనా శిరసావహించవలసిందే. కానీ జీవకారుణ్య దృష్టితో చూసినప్పుడు కొన్ని కొన్నిసార్లు అంతరాత్మ ఇచ్చిన ఆర్డర్‌ని పాటించక పోవడమే నేరం అవుతుంది’ అని జడ్జి తీర్పు చెప్పారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top