నాకేమీ వద్దు!

family story samsaram movie

సమ్‌సారం సంసారంలో సినిమా

మా ఇద్దరికీ గొడవ అయింది. అది అవుతూనే ఉంటుంది. అవ్వకపోతేనే, గొడవ అవ్వలేదని చెప్పుకోవాలి. అసలు గొడవనేదే లేకుంటే భార్యాభర్తలన్న మాటకు అర్థమే లేదంటాడు మా మావయ్య. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ ఈ విషయం గురించి మాత్రం బాగా మాట్లాడతాడు. చేసుకోకపోవడం వల్లే ఇంత తెలుసుకున్నాడా? ఏమో తెలియదు. ఆ మాటకొస్తే పెళ్లయిందన్న మాటే కానీ నేనూ గొప్పవాడినే! నాకూ గొప్ప పేరుంది. ఈ మాట మా ఆవిడ ముందు అంటే ఒప్పుకోదు. కుళ్లు అనుకోవచ్చు. భర్త గొప్పోడైతే భార్యకు కుళ్లు ఉంటుందా? ఉండొచ్చు.. మా ఆవిడకు ఉంది. చాలాసార్లు మేం గొడవ పడ్డ సందర్భాలు గుర్తుండవు. అసలు ఎందుకు గొడవ పడ్డామో ఇద్దరం మర్చిపోతుంటాం. కాకపోతే ఒకటుంది. గొడవ పడ్డప్పుడల్లా ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంటాం. దాన్ని ఎంత పద్ధతిగా అమలు పరుస్తాం అంటే... అంత పద్ధతిగా! మా పెళ్లి రోజుకి సరిగ్గా రెండు రోజుల ముందు గొడవ అయింది. చెప్పాను కదా, ఎందుకయిందో గుర్తుండదు. అప్పుడొక నిర్ణయం తీసుకున్నాం.

ఇద్దరం ఎవ్వరం ఎవ్వరికీ గిఫ్ట్‌ ఇచ్చుకోకూడదు అని. అది ఏ గిఫ్ట్‌ అయినా, ఎంతటిదైనా! మాలో ఎవరు గిఫ్ట్‌ కొన్నా సర్‌ప్రైజ్‌లా కాకుండా ఇద్దరం షాపింగ్‌ చేసే కొంటాం. అది మేం ప్రేమలో ఉన్నప్పట్నుంచే జరుగుతూ వస్తోంది. పెళ్లిరోజు కేక్‌ కట్‌ చేశాం, డిన్నర్‌కి వెళ్లాం, పార్టీ చేసుకున్నాం. గిఫ్ట్‌లు మాత్రం ఇచ్చుకోలేదు. ఆ గొడవ అలా సద్దుమణిగిపోయింది. మేము తీసుకున్న నిర్ణయానికి మాత్రం కట్టుబడే ఉన్నాం. ప్రపంచానికి మేము మంచి భార్యాభర్తలం. మేమిద్దరమే ఉన్నా కూడా చక్కగా ఉంటాం. మా ఆవిడకు నేను గొప్ప వాడినని కుళ్లు అన్నా కదా, మా ఇద్దరినీ కలిసి చూస్తే ప్రపంచానికి కుళ్లు. అంత బాగుంటాం ఇద్దరం. గొడవలు గొడవలే! మా మావయ్య చెప్పింది నిజమే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.పెళ్లిరోజు పోయిన నెలకే నా పుట్టినరోజు. పొద్దున్నే ఆఫీసుకు వెళ్లేప్పుడే చెప్పింది, ‘‘ఇవ్వాళ తొందరగా వచ్చెయ్‌! నేను హాఫ్‌ డే లీవ్‌’’ అని. మధ్యాహ్నం అదే విషయం చెప్తూ మళ్లీ ఫోన్‌ చేసింది.     

‘‘తిన్నావా?’’ ‘‘ఆ! తిన్నా’’  ‘‘సరే! నేనిప్పుడే ఇంటికి వచ్చా. ఇవ్వాళ హాఫ్‌ డే చేశా. నీకోసమే!’’ ‘‘రేపు నా పుట్టినరోజనా?’’ ‘‘అంత సీన్‌ లేదులే కానీ, త్వరగా వచ్చెయ్‌’’ నవ్వుతూ చెప్పింది. ‘‘సర్‌ప్రైజా? ఓ... వెయిట్‌.. సర్‌ప్రైజా?’’ అడిగా. ‘‘నువ్వైతే రా!’’ అంది. మా జంటను చూసి మీరు కుళ్లుకుంటే నేనేం చేయలేను. సాయంత్రం దాకా సర్‌ప్రైజ్‌ ఏంటా ఏంటా అనే ఆలోచిస్తూ కూర్చున్నా. నాకప్పుడు గుర్తొచ్చింది. నేను గిఫ్ట్స్‌ తీసుకోవద్దు అని. మొత్తం ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి. ఎగై్జట్‌మెంట్‌ చచ్చిపోయింది. తను చెప్పింది కాబట్టి తొందరగానే ఇంటికెళ్లిపోయా. ‘‘సరే! రెడీ అయిరా.. బయటకెళ్దాం’’ అంది.. నేను ఇంట్లో అడుగుపెట్టడమే! ‘‘ఎందుకు?’’ ‘‘ఎందుకేంటి?’’ ‘‘అదే రెడీ అవ్వడం ఎందుకూ?’’ ‘‘రెడీ అయ్యి రా బాబూ.. బయటికెళ్దాం’’ ‘‘దేనికీ?’’ ‘‘రేపు నీ బర్త్‌డే కదా! నేనేదైనా కొనిపెడతా’’

‘‘అవసరం లేదు.’’ ‘‘ఏం అవసరం లేదు?’’ ‘‘అవసరం లేదు. మన అగ్రిమెంట్‌ మర్చిపోయావా? ఎవ్వరం ఎవ్వరికీ గిఫ్ట్‌ ఇచ్చుకోవద్దు.’’ ‘‘ఇప్పుడవన్నీ ఎందుకు ఆలోచిస్తావ్‌?’’ ‘‘నేనిప్పుడే ఆలోచిస్తా. రేపు పార్టీ ప్లాన్‌ చేద్దాం. అంతే కానీ నువ్‌ నాకేం గిఫ్ట్‌ ఇవ్వనక్కర్లేదు.’’     కోపంగా చూసింది. నాకోసమే రెడీ అయి ఎదురుచూస్తూ కూర్చుందేమో, భలే అందంగా ఉంది. ‘‘చావ్‌!’’ అనుకుంటూ బెడ్‌రూమ్‌కు వెళ్లిపోయింది. గిఫ్ట్‌లేం ఇచ్చుకోకుండానే పుట్టినరోజు అయిపోయింది. నా పుట్టినరోజు పోయిన నెలన్నరకే తన పుట్టినరోజు వచ్చింది. మా అగ్రిమెంట్‌ బాగానే గుర్తుంది కానీ ఎందుకో ఏదోక గిఫ్ట్‌ ఇవ్వాలని అనిపించింది. ఎల్లుండి తన పుట్టినరోజు. టీవీలో ఏదో చూస్తూ కూర్చుంది. కాఫీ కలుపుకొని వెళ్లి ఇచ్చా. ‘‘థ్యాంక్యూ!’’ అని తీసుకుంటూ ‘రా కూర్చో’ అని సైగ చేసింది. ‘‘బర్త్‌డే ప్లాన్స్‌ ఏం చేద్దాం?’’ అనడిగా ‘‘రెగ్యులర్‌గానే చేద్దాం. కొత్తగా ఏం చేస్తాం?’’ ‘‘నేన్నీకు..’’ అని పూర్తి చేయకముందే ‘‘కొంపదీసి గిఫ్ట్‌ ఇస్తావా?’’
‘‘అదే అనుకుంటున్నా. షాపింగ్‌కు వెళ్దాం పద’’ ‘‘నేను రాను’’ ‘‘అరే! ఏదైనా కొనిపెడతా అన్నా కదా..’’ ‘‘నాకేమీ వద్దు’’ ‘‘నేనేమన్నానని..’’ ‘‘నువ్‌ ఏమనడమో కాదు. నాకేమీ వద్దు. మొన్న నీ బర్త్‌డేకి అడిగితే వచ్చావా?’’ ‘‘అదేదో..’’ ‘‘అవసరం లేదు. నాకు నువ్విచ్చే గిఫ్ట్‌.. అదెంత చిన్నదైనా గొప్పే! కానీ వద్దు. వద్దంటే వద్దు.’’

‘‘మొండి చెయ్యకు..’’ ‘‘సరే సార్‌! నాకేమీ వద్దు.’’ ‘‘చావ్‌!’’ అని అక్కణ్నుంచి వెళ్లిపోయా. తన పుట్టినరోజు కూడా అయిపోయింది. టైమ్‌ గిర్రున తిరిగి, మా పెళ్లి రోజు మళ్లీ వచ్చింది. అప్పుడూ గిఫ్ట్‌లు ఏమీ ఇచ్చుకోలే! నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడూ గిఫ్ట్‌ మాట వచ్చింది కానీ, నేనే మళ్లీ ఓవరాక్షన్‌ చేసి వద్దన్నా. ఇప్పుడు తన పుట్టినరోజు వచ్చింది. ఈసారి మా అగ్రిమెంట్‌ ఎలాగైనా బ్రేక్‌ చేయాలనుకున్నా. ఇక్కడ నాకూ కాస్త ఈగో ఉందనే చెప్పుకోవాలి. తన పుట్టినరోజుకి మూడు రోజుల ముందు ఒక లెటర్‌ రాశా. అది చదివింది. ‘బాగుంది’ అని మెచ్చుకుంది. భార్యాభర్తల మధ్య మెచ్చుకోవడాలు ఏంటో! ఆ ఉత్సాహం మీదనే అడిగా, ‘‘నీ బర్త్‌డేకి..’’ ‘‘చెప్పు నా బర్త్‌డేకి..’’ ‘‘షాపింగ్‌కి వెళ్దామా?’’ నవ్వింది. ‘‘చెప్పు వెళ్దామా?’’ మళ్లీ అడిగా. వెళ్దామన్నట్టు తలూపింది. ‘‘నువ్వు ఒప్పుకుంటావనుకోలే! రెండేళ్లలో రెండు సార్లు నీకు గిఫ్ట్‌ ఇవ్వలేకపోయినందుకు ఎంత బాధపడ్డానో!’’ అన్నా. ‘‘అహా! ఎక్కడ పెట్టావ్‌ ఆ రెండు గిఫ్ట్‌లూ?’’ అడిగింది. నేను అయోమయంగా చూశా. లోపలికెళ్లింది. రెండు నిమిషాల్లో తను నాకోసం ఈ రెండేళ్లలో తీసుకున్న మూడు గిఫ్ట్‌లు తెచ్చి ముందు పెట్టింది. వాచీ, మొబైల్‌ ఫోన్, ఏడు టీ షర్ట్స్‌ ఉన్న ప్యాక్‌. నేనైతే తను ‘నాకేమీ వద్దు’ అనగానే ఏ గిఫ్టూ కొనలేదు. జరగబోయేది భయపెట్టేసింది. అరుస్తుందా? ఎలా కవర్‌ చేయాలి? దాచిపెట్టా అని చెప్పి రెండు రోజుల్లో ఎప్పుడో కొన్నట్టు కొత్తవి కొంటే? అయినా... సడెన్‌గా ఏంటీ ట్విస్ట్‌?
 

సినిమాలో సంసారం
ప్యాంటు, షర్టు కావాలని నేనడిగానా?
చీరలు కావాలని నేను వేధించానా?

భానుప్రసాద్‌(వెంకటేశ్‌), స్వప్న(మీనా) ప్రేమించుకుంటారు. వారి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుని వేరు కాపురం పెడతారు. భానుప్రసాద్‌ బస్సు క్లీనర్‌గా చేరతాడు. అడ్వాన్స్‌గా ఇచ్చిన 500 రూపాయలు భార్యకి ఇచ్చి, అందులో రూ.250 తీసుకుని సరుకులు తెస్తానని సంతకి వెళతాడు. అక్కడ ఒక చీర కొంటే మరో చీర ఉచితంగా ఇస్తుండటంతో సరుకులు తీసుకోకుండా చీరలు కొనుక్కొని ఇంటికొస్తాడు. ‘అదేంటండీ వట్టి చేతులతో వచ్చారు. సరుకులేవీ?’ అని భర్తని ప్రశ్నిస్తుంది భార్య. భానుప్రసాద్‌ గుంజిళ్లు తీస్తూ అసలు సంగతి చెబుతాడు. ‘ఉన్న డబ్బంతా పెట్టి చీరలు కొన్నారు.. మరిప్పుడు సాపాటు’ అంటుంది స్వప్న. ‘నేనంత తెలివి తక్కువ వాడినా.. నీ వద్ద రూ.250 ఉంది కదా.. వాటితో సరుకులు కొనేస్తా. వెళ్లి డబ్బులు తీసుకురా’ అంటాడు భానుప్రసాద్‌. స్వప్న కూడా గుంజిళ్లు తీస్తూ ఆ డబ్బుతో ప్యాంటు, షర్టు కొన్న విషయం చెబుతుంది. ‘ఉన్న డబ్బులన్నీ పెట్టి బట్టలు కొనేశావు. మరిప్పుడు సాపాటు?’ అని భర్త ప్రశ్నిస్తే.. అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి అంటుంది స్వప్న. ‘ప్యాంటు, షర్టు కావాలని నేను అడిగానా అని భానుప్రసాద్, నేను మాత్రం చీరలు కావాలని వేధించానా?’ అని స్వప్న వాదించుకుంటారు. ఉన్న డబ్బుతో బట్టలు కొనేస్తే ఇల్లు గడిచేదెలా అనేదే వారి బాధ. భార్యాభర్తల మధ్య ప్రేమకు, ఒకరి పట్ల మరొకరికి ఉండాల్సిన కన్‌సర్న్‌కు ప్రతీకగా ఉంటుంది ‘సూర్యవంశం’ సినిమాలోని ఈ సన్నివేశం.

ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి.  సాక్షి పాఠకులతో పంచుకోండి.
ఈ మెయిల్‌: samsaaram2017@gmail.com
– వి. మల్లికార్జున్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top