బెల్ట్‌ బిగించింది

Family crime story special - Sakshi

దూరంగా పారిపోయినానేరం పారిపోనివ్వదు.చేసిన పాపం ఊరికే ఉండనివ్వదు.కెలికే మనస్సు ఆరా తీయమంటుంది. ఆ పని కాస్తా పట్టుబడేలా చేస్తుంది.అనుమానానికి మించిన అపాయం లేదు.

2005, ఫిబ్రవరి 9.ఉదయం 8:30.పోలీసు జీపు సైరన్‌తో గుమికూడిన జనాల్లో కదలిక వచ్చింది.ఆ ఇంటి ముందున్న జనం రోడ్డు వైపు తలలు తిప్పారు.జీప్‌ వచ్చి ఆ ఇంటి ముందాగింది. వచ్చినంత వేగంగా జీపులో నుంచి దిగిన పోలీసులు అంతే వేగంగా ఆ ఇంట్లో అడుగుపెట్టారు. ఎదురుగా కనిపించిన దృశ్యానికి కడుపులో దేవినట్టుగా అయ్యింది వాళ్లకి.ఇంకా పూర్తిగా ఆరకుండా మడుగు కట్టిన రక్తంతో ఒకలాంటి దుర్వాసన వస్తోంది.ఏడెనిమిదేళ్లుంటాయి ఆ పిల్లవాడికి. మూడు పదులు దాటిన ఓ ఆడమనిషి. ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. ఒళ్లంతా కత్తిగాట్లు ఉన్నాయి. ఆ ఇద్దరినీ అతి కిరాతకంగా చంపేశారు ఎవరో! ఆ గదిలో చుట్టూ చూశారు పోలీసులు. మూలన ఓ బట్టల మూట, పాతబడిన రెండు బెడ్‌షీట్లు.  ఓ మూలన పాత స్టౌవ్, నాలుగైదు గిన్నెలు కనిపిస్తున్నాయి.‘సార్, ఇది మా ఇల్లే సార్‌. నెల క్రితం ఈ గదిని ఈమెకు అద్దెకు ఇచ్చాను’ అన్నాడు గుంపులో నుంచి వచ్చిన ఓ వ్యక్తి. ‘ఆమె పేరు రేఖ. పిల్లవాడి పేరు బబ్లూ. దగ్గరలో హాస్పిటల్‌ బిల్డింగ్‌ కడుతున్నారు. దాంట్లో పనిచేసేది. పిల్లవాడు కూడా ఆమెతో పాటు తిరుగుతూండేవాడు. తనకు ఎవరూ లేరని, భర్త చనిపోయాడని చెప్పింది. పోనీలే పాపం అని గది అద్దెకు ఇచ్చాను’ అన్నాడతను. ఆంబులెన్స్, క్లూస్‌ టీమ్‌ వచ్చింది. మార్కింగ్‌ చేసి, శవాలను ఆంబులెన్స్‌లో తరలించారు పోలీసులు.

స్టేషన్‌లో ఎస్సై ఆలోచనలో ఉన్నాడు.వాళ్లిద్దరిని చంపి వెళ్లిన వ్యక్తి ఎవరో తెలియడం లేదు.ఆ ఏరియాలో సిసి కెమెరాలు లేవు ఏదైనా క్లూ దొరుకుతుందనుకుంటే. దిక్కులేని వారి హత్యల కింద ఈ కేసు మరుగున పడిపోతుందా?కానిస్టేబుల్‌ వచ్చి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ఇచ్చాడు.మెడ, ఛాతీ భాగంలో లోతైన కత్తిపోట్ల వల్ల మరణించారని ఉంది అందులో. ‘ఆ చుట్టుపక్కల వారిని అడిగాం సార్‌. ఏ వివరాలు తెలియలేదు.  గదిలో ఏ ఆధారాలు దొరకలేదు సార్‌’ అన్నాడు కానిస్టేబుల్‌.‘ఏ ఆధారం లేకుండా నేరస్తుడు ఈ పని చేశాడంటే అతడు నేరాలు చేయడంలో ఆరితేరిన వాడై ఉండాలి. ఆ నేరస్తుడు ఎవరో.. ఎలా కనిపెట్టడం..?’ ఆలోచనలో పడ్డాడు ఎస్సై. కానిస్టేబుల్‌ను తనతో పాటు రమ్మన్నట్టు సైగ చేసి వెళ్లి జీపులో కూర్చున్నాడు. 

ఇద్దరూ మళ్లీ ఆ గది వద్దకు వెళ్లారు. అక్కడ ఒక్కో వస్తువును పరిశీలన గా చూశారు. గోడకు ఒక చిన్న పాత సంచి ఉంది. అందులో పిల్లవాడి బట్టలు ఉన్నాయి. గది అంతా ఒకసారి కలియతిరిగి ‘వెళ్దాం పద’.. అన్నట్టు కానిస్టేబుల్‌ వైపు చూశాడు ఎస్సై.కానిస్టేబుల్‌ బయటకు నడిచాడు. బయటకు వెళ్లబోతున్న ఎస్సైని ఒక వస్తువు ఆకర్షించింది. అది బట్టల మధ్య ఉన్న స్కూల్‌ బెల్ట్‌. తెలుపు, నీలం రంగు చారలతో ఉంది. దగ్గరగా వెళ్లి ఆ బెల్ట్‌ని తీసుకొని చూశాడు. విద్యానికేతన్‌ స్కూల్‌ అని ప్రింట్‌ చేసి ఉంది. ఎస్సై కోసం తిరిగి లోపలికి వచ్చిన కానిస్టేబుల్‌ వైపు చూస్తూ..‘ఇది స్కూల్‌ బెల్ట్‌. ఈ కేసులో ఇదే క్లూ.ఇక్కడికి దగ్గరలో ఈ పేరుతో ఏ స్కూల్‌ ఉందో వెరిఫై చేయ్‌!’ అన్నాడు.ఇద్దరూ ఆ బెల్ట్‌ తీసుకొని గదికి తాళం వేసి బయటకు నడిచారు. 

‘సార్‌! ఇది మా స్కూల్‌కి సంబంధించిన బెల్ట్‌’ చెప్పింది స్కూల్‌ ప్రిన్సిపాల్‌.‘ఈ ఫొటోలో ఉన్న పిల్లవాడు మీ దగ్గర చదువుకుంటున్నట్టు ఎలా తెలుసుకోవచ్చు. ఈ పిల్లవాడి పేరు బబ్లూ’ వివరాలు చెప్పాడుఎస్సై బబ్లూ డెడ్‌బాడీ ఫొటో చూపిస్తూ.‘ఫైవ్‌ మినిట్స్‌ సార్‌! వెరీఫై చేసి చెబుతా!’ అంది ప్రిన్సిపల్‌.‘సార్‌ ఆ పిల్లవాడు  మా దగ్గరే చదువుతున్నాడు. సెకండ్‌ క్లాస్‌. నెల రోజులుగా స్కూల్‌కి రావడంలేదు’ చెబుతూ రిజిస్టర్‌ ఎస్సై ముందుంచింది ప్రిన్సిపాల్‌.ఆ రిజిస్టర్‌లో పిల్లవాడి ఫొటో, వివరాలతో పాటు తండ్రి అని ఉన్న బాక్స్‌ పక్కన ఓ ఫొటో అతికించి ఉంది.  పేరు బిజ్జూ అని రాసుంది.తం్రyì  ఫొటోతో పాటు, ఆ రిజిస్టర్‌లో అడ్రస్‌ ఉంది. కాని అది హత్య జరిగిన ఇల్లు ఉన్న అడ్రస్‌ కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వేరే అడ్రస్‌. ఆ అడ్రస్‌ ఉన్న చోటును వెతుక్కుంటూ వెళ్లారు. పోచమ్మ గుడి పక్క సందు, చంపాపేట్‌.అక్కడ అందరికీ ఆ ఫొటో చూపించారు. ‘సార్‌! ఇతని పేరు బిజ్జూ. ఇళ్లకు పెయింట్లు వేస్తుంటాడు. కొడుకు, భార్యతో కలిసి ఈ కాలనీలోనే రెండేళ్లుగా ఉండేవాడు. అర్థరాత్రి తాగొచ్చి భార్య, కొడుకును కొడుతుండేవాడు.వాళ్లది బీహార్‌ అని, చుట్టాలు అక్కడే ఉన్నారని చెప్పేవాడు. కాని ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ లేదు’ అన్నారు అక్కడివాళ్లు.‘ఇతనికి సంబంధించిన వివరాలు ఇంకేమైనా తెలిస్తే మాకు వెంటనే చెప్పండి’ అన్నాడు ఎస్సై.ఆ తర్వాత బిజ్జూ  ఫొటోని బీహార్‌ పోలీస్ట్‌ స్టేషన్‌కి ఫ్యాక్స్‌ చేశారు.

మరుసటి రోజు ఉదయం పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ మోగింది. ‘సార్, మీరు నిన్న వచ్చారు కదా! ఆ బిజ్జూ ఫోన్‌ చేశాడు. వాళ్ల బంధువులకు ఎవరికో బాగోలేదట. అందుకే బిహార్‌లో ఉన్నారట. అతని భార్య, పిల్లవాడి గురించి అడిగితే బాగున్నారు అని చెప్పాడు సార్‌!’ అన్నాడు ఫోన్‌లో సమాచారం చెప్పిన వ్యక్తి. పోలీసులు వెంటనే అలెర్ట్‌ అయ్యారు.ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా బిజ్జూను పట్టుకున్నారు పోలీసులు. నల్లగా పొట్టిగా సిగరెట్లు తాగి తాగి నల్లబడిన పెదాలతో గుంటలు పడిన కళ్లతో అస్థిమితంగా కనిపించాడు.హైదరాబాద్‌ తీసుకొచ్చాక విచారణ మొదలైంది.‘చెప్పు ఎందుకు చంపావు నీ భార్యా పిల్లలను’‘నేను చంపడం ఏమిటి?’ అన్నాడతను.ఎస్సై అతని ఎదురుగా కొన్ని కాగితాలు పెట్టాడు. వాటి మీద వేలిముద్రలు ఉన్నాయి. కాని అవి ఉత్తుత్తివి అని ఎస్సైకి తెలుసు.‘నీ వేలి ముద్రలు మేచ్‌ అయ్యాయి.చూడు.నువ్వు తప్పించుకోలేవు’ అన్నాడు.బిజ్జూ నోరు విప్పాడు.

బిజ్జూ, రేఖలది బీహార్‌. రేఖ పెళ్లయి పదేళ్లయ్యింది. పిల్లవాడికి ఐదేళ్ల వయసులో భర్త ప్రమాదంలో చనిపోయాడు. పుట్టింట్లో కొడుకుతో పాటు ఉండేది రేఖ. అక్కడే కొన్నాళ్లకు బిజ్జూతో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో  తెలిసినవారున్నారని, అక్కడ పనులు సులువుగా దొరుకుతాయని, అక్కడే బతకొచ్చని రేఖకు చెప్పాడు బిజ్జూ. ఆ మాటలను నమ్మిన రేఖ అమ్మనాన్నలను వదిలేసి కొడుకును తీసుకొని హైదరాబాద్‌ వచ్చింది. చంపాపేట్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. బిజ్జూ ఇళ్లకు పెయింటింగ్‌ వేసే పనులు చేస్తుండేవాడు. రేఖ ఇంటిపట్టునే ఉండేది.  పిల్లవాడిని అదే కాలనీలో ఉండే స్కూల్లో చేర్చాడు బిజ్జూ. తండ్రి స్థానంలో తన పేరు, ఫొటో వివరాలు ఇచ్చాడు. పిల్లవాడు రోజూ స్కూల్‌కెళుతున్నాడు. బిజ్జూ పెయింటింగ్‌ పనులకు వెళుతున్నాడు.ఒకరోజు...‘అతనెవరు?’ అడిగాడు బిజ్జూ.‘ఎవరు?’ అడిగింది రేఖ.‘ఇందాక నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి’‘ఏదో అడ్రస్‌ అడిగితే చెప్పాను’‘అబద్ధం’‘అయ్యో.. అదే నిజం’‘మగావాళ్లు కనిపిస్తే చాలు నవ్వుతూ మాట్లాడతావు’‘అది కూడా తప్పేనా?’‘నన్ను తగులుకున్నది చాలదా. ఇంకా ఎంతమందిని తగలుకోవాలనుకుంటున్నావ్‌?’ఫట్‌మంటూ దెబ్బ పడింది.ఆరోజున పడ్డ అనుమానం పెనుభూతం అయ్యింది. 

మద్యానికి అలవాటైన బిజ్జూ పగలు కూడా తాగుతూ పనులు కెళ్లడం తగ్గించాడు. నిజానికి రేఖ మీద కాపలా కోసం ఇంట్లోనే ఉండిపోసాగాడు. కాని ఇల్లు గడవాలిగా. చుట్టుపక్కల తెలిసిన వారి ద్వారా భవన  నిర్మాణ కూలీగా పనులకు వెళ్లడం మొదలుపెట్టింది రేఖ. దీంతో బిజ్జూకి ఇంకా అనుమానం పెరిగింది.  పని మానేయమని లేకుంటే పిల్లవాడిని చంపేస్తానని బెదిరించేవాడు.  ఓ రోజు రాత్రి అన్నంత పని చేయబోయాడు. కూరగాయలు కోసే కత్తితో పిల్లవాడి మీద దాడి చేయబోయాడు. అడ్డం పడ్డ రేఖ బిజ్జూని నెట్టేసి కొడుకును తీసుకొని బయటకు నడిచింది. ఆ రోజు రాత్రి ఇంటి బయటే ఉండిపోయింది. బిజ్జూతో ఉంటే తను, తన కొడుకు బతకడం కష్టమే అనిపించింది రేఖకు. తను పనిచేసే చోట ఒకామె సాయంతో గది చూసుకొని, బిజ్జూ తాగి పడుకున్న సమయంలో కొడుకును తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. బిజ్జూ రేఖ కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆమె పని చేసే చోటుకి వెళ్లాడు. అక్కడ పని మానేసిందని తెలిసింది.  రేఖ మరో చోట కూలీ పని చూసుకుంటూ కొడుకును పోషించుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతోంది. నెల రోజుల తర్వాత ఓ రోజు రేఖ ఎక్కడ ఉందో కనిపెట్టిన బిజ్జూ ఆమెను వెంబడించాడు. రాత్రి వరకు ఆ చుట్టుపక్కలనే తిరిగాడు. చుట్టుపక్కల అంతటా సద్దుమణిగాక రేఖ ఇంట్లోకి జొరపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో తల్లీ, కొడుకులిద్దరినీ చంపేసి వెళ్లిపోయాడు. 

కొద్దిపాటి సామాను, పిల్లవాడి బట్టలు ఇంటి నుంచి వస్తూ వస్తూ తనతో పాటు తెచ్చుకుంది రేఖ. బిజ్జూకు తెలియకుండా ఎక్కడో ఓ మూలన కొడుకుతో హాయిగా బతికేయచ్చు అనుకుంది. తనను కాదని వెళ్లిపోయి మరెవరికో సొంతమవుతుందన్న అనుమానంతో రేఖపై ద్వేషాన్ని పెంచుకున్నాడు బిజ్జూ. ఆ అనుమానంతోనే రేఖ, ఆమె కొడుకు బబ్లూను చంపేశాడు. పోలీసులకు పట్టుబడకూడదని బీహార్‌ వెళ్లిపోయాడు. తన గురించి పోలీసులకు తెలిసుండే అవకాశమే లేదనుకున్నాడు బిజ్జూ.కాని హైదరాబాద్‌లో పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి మనసు ఆగక ప్రతి నేరస్తుడు చేసినట్టే వివరాల కోసం ఫోన్‌ చేశాడు. ఆ ఫోన్‌ కాల్‌ అతడెక్కడున్నాడో తెలుసుకునే వీలు కల్పించింది. 
నమ్మకం కోల్పోయిన వ్యక్తి నరకం చూపిస్తాడు నరకం అనుభవిస్తాడు
ప్రస్తుతం బిజ్జూ కటకటాల వెనుక ఉన్నాడు.
– నిర్మలారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top