రోజూ చూడండి... అప్పుడప్పుడు మాత్రమే వండుకోండి

Experts Say That All The Dishes Shown On TV Are Not Eaten - Sakshi

వంటల కార్యక్రమంపై అధ్యయనవేత్తలు చెబుతున్న జాగ్రత్త చాలామంది వంటల ప్రోగ్రాములను సరదగా చూస్తూ ఉంటారు. కొంతమంది వాటిని ట్రై చేస్తూ కూడా ఉంటారు. అదృష్టమేమిటంటే... చూసేవాళ్ల కంటే ట్రై చేసేవాళ్లు తక్కువ. అంటే ఆ వంటకాలతో నేరుగా ప్రమాదమేమీ ఉండదుగానీ... అదేపనిగా వాటిని నిత్యం తయారు చేస్తూ, తినిపిస్తూ, తింటూ ఉంటే ఇంట్లోవాళ్ల బరువు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు కొందరు అధ్యయనవేత్తలు. అలా చూసిందల్లా వండుకునే అలవాటు ఉంటే మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ జాగ్రత్త అని చెబుతున్నారు కొందరు పరిశోధకులు. కొన్నాళ్ల కిందట కొందరు అధ్యయనవేత్తలు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు  గలవారిని దాదాపు 500 మంది మహిళలను ఎంపిక చేశారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు.

ఆ గ్రూపులకు ‘వ్యూవర్స్‌’ అండ్‌ ‘డూవర్స్‌’ అంటూ పేర్లు కూడా పెట్టారు. అంటే కేవలం వంటల కార్యక్రమాన్ని చూసేవారూ, చూసినవి చేసేవారు అని వర్గీకరించారు. వ్యూవర్స్‌ వాటిని క్రమం తప్పకుండా చూస్తూ ఆనందిస్తుంటారంతే. కానీ డూవర్‌స మాత్రం ఒక నిర్ణీత వ్యవధి పాటు వాటిని వండుకొని తింటూ కూడా ఉంటారు. ఇలా...  చూసి ఆనందించేవారితో పోల్చినప్పుడు, వాటిని ఇంట్లోనూ వండి తినే వారు చాలా కొద్ది సమయంలోనే సగటున దాదాపు 5 కిలోల (పదకొండు పౌండ్లు) బరువు పెరిగినట్లు గమనించారు. ఈ బరువు చాలా ఎక్కువనీ, ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

పైగా చూసినవి, చేసుకుని తినేవారిలో చాలామందికి పొట్టపెరగడం (సెంట్రల్‌ ఒబేసిటీ) పెరిగిందట. ఇది గుండెజబ్బులు మొదలుకొని ఆరోగ్యానికి అనేక అనర్థాలు తెచ్చిపెడుతుందని తేలిందని ఆ అధ్యయనవేత్తలు హెచ్చరించారు. తమ పరిశోధన ఫలితాలు కొన్నాళ్ల కిందట ‘ఎపిటైట్‌’ అనే హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వంటప్రోగ్రాములు చూస్తూ ఒకవేళ ఇలా నిత్యం వండుకునే వారెవరైనా ఉంటే... అది అప్పుడప్పుడు మాత్రమే సరదాగా చేయాల్సిన పని అనీ, అంతేగానీ చూసిందల్లా వండి తినకండి అంటూ జాగ్రత్తలు కూడా చెబుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top