breaking news
Cooking program
-
రోజూ చూడండి... అప్పుడప్పుడు మాత్రమే వండుకోండి
వంటల కార్యక్రమంపై అధ్యయనవేత్తలు చెబుతున్న జాగ్రత్త చాలామంది వంటల ప్రోగ్రాములను సరదగా చూస్తూ ఉంటారు. కొంతమంది వాటిని ట్రై చేస్తూ కూడా ఉంటారు. అదృష్టమేమిటంటే... చూసేవాళ్ల కంటే ట్రై చేసేవాళ్లు తక్కువ. అంటే ఆ వంటకాలతో నేరుగా ప్రమాదమేమీ ఉండదుగానీ... అదేపనిగా వాటిని నిత్యం తయారు చేస్తూ, తినిపిస్తూ, తింటూ ఉంటే ఇంట్లోవాళ్ల బరువు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు కొందరు అధ్యయనవేత్తలు. అలా చూసిందల్లా వండుకునే అలవాటు ఉంటే మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ జాగ్రత్త అని చెబుతున్నారు కొందరు పరిశోధకులు. కొన్నాళ్ల కిందట కొందరు అధ్యయనవేత్తలు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గలవారిని దాదాపు 500 మంది మహిళలను ఎంపిక చేశారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఆ గ్రూపులకు ‘వ్యూవర్స్’ అండ్ ‘డూవర్స్’ అంటూ పేర్లు కూడా పెట్టారు. అంటే కేవలం వంటల కార్యక్రమాన్ని చూసేవారూ, చూసినవి చేసేవారు అని వర్గీకరించారు. వ్యూవర్స్ వాటిని క్రమం తప్పకుండా చూస్తూ ఆనందిస్తుంటారంతే. కానీ డూవర్‌స మాత్రం ఒక నిర్ణీత వ్యవధి పాటు వాటిని వండుకొని తింటూ కూడా ఉంటారు. ఇలా... చూసి ఆనందించేవారితో పోల్చినప్పుడు, వాటిని ఇంట్లోనూ వండి తినే వారు చాలా కొద్ది సమయంలోనే సగటున దాదాపు 5 కిలోల (పదకొండు పౌండ్లు) బరువు పెరిగినట్లు గమనించారు. ఈ బరువు చాలా ఎక్కువనీ, ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. పైగా చూసినవి, చేసుకుని తినేవారిలో చాలామందికి పొట్టపెరగడం (సెంట్రల్ ఒబేసిటీ) పెరిగిందట. ఇది గుండెజబ్బులు మొదలుకొని ఆరోగ్యానికి అనేక అనర్థాలు తెచ్చిపెడుతుందని తేలిందని ఆ అధ్యయనవేత్తలు హెచ్చరించారు. తమ పరిశోధన ఫలితాలు కొన్నాళ్ల కిందట ‘ఎపిటైట్’ అనే హెల్త్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వంటప్రోగ్రాములు చూస్తూ ఒకవేళ ఇలా నిత్యం వండుకునే వారెవరైనా ఉంటే... అది అప్పుడప్పుడు మాత్రమే సరదాగా చేయాల్సిన పని అనీ, అంతేగానీ చూసిందల్లా వండి తినకండి అంటూ జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. -
ఈట్ అవుట్
-
టీవీ వంట షోలతో ఇదేమి తంటా!
వంటల ప్రోగ్రామ్‌లో ఏం చూపిస్తారు? ఇదీ ఓ ప్రశ్నేనా వంట చేసి చూపిస్తారు అంటారు... అంతేగా! అంతే అని సింపుల్‌గా చెప్పేయడానికి లేదు. ఎందుకంటే... వంట మామూలుగా చేసి చూపించరు మన కుకరీ షోల్లో. మామూలు వంటనే స్పెషల్‌గా చేసి చూపిస్తారు. అవును. మనకు తెలియని వంటలు చేసి చూపిస్తారని మనం టీవీ ఆన్ చేస్తే... మనకు తెలిసినదాన్నే మళ్లీ మళ్లీ చేసి చూపించి మనకు రుచి చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ షోలను నిర్వహించేవాళ్లకు ఇది తెలియని సంగతి కాదు. వారి పరిమితులు ఏమైనా ఉండవచ్చు. కానీ, ప్రేక్షకులు అసంతృప్తితో ఉంటున్నారు. ప్రతి ప్రముఖ చానెల్లోనూ తప్పకుండా ఒక వంటల ప్రోగ్రామ్ ఉంటుంది. షోలో ఓ యాంకర్, ఓ చెఫ్ ఉంటారు. కొన్నిటిలో చెఫ్‌లు మాత్రమే ఉంటారు. మరికొన్నిటిలో సెలెబ్రిటీలు వస్తుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు. కానీ ఈ సందడిలో ఒకటి మాత్రం మర్చిపోతుంటారు. ప్రేక్షకులు వంటల ప్రోగ్రామ్ చూసేది కొత్త వంటకాల్ని నేర్చుకోవడం కోసం. అది చేయగలిగితే ఇంత హడావుడి అవసరం ఉండదు. కానీ చాలామంది అది చేయడం లేదు. రోజూ వండుకునే పప్పులో కాసింత నిమ్మరసం పిండి కొత్త వెరైటీ అని చెప్పడం, చపాతీలో కూరగాయ ముక్కలు పెట్టి హెల్దీ చపాతీ రోల్స్ అని నమ్మించడం లాంటి వాటికి పరిమితమవుతున్నారు. ఇక ఈ షోలతో మరో బాధ... వంటకంటే మాటలు ఎక్కువవ్వడం. చెఫ్ చెప్పే ప్రతి మాటకీ యాంకర్ ఏదో ఒక కొసమెరుపు ఇవ్వాలని ప్రయత్నించడంతో చెవులు వాచిపోతుంటాయి. ప్రేక్షకుడికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేసే ప్రయత్నంలో భాగంగా యాంకర్లు చెఫ్‌లని వేసే ప్రశ్నలు నవ్వును కూడా తెప్పిస్తాయి. ఇక ఓ చానెల్లో వచ్చే షోలో అయితే భార్యాభర్తలిద్దరూ గరిటె తిప్పుతుంటారు. చెప్పిందే చెప్పి, తిప్పి చెప్పి, అలా చెప్పీ చెప్పీ చంపేస్తుంటారు. పైగా వాళ్లు వండినదాన్ని వాళ్లే తింటూ పదే పదే వర్ణిస్తుంటే వినడం మరో హింస. మాటల్ని తగ్గిస్తే ఇంకో వంటకం చూపించొచ్చు కదా! ఇంకా దారుణం ఏమిటంటే వండేటప్పుడు కొన్ని పదార్థాలు వేయడం మర్చిపోతుంటారు. అయ్యో ఇది మర్చిపోయాను, ఇప్పుడు వేసినా ఫర్వాలేదు అని కవర్ చేసుకుంటూ ఉంటారు. కనీసం ఎడిటింగ్‌లో దాన్ని తీసేయొచ్చుగా... లేదంటే రీషూట్ చేసుకోవచ్చుగా. అవేం చేయకుండా ఇలా ప్రేక్షకుడి సహనానికి పరీక్షలు పెట్టడం ఎందుకు! వీళ్లంతా సంజీవ్‌కపూర్, వికాస్‌ఖన్నా, రణవీర్ బ్రార్, నెగైల్లా లాసన్ లాంటి ప్రముఖ చెఫ్‌ల షోలు ఒక్కసారి చూస్తే బాగుణ్ను. అప్పుడైనా కుకరీ షో అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది!