కిటికీలతో కరెంటు.. చల్లదనం

 Electricity with windows cool - Sakshi

పరి పరిశోధన

ఇంటి కిటికీలు మీక్కావాల్సిన విద్యుత్తును తయారు చేయడంతోపాటు ఇల్లంతా చల్లగా ఉంచితే ఎలా ఉంటుంది? అబ్బో అద్భుతంగా ఉంటుంది అంటున్నారా? అయితే మీ ఆశలు త్వరలోనే తీరనున్నాయి. చైనా శాస్త్రవేత్తలు కొందరు సూర్యరశ్మిలోని కొన్ని రకాల కాంతులను అడ్డుకునే, పారదర్శకమైన సోలార్‌ సెల్స్‌ను తయారు చేయడం దీనికి కారణం. సూర్యరశ్మిలో అతినీల లోహిత, పరారుణ కాంతి కూడా ఉంటుందని మనకు తెలుసు అయితే ఇవన్నీ విద్యుదుత్పత్తికి పనికి రావు. ఈ రకమైన కాంతిని మళ్లీ వాతావరణంలోకి పంపించేస్తే ఇంటిలోపల ఉష్ణోగ్రత ఎక్కువ కాదు.

చైనా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ప్లాస్టిక్‌లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది అటు సూర్యుడి తాపం లోనికి చొరబడకుండా అడ్డుకుంటూనే.. ఇంకోవైపు నిర్దిష్ట తరంగదైర్ఘ్యమున్న కాంతి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేక ప్లాస్టిక్‌తో తయారైన కిటికీలు, సోలార్‌ ప్యానెల్స్‌ను వాడటం ద్వారా ఇళ్లలో విద్యుత్తు ఖర్చును సగానికి తగ్గించుకోవచ్చునని అంచనా. ప్రస్తుతానికి ప్లాస్టిక్‌ సోలార్‌ సెల్స్‌ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గణనీయమైన మార్పులు వచ్చేందుకు అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హిన్‌ లాప్‌ యిప్‌ చెప్పారు. చౌకగా తయారు చేసుకోగలగడం, విస్తృత వాడకానికి అవకాశం ఉండటం ఈ ప్లాస్టిక్‌ సోలార్స్‌ సెల్స్‌ సానుకూల అంశాలని వివరించారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top