హార్మోన్ల బ్యాలెన్స్‌కు ఇలా తినండి

Dry Fruits And Vegetables For Hormone Balance - Sakshi

పురుషులతో పోలిస్తే మహిళల్లో స్రవించే హార్మోన్లు చాలా ఎక్కువ. వారిలోని అనేక జీవక్రియలను నిర్వహించేందుకు నిత్యం అనేక హార్మోను స్రవిస్తుంటాయి. వాటి మధ్య ఏమాత్రం సమతౌల్యత తప్పినా ఎన్నో సమస్యలు వస్తాయి. పైగా వాటిని సరిచేయడానికి మరికొన్ని హార్మోన్లను పైనుంచి ఇస్తే మిగతావి కూడా బ్యాలెన్స్‌ తప్పే అవకాశాలూ ఉండవచ్చు. మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యత వల్ల యాంగై్జటీ, త్వరగా కోపం రావడం, త్వరత్వరగా మూడ్స్‌ మారిపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించడం చాలా సాధారణం. తాము రోజూ తీసుకునే ఆహారంతోనే మహిళలు తమకు కావలసిన హార్మోన్లను తగిన పాళ్లలో పొందడం ఎలాగో తెలుసుకోండి. అందుకు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి...

ప్రోజెస్టెరాన్‌:  గర్భధారణకు, మెనోపాజ్‌ సమయంతో పాటు మహిళల సంపూర్ణారోగ్యానికీ ఉపయోగపడే హార్మోన్‌ ఇది. ఈ హార్మోన్‌ లోపిస్తే బరువు పెరగడం, పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీసుకోవాల్సినవి: విటమిన్‌ బి6, పీచు, జింక్, మెగ్నీషియమ్‌ ఉండే ఆహారాలు తీసుకుంటే ఈ హార్మోన్‌ స్వాభావికంగానే సమకూరుతుంది. ఇందుకోసం చిక్కుళ్లు (బీన్స్‌), బ్రోకలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్, గుమ్మడి, పాలకూర, నట్స్‌ వంటివి తీసుకోవాలి.

ఫాలికిల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (ఎఫ్‌ఎస్‌హెచ్‌): ఇది కూడా మహిళల్లో చాలా కీలకమైన హార్మోన్‌. మహిళల్లో మెనోపాజ్‌ వయసు దగ్గర పడుతున్నకొద్దీ దీని స్రావాలు ఎక్కువ.

థైరాయిడ్‌: థైరాయిడ్‌ గ్రంథి స్రవించే హార్మోన్‌లు ఎంతగా అవసరమో అందరికీ తెలిసిందే. దీని మోతాదు కాస్త ఎక్కువైతే హైపర్‌ థైరాయిడిజమ్, తక్కువైతే హైపో థైరాయిడిజమ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. మహిళలతో పాటు పురుషులకు అవసరమైన హార్మోన్‌లను కూడా థైరాయిడ్‌ గ్రంథి స్రవిస్తుంది.

తీసుకోవాల్సినవి: ఎఫ్‌ఎస్‌హెచ్‌ కోసం, థైరాయిడ్‌ గ్రంథి చక్కగా పనిచేయడానికి ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. చేపలు (సాల్మన్, సార్డిన్, కొరమీను వంటివి), అవిశగింజలు, వాల్‌నట్, కిడ్నీబీన్స్, పాలకూర వంటి ఆకుకూరల్లో  ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం పైన పేర్కొన్న హార్మోన్లనే గాక... హైపో పిట్యుటరిజమ్, హైపోగొనాడిజమ్‌ వంటి హార్మోనుల అసమతౌల్యతను ఏర్పరచే కండిషన్లను కూడా నివారిస్తాయి.

ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ (ఎల్‌హెచ్‌): ఇది కూడా మహిళలకు అవసరమైన చాలా ప్రధానమైన హార్మోన్‌. పురుషుల్లో కూడా కొద్దిపాళ్లలో అవసరమే. ఇది మహిళల్లో అవసరమైన ఇతర హార్మోన్లను స్రవించేలా చేస్తుంది.

తీసుకోవాల్సినవి:  ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్‌ లభ్యమయ్యే ప్రధాన ఆహారాలను తీసుకోవడం ద్వారా దీన్ని స్వాభావికంగానే పొందవచ్చు. వాటితోపాటు పొట్టుతీయని గింజధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్‌), పప్పుధాన్యాలు (పల్సెస్‌)తీసుకోవడం ద్వారా ఎల్‌హెచ్‌ను స్వాభావికంగా పొందవచ్చు.

టెస్టోస్టెరాన్‌: ఈ హార్మోన్‌ ప్రధానంగా పురుషులకు అవసరమైనది. అయితే కొద్దిపాళ్లలో మహిళల్లోనూ ఇది అవసరం. మహిళల్లో ఎముకలు, కండరాల బలం కోసం, కొవ్వు సమంగా విస్తరించడంతో పాటు రక్తకణాల ఉత్పత్తి కోసం ఈ హార్మోన్‌ అవసరం.

తీసుకోవాల్సినవి: ఇది జింక్‌ వంటి ఖనిజ లవణాలు, విటమిన్‌–డి లభించే పదార్థాలతో లభ్యమవుతుంది. కొరమీను, సాల్మన్‌ వంటి చేపలు, వేటమాంసం... అందునా ప్రత్యేకంగా కాలేయం వంటి మాంసాహారాలతో పాటు  గుడ్లు, బీన్స్‌ల ద్వారా కూడా సమకూరుతుంది. పండ్లలో దానిమ్మ ద్వారా ఇది స్వాభావికంగా దొరుకుతుంది.

ఆక్సిటోసిస్‌: ఇది హైపోథలామస్‌ ద్వారా ఉత్పత్తి అయి, పిట్యుటరీ గ్రంథి ద్వారా విడుదల అవుతుంది. ఇది మన సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేయడంతో పాటు, సంతానసాఫల్యానికి, బిడ్డపుట్టాక మళ్లీ పీరియడ్స్‌ క్రమంగా రావడానికి ఉపయోగపడుతుంది.

తీసుకోవాల్సినవి: విటమిన్‌–డి ఎక్కువగా ఉండే ఆహారాలైన గుడ్లు, చికెన్, పాలు, తృణధాన్యాలతో పాటు విటమిన్‌–సి పుష్కలంగా ఉండే ఉసిరి, జామ, బెర్రీపండ్లు, టోమాటో, నిమ్మలలో లభ్యమవుతుంది. అంతేగాక బాదం, అవకాడో, డార్క్‌చాక్లెట్లు, అరటిపండ్లు, పెరుగు, బ్రాకలీలలో దొరుకుతుంది.

గ్లూకోజ్‌ మెటబాలిజమ్‌: మహిళల్లో గ్లూకోజ్‌ మెటబాలిజమ్‌ సక్రమంగా జరగడం అవసరం. దాని వల్ల డయాబెటిస్‌ నివారితమవుతుంది.
తీసుకోవాల్సినవి: మెంతులు, మెంతికూర వంటివి తీసుకోవడం ద్వారా ‘డియోస్జెనిన్‌’ అనే ఒక రకం ఈస్ట్రోజెన్‌ లభ్యమవుతుంది. దీని వల్ల గ్లూకోజ్‌ మెటబాలిజమ్‌ సక్రమంగా జరుగుతుంది. అలాగే బాదం నుంచి ‘ఎడిపోన్సెటిన్‌’ అనే స్వాభావిక ప్రోటీన్‌ లభ్యం కావడం వల్ల కూడా గ్లూకోజ్‌ మెటబాలిజమ్‌ సక్రమంగా జరుగుతుంది.

ఎస్ట్రాడియాల్‌: ఇది మహిళలకు అవసరమైన హార్మోన్‌. దీన్నే ఈస్ట్రోజెన్‌ అని వ్యవహరిస్తుంటారు. ఇది తగ్గడం వల్ల యోని సంబంధమైన రుగ్మతలు కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన ఆహారాలు: అవిశగింజలు, సోయా ఉత్పాదనలు, తాజాపండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్‌ వంటి వాటి ద్వారా ఈస్ట్రోజెన్‌ స్వాభావికంగా సమకూరుతుంది.సుజాతా స్టీఫెన్‌చీఫ్‌ న్యూట్రిషనిస్ట్‌యశోద హాస్పిటల్స్,మలక్‌పేట, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top