అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే! | Dont Sleep Once Alarm Rings its Turns to Sleep Inertia | Sakshi
Sakshi News home page

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే!

Jun 14 2019 8:23 AM | Updated on Jun 14 2019 8:23 AM

Dont Sleep Once Alarm Rings its Turns to Sleep Inertia - Sakshi

సరిగ్గా పొద్దున్నే ఏడు గంటలకు లేవానుకుని అలారం పెట్టుకుని మరీ పడుకుంటారు. ఉదయం అది మోగగానే దాని పీకనొక్కేసి మళ్లీ దుప్పట్లో దూరిపోతున్నారా అయితే మీ మెదడును మీరు కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నట్లేనని ఇటీవల వైద్యులు తేల్చి చెప్పారు. అలారాన్ని తాత్కాలికంగా ఆపేసి మరో 10 నిమిషాలు పడుకుందాంలే అనుకుని పడుకోవడం భ్రమ మాత్రమేనట. నిజానికి మన మెదడు అలారం మోతతో మెలకువకు సిద్ధమయ్యాక తిరిగి వెనక్కి వెళ్లడం నిద్రావస్థ సైకిల్‌కు భంగం చేకూరుస్తుందని, అదే ఆనాటి మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుం దని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇలా అలారం మోగగానే దాని తలపై ఒక్కటిచ్చి తిరిగి పడుకోవడం అలవాటుగా మారిందంటే దీర్ఘకాలంలో దాని దుష్ఫలితాలు తప్పవంటున్న వైద్యులు.

ఉత్సాహాన్ని ఊదేసే స్లీప్‌ ఇనర్షియా..
నిద్రలేమి బీపీ, జ్ఞాపక శక్తి తగ్గడం తదితర అనేక శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమౌతుంది. కంటినిండా నిద్రపోతే మరునాడు మీలో ఉత్సాహం పొంగిపొర్లుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. అదే నిద్రనుంచి మేల్కొనడానికి అలారం పెట్టుకొని దాన్ని తాత్కాలికంగా ఆపేసి, తిరిగి ముడుచుకొని పడుకుందామనుకుంటే మాత్రం అది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అలా చేయడం వల్ల నిద్రాభంగం అవుతుందే తప్ప తిరిగి నిద్రలోకి జారుకోవడం అంటూ ఉండదని స్లీప్‌ ఎక్స్‌పర్ట్స్‌ తేల్చి చెబుతున్నారు. అలారాన్ని ఆపేసి పడుకోవడంతో మీ శరీరం, మీ మెదడు పడుకోవాలో, మేల్కోవాలో అర్థం కాని స్థితిలోకి వెళ్తుందట దాన్నే నిద్రలో నిద్ర (స్లీప్‌ ఇనర్షియా) అంటారు. ఈ స్థితి రోజంతా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిద్ర మేల్కోవడానికి ఆ పదినిమిషాలూ బద్దకించడం వల్ల ఉత్సాహానికి బదులు ఆ రోజంతా బద్దకాన్ని కొనితెచ్చుకున్నట్టవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నిద్రలో రెండు దశలు
మన నిద్ర రెండు భాగాలుగా ఉంటుంది. తొలి పార్శ్వం కనుగుడ్లు కదలకుండా(నాన్‌రాపిడ్‌ ఐ) ఉండే నిద్ర. రెండవ భాగం కనుగుడ్లు వేగంగా కదు లుతుండే (రాపిడ్‌ ఐ) నిద్ర. కనుగుడ్లు కదలకుండా ఉండే నిద్ర నుంచి కనుగుడ్లు కదిలే నిద్ర రెండూ రాత్రంతా ఒక సైకిల్‌లా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే నిద్రపట్టిన వెంటనే వచ్చే స్థితిలో కనుగుడ్ల కదలిక ఉండదు. ఇది దీర్ఘ నిద్రను సూచిస్తుంది. ఆ తరువాత వచ్చే నిద్రావస్థలో మాత్రం కనుగుడ్లు కదులుతూ ఉంటాయి. ఇది మెలకువ స్థితిలో ఉండే నిద్ర. మంచి నిద్రపట్టడం అంటే ఈ లయబద్ధమైన నిద్రావస్థకి భంగం వాటిల్లలేదని అర్థం. అలాకాకుండా మెలకువకోసం పెట్టుకున్న అలారం మోగిన వెంటనే లేవకుండా తిరిగి నిద్రపోవడం శారీరక మానసిక సహజక్రియని అడ్డుకుంటున్నట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement