నిశ్శబ్దానికి కాలం చెల్లింది

A donation of a million pounds to the TimesApp movement - Sakshi

టైమ్స్‌అప్‌

‘మీటూ’ లాంటిదే ‘టైమ్స్‌అప్‌’ ఉద్యమం. ఇప్పుడది బ్రిటన్‌కూ విస్తరించింది. బ్రిటన్‌ నటి ఎమ్మా వాట్సన్‌ ఆ ఉద్యమానికి పది లక్షల పౌండ్లు (సుమారు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు) విరాళం ఇచ్చారు! మీటూ ఉద్యమకారులు తమ గళాన్ని వినిపించడానికి గత జనవరిలో యు.ఎస్‌లో జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వేడుకల్ని వేదికగా చేసుకున్నట్లే.. ఈ ఆదివారం లండన్‌లో జరిగిన బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌ (బాఫ్తా) ఉత్సవాలను ‘టైమ్స్‌అప్‌’ ఉద్యమకారులు తగిన సందర్భంగా తీసుకుని ప్రపంచ మహిళలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇది. 

డియర్‌ సిస్టర్స్‌
‘టైమ్స్‌అప్‌’ ఉద్యమం మొదలై నెల మీద కొద్ది రోజులే అయింది. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో వచ్చిన అప్పటి బహిరంగ లేఖను మీరు చదివే ఉంటారు. అవార్డు వేడుకలలో రెడ్‌ కార్పెట్‌ మీద మహిళలు నిరసనగా నలుపురంగు దుస్తులు ధరించి నడవడమూ గమనించే ఉంటారు. వేధింపులకు గురైన మహిళలు ముందుకొచ్చి చెప్పుకున్న అనుభవాలనూ వినే ఉంటారు. బహుశా అలాంటి అనుభవాలూ మీకూ ఉండివుండొచ్చు. 

ప్రపంచమంతటా మహిళలు ఏకమౌతున్నారు. ప్రతిఘటిస్తున్నారు. బయటికివచ్చి మాట్లాడుతున్నారు. లాటిన్‌ అమెరికాలో ‘నినూకమాస్‌’, కరీబియ లో ‘లైఫ్‌ ఇన్‌ లెగ్గింగ్స్‌’, ఫ్రాన్స్‌లో ‘బ్యాలెన్స్‌ టాన్‌ పార్క్‌’, యు.కె.లో ‘ఎవ్రీడే సెక్సిజం’.. ఉద్యమాలు, ఉద్యమ హ్యాష్‌టాగ్‌లు మొదలయ్యాయి! ‘మీటూ’ను మీరు చూసే ఉంటారు. ‘మీటూ’ అని కూడా అని ఉంటారు.గత శరదృతువులో.. హాలీవుడ్‌ పరిశ్రమలోని లైంగిక వేధింపులు, లైంగిక వివక్ష, లైంగిక హింసలపై పత్రికల్లో వార్తాకథనాలు వచ్చినప్పుడు ఏడు లక్షల మంది మహిళా రైతు కూలీలు సంఘీభావంగా మాకు రాశారు.. ‘మీకు మేమున్నాం’అని! మా ఆవేదనను, ప్రపంచాన్ని మార్చవచ్చన్న మా నమ్మకాన్ని అర్థం చేసుకుని మాతో భుజం భుజం కలిపి నడిచేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్న భావన ఆ ఉత్తరాలలో కనిపించింది. సకల రంగాలలోని మహిళా బాధితులు, మహిళా కార్యకర్తల వల్ల ‘టైమ్స్‌అప్‌’ ఉద్యమం ఊపిరిదాల్చింది. ఇది మన ఒక్కరి పరిశ్రమలోనే మార్పు తేచ్చేంత చిన్నది కాదు. ఇంకా పెద్దది.  అన్ని రంగాలలోని వేధింపుల బాధితులు చేరుకుంటున్న కూడలి ఈ ‘టైమ్స్‌అప్‌’.

ఇక్కడ ఇంగ్లండ్‌లో ఈ ఉద్యమం కీలకమైన తరుణంలో ఉంది. ఉద్యోగినుల వేతనాలలో వ్యత్యాసం ఆరేళ్ల క్రితంనాటితో పోలిస్తే  ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. యు.కె.లో ఉద్యోగం చేస్తున్న మహిళల్లో సగం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగ భద్రతలేని  తాత్కాలిక విధుల్లోని మహిళలు అన్ని రకాల లైంగిక దోపిడీలకూ అనువైన çపరిసరాల్లో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ సమాజాన్ని స్థాపించడానికి మన బాధ్యత ఏమిటి? పెద్ద బాధ్యతే. ఉద్యమ బాధ్యత. వెలుగులో ఉన్నా, ఆ వెలుగుల నీడల్లో ఉన్నా, మనం అంతా కూడా కార్మికులం. మనది ఒకటే స్వరం. మనం కలిసి, మిగతావాళ్లను కలుపుకుందాం. మొన్నటి వరకు మనం ఉన్న ప్రపంచంలో లైంగిక వేధింపు అన్నది తేలికపాటి విషయం. ఇప్పుడీ 2018లో అలాక్కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఏకాకితనం సమూహం అవుతుంది. నిశ్శబ్దం స్వరం అవుతుంది. లోలోపల మనల్ని సమాధానపరచుకోవడం.. పైపైకి పెల్లుబికే ప్రశ్న అవుతుంది. ఇది మీ ఉద్యమం కూడా. లైంగిక వేధింపులకు, లైంగిక అకృత్యాలకు కాలం చెల్లింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top