లోకం వద్దనుకున్నవాళ్ళే దేవునికి కావాలి!

devotional information by prabhu kiran

పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాన్ని యేసు తన శిష్యుల ఎంపిక ద్వారా ఆవిష్కరించాడు. వారి ఎంపికకు ముందు ఒక కొండపైకి వెళ్లి ఒక రాత్రంతా ప్రార్థించాడు. తరువాత 12 మందిని తన శిష్యులుగా ఏర్పర్చి వారికి ‘అపొస్తలులు’ అంటే ‘పంపబడినవారు’ అనే పేరు పెట్టారు. ఆయన పరిచర్య చేసేది ఈ లోకంలో మూడున్నరేళ్ళు. తన మరణం, పునరుత్థానం, పరలోకారోహణం తరువాత తన రెండవ రాకడ సమయం దాకా క్షమాసువార్తను, దేవుని ప్రేమతత్త్వాన్ని లోకమంతా చాటించే మహాకార్యం కోసం దేవుడు ఈ పన్నెండుమందినీ ఏర్పర్చారు.

మూడున్నరేళ్లపాటు తనతోనే వారిని పెట్టుకొని అద్భుతమైన తర్ఫీదునిచ్చాడు. కాని ఆ మూడేళ్లలో వారి పోకడలు చూసిన వారికి వాళ్ళసలు యేసు శిష్యులయ్యేందుకు అర్హులేనా? అన్న అనుమానం రాకమానదు. రాత్రంతా ప్రార్థనలో గడిపిన యేసు ఇలాంటి వారినా ఎన్నుకున్నది? అని అంతా ముక్కున వేలేసుకున్నారు (లూకా 6:12–19). వారిలో ఒకరైన యూదా ఇస్కరియోతు అయితే ఏకంగా యేసుకు ద్రోహమే చేశాడు.

ఇదొక ఊహాత్మక సన్నివేశం! ఈనాటి ఒక గొప్ప కంపెనీకి ఆ 12 మంది బయోడేటా, ప్రొఫైల్‌ పంపారట! కంపెనీ ఉన్నతాధికారి ఇచ్చిన విశ్లేషణ ఇది ‘మీ 12 మంది శిష్యుల వివరాలు విశ్లేషించాము. వారిలో చాలామందికి తగిన విద్య లేదు, వృత్తిపరమైన అవగాహన లేదు, వారి కుటుంబాలు కూడా గొప్పవి కాదు. పేతురు దుడుకువాడు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. అతని సోదరుడు ఆంద్రెయకు అసలు నాయకత్వపు లక్షణాలేలేవు.

జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను పూర్తిగా స్వార్థపరులు. వారికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ప్రతీదీ అనుమానించే తోమా మీ బృందంలో కొనసాగితే అందర్నీ చెడగొడ్తాడు. ఎందుకంటే అనుమానానికి అక్కాచెల్లెళ్లు బంధువుల బోలెడుమంది ఉంటారు. పన్నులు వసూలు చేసే గొప్ప ఆదాయ వనరులున్న వృత్తి కన్నా మీరు అప్పగించి ఆత్మల సంపాదన వృత్తి గొప్పదని భావించి మీతో చేరిన మత్తయికి సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తాలేదు. యాకోబు కుమారుడైన యూదా, సీమోను తదితర శిష్యులంతా తీవ్రవాద స్వభావం కలిగినవారు.

ఆ పన్నెండు మందిలో ఒక్క యూదా ఇస్కరియోతు అనే ఆ వ్యక్తికి మాత్రమే పట్టుదల, ముందుచూపు, వ్యూహారచనా సామర్థ్యం ఉంది. అతనొక్కడే మీరిచ్చే ఉద్యోగానికి అర్హుడు’ అన్నది విశ్లేషణ. కాని దేవుడు మనుషుల్లాగా ఆలోచించడు. పనికిరాని వారని లోకం ముద్రవేసినా వారే భూ దిగంతాలకు సువార్త తీసుకువెళ్ళి ఈనాటి క్రైస్తవానికి బీజం వేశారు. లోకం మిమ్మల్ని విసర్జించి ఆడిపోసుకొంటోందా? దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయన దృష్టిలో అంతా అర్హులే! అంతా ఆశీర్వాదాలకు పాత్రులే, ఆశీర్వాదాల పంపకానికి పాత్రులే!

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top