
రేప్ విక్టిమ్స్... అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవచ్చు
డాలీ అందమైన 18 సంవత్సరాల అమ్మాయి. పేరుకు తగ్గట్టుగా బొమ్మలా ఉంటుంది.
కేస్ స్టడీ
డాలీ అందమైన 18 సంవత్సరాల అమ్మాయి. పేరుకు తగ్గట్టుగా బొమ్మలా ఉంటుంది. పుట్టింది తండాలో అయినా పట్టుదలతో చదివి టెన్‌తక్లాస్ 98 శాతం మార్కులతో పాసైంది. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్ రెండోసంవత్సరం చదువుతోంది. ఓ రోజున హాష్టల్ ప్రాంగణంలో రాత్రివేళ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే, కొందరు దుర్మార్గులు గోడదూకి, ఆవరణలోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశారు. మర్నాడు జరిగిన విషయం తెలిసి మీడియావాళ్లు వచ్చి హడావుడి చేశారు. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, నిందితులను గుర్తించి రిమాండ్ విధించారు. తీవ్రగాయాలైన డాలీని వైద్యచికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో చేర్పించారు. ఆమె డిప్రెషన్‌లో ఉన్నందువల్ల మానసిక స్వాంతన కోసం కౌన్సెలింగ్ ఇప్పించారు. ఎట్టకేలకు డాలీ కోలుకొని పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసైంది. ఈ దుస్సంఘటన జరిగి మూడు నెలలైంది. ఇప్పుడామె ఇంజినీరింగ్ స్టూడెంట్. ఒంట్లో నలతగా ఉంటే, హాస్పిటల్‌కు వెళ్లింది డాలీ.
డాక్టర్‌గారు ఆమెకు మూడోనెల గర్భమని చెప్పగానే దిగ్భ్రాంతి, అయోమయం, భయం. విషయం అమ్మానాన్నలకు చెప్పి భోరుమంది డాలీ. వెంటనే అందరూ కలిసి దగ్గరలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్లి ఆఫీసర్‌ని కలిశారు. విషయం విన్న ఆమె చలించిపోయారు. అలాంటి అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవాలని సలహా ఇచ్చారు. డాలీ రేప్ విక్టిమ్ అని అందరికీ తెలుసు. మరి తను అబార్షన్ చేయించు కోవచ్చా లేదా? పైగా మూడు నెలల గర్భం. ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని డాలీ తలిదండ్రులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. వెంటనే న్యాయవాదిని పిలిపించారు ఆఫీసర్‌గారు. అత్యాచార బాధితురాలు గర్భం ధరించినప్పుడు అది అవాంఛిత గర్భం కనుక గర్భస్రావం చేయించుకోవడం చట్టబద్ధమే నన్నారు లాయర్. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్నీ యాక్ట్ 1971 లోని సెక్షన్ 3 ప్రకారం అత్యాచార బాధితురాలు గర్భస్రావం చేయించుకోవచ్చనీ, ఈ చట్టం ప్రకారం 12 వారాలనుండి 20 వారాలు దాటని గర్భాన్ని తొలగించుకోవచ్చని న్యాయవాది తెలిపారు. ఆఫీసర్‌గారు వెంటనే డాలీ కేసును ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు.