కీమోలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువట కదా..! | Cancer Counseling | Sakshi
Sakshi News home page

కీమోలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువట కదా..!

Jul 28 2015 11:41 PM | Updated on May 25 2018 2:29 PM

మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు...

క్యాన్సర్ కౌన్సెలింగ్
నా వయసు 33. ఇటీవలే క్యాన్సర్ వచ్చింది. కీమో ఇవ్వాలని అంటున్నారు. కీమోలో సైడ్‌ఎఫెక్ట్స్ ఎక్కువ అంటారు కదా! నాకు ఆందోళనగా ఉంది. కాస్త వివరంగా చెప్పండి.
- భానుప్రసాద్, కర్నూలు

 
మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. శరీరంలోని కొన్ని ప్రాంతాలలో తిష్ఠవేసిన క్యాన్సర్ కణజాలాన్ని అవి సర్జరీకి లేదా రేడియేషన్‌కు అనువుగా ఉన్న ప్రాంతాలలోనే సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా తొలగించగలుగుతాం లేదా నాశనం చేయగలం. కానీ కీమో ద్వారా శరీరంలోని ఎలాంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కీమోథెరపీలో 100 పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి ఒకే మందును సైతం వాడవచ్చు. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక  క్రమపద్ధతిని అనుసరించి అందించే విధానాన్ని కాంబినేషన్ కీమోథెరపీ అంటారు.

పలురకాల మందులు, వాటి సంయుక్త ప్రభావాలన్నీ ఉమ్మడిగా క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని సమూలంగా సంహరించగలుగుతాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు ఆ మందుకు లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కాంబినేషన్ కీమోథెరపీని వినియోగిస్తారు. మీ విషయంలో మీకు ఏ మందులు లేదా కాంబినేషన్ మందులు వాడాలన్నది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే కీమోథెరపీలో భాగంగా మందులను ఎంత మోతాదులో, ఎంతకాలం ఇవ్వాలన్నది మీరు ఏ రకమైన క్యాన్సర్ కణితితో బాధపడుతున్నారు, అది శరీరంలోని ఏ భాగంలో... ఎంత పెద్దగా ఉంది, అది మీ శరీర కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తోంది అన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కీమోథెరపీలో ఇచ్చే మందులను బట్టి మీ శరీరంలో అనేక విధాలుగా అతివేగంగా విస్తరించే క్యాన్సర్ కణాల విధ్వంసం జరుగుతుంది. ఇక మీరు చెప్పే సైడ్‌ఎఫెక్ట్స్ విషయానికి వస్తే... కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని క్యాన్సర్ లేని సాధారణ కణజాలం సైతం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కీమో వల్ల పేషెంట్ కొంత అసౌకర్యానికి, ఇబ్బందికి గురవుతుంటారు. ఈ సైడ్‌ఎఫెక్ట్స్ వల్ల ముందు నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి మోతాదులో మందు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందువల్ల చికిత్స ప్రణాళికను  మార్చాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు చికిత్స ద్వారా ఆశించే ఫలితాలను పూర్తిగా రాబట్టడం కష్టం కావచ్చు.
 
కీమో వల్ల ఎదురయ్యే ఇబ్బందులలో వాంతులు, వికారం, అలసట, జుట్టు రాలిపోవడం (ఇది తాత్కాలికం)  వంటివి కలగవచ్చు. ఇక రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం మాత్రం కాస్త తీవ్రమైన పరిణామం. అయినా ఇటీవల సైడ్‌ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే కీమోథెరపీ మందుల రూపకల్పన కూడా జరుగుతోంది. మీ డాక్టర్ సూచించిన చికిత్సను చేయించుకోండి.
 
డాక్టర్ జి. వంశీకృష్ణారెడ్డి
మెడికల్ ఆంకాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్,
మలక్‌పేట, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement