నిజమైన దుఃఖం ఎప్పుడు వస్తుంది?

Bill Clegg  Novel Did You Ever Have A Family - Sakshi

కొత్త బంగారం

అమెరికా–కనెటికట్‌లోని ఓ చిన్న ఊరు. ధనవంతురాలైన జూన్‌ కూతురి లోలీ పెళ్ళి నాటి ఉదయం. పువ్వులు అలంకరిస్తారు. కేక్‌ తయారవుతుంది. జూన్‌ జీవితాన్ని తలకిందులు చేస్తూ ఇంట్లో స్టవ్‌ పేలుతుంది. ఆరుబయట పడుకున్న ఆమె తప్ప– కూతురు లోలీ, కాబోయే అల్లుడు, మాజీ భర్త ఆడమ్, బాయ్‌ఫ్రెండైన లూక్‌ ఆ పేలుడులో చనిపోతారు. మర్నాడు పెళ్ళికి బదులుగా అంతిమ సంస్కారాల ఏర్పాట్లవుతాయి.

‘వారు చనిపోయినప్పుడే కాదు, అంత్యక్రియలప్పుడు కూడా జూన్‌ ఏడవలేదు’ అని ఊరి ప్రజలు గుసగుసలాడుకుంటారు. జూన్‌ను ఆవహించిన మౌనానికి భిన్నంగా, అగ్ని ప్రమాదం గురించిన పుకార్లు మొదలవుతాయి. ఈ ఆకస్మికమైన విషాదం తరువాత, జీవితాలు పూర్తిగా మారిన ప్రధాన పాత్రల దృష్టికోణాలు పాఠకులకు పరిచయం అవుతాయి. గతంలో తనతో స్నేహం చెడిన లూక్‌ తల్లైన లిడియా తన ఇంటికి వచ్చినప్పుడు జూన్, ‘వేడి సెగను తప్పించుకుంటున్నట్టు, తన ముఖం తిప్పేసుకుంటుంది. ఏ జంతువునో, ముష్టివాడినో విదిలించినట్టుగా చేయి జాడిస్తుంది.’

‘ఈ పొద్దే వెళ్ళిపోవాలని జూన్‌ అనుకోదు కానీ స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక, అదే సమయమని ఆమెకి తోస్తుంది.’ ఎంతోకాలం తరువాత కూతురితో సఖ్యత పెంచుకున్న జూన్‌ తన కారులో, అమెరికా తిరుగుతుంది. లోలీ తనకి రాసిన పోస్ట్‌ కార్డులో పేర్కొన్న వాషింగ్‌టన్‌ మోటెల్‌లో ఉండి– కూతురి పట్లా, లూక్‌ పట్లా తను చేసిన తప్పులని తలచుకుంటుంది. లోలీ వెళ్ళిన అవే నేషనల్‌ పార్కులకీ, పెట్రోల్‌ స్టేషన్లకీ వెళ్తుంది.

ఊర్లో వెలివేయబడిన లిడియా కూడా, అప్పటికే కొడుకుతో గతంలో తనకుండే దూరాన్ని తగ్గించుకునుంటుంది. ఊరివారి దెప్పులని ఎదుర్కుంటూ, గడిచిపోయిన తన విషాదకరమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది.

ఫ్లోరిస్ట్‌ అయిన ఎడిత్, పెళ్ళి ఏర్పాట్లకు డబ్బు అందలేదని సూటిపోటి మాటలన్నప్పటికీ, జూన్‌ డబ్బు మాత్రం తీసుకోదు. కేకును అగ్నిమాపక దళానికి ఇస్తుంది. పూలు ఊరివారికోసం ఉపయోగిస్తుంది.

అలాగే, మరణించకుండా మిగిలున్న వారందరూ ‘బతికున్నప్పటికీ, ఛిద్రమైపోయినవారే’ అంటారు రచయిత బిల్‌ క్లెగ్‌.

ఆ ప్రయాణంలో ఒకరోజు, జూన్‌ కారు అదుపు తప్పినప్పుడు– సహాయపడిన పరాయి వ్యక్తి, డిక్కీలో ఉండిపోయిన లోలీ సామాను బయటకి తీస్తాడు. అప్పుడు, ‘మొట్టమొదటిసారి ఇంటికి ఎంతో దూరంలో అపరిచితుడి ముందు ఆమె ఏడుస్తుంది.’ మితభాషి అయిన జూన్, తన ఆర్ట్‌ డీలర్‌ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. లిడియా– జూన్‌ ఉన్న చోటు కనుక్కుని, తనతో పాటు ఉండటానికి వస్తుంది. ‘ఆ తరువాత ఇంక ఏ అబద్ధాలూ, రహస్యాలూ ఉండవు’ అంటారు రచయిత.

‘డిడ్‌ యు ఎవర్‌ హావ్‌ అ ఫేమిలీ’ నవల్లో, మానవ స్వభావపు సంక్లిష్టతలను విడదీయడానికి ప్రయత్నిస్తారు క్లెగ్‌. పాత్రల పేర్లే ఉన్న ప్రతి పొట్టి అధ్యాయానికీ కథకులు మారతారు. వారి జ్ఞాపకాలు తప్ప ఎక్కువ చర్యలు కానీ డైలాగులు కానీ లేని పుస్తకం– అధికశాతం జూన్, లిడియా దృష్టికోణాలతో ఉన్నది. నవలంతటా ప్రధానంగా కనిపించే మనోద్వేగం– దుఃఖం. ‘జీవితం కఠోరమైనదైనప్పటికీ, మనం చేయగలిగేదల్లా మన పాత్రలను మనం పోషించి, ఒకరితో మరొకరం కలిసి ఉండటమే’ అన్న మోటెల్‌ వెయిట్రెస్‌ సిస్సీ మాటలు, పుస్తకపు సారాన్ని క్లుప్తీకరిస్తాయి. నవల– ఏలన్‌ షపిరో పద్యం, ‘సాంగ్‌ అండ్‌ డాన్స్‌’లో ఉండే, ‘నీకు కుటుంబం ఉండేదా!’ అన్న మాటలతో ప్రారంభం అవుతుంది.

మ్యాన్‌ బుకర్‌ ప్రైజుకు లాంగ్‌ లిస్ట్‌ అయిన రచయిత యీ తొలి నవలని స్కౌట్‌ ప్రెస్‌ 2015లో ప్రచురించింది.

-కృష్ణ వేణి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top