నేత్రదానం చేయాలనుకుంటున్నా... | Awareness on Eye Donations | Sakshi
Sakshi News home page

నేత్రదానం చేయాలనుకుంటున్నా...

Jul 24 2019 10:54 AM | Updated on Jul 24 2019 10:54 AM

Awareness on Eye Donations - Sakshi

నేను నా మరణానంతరం నేత్రదానం చేయాలనుకుంటున్నాను. ఎవరెవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు, కళ్లను ఎలా తొలగిస్తారు వంటి వివరాలు చెప్పండి. నాకు బీపీ, షుగర్‌ ఉన్నాయి. నేను నేత్రదానం చేయవచ్చా? – ఎమ్‌. పరంధాములు, నకిరేకల్లు

నేత్రదానం చేసిన వ్యక్తి కళ్లను సేకరించి వాటిని మరొకరికి అమర్చడం ద్వారా అంధులకు చూపు తెప్పిస్తారు. ఒక వ్యక్తి తాలూకు రెండు కళ్లను సేకరించడం ద్వారా ఇరువురికి చూపు రప్పించడం సాధ్యమవుతుంది. కాబట్టి ఒకరు నేత్రదానం చేయడం అంటే ఇద్దరికి చూపు ఇవ్వడమన్నమాట.

మన కంటిలో కార్నియా అనే పారదర్శకమైన పొర ఉంటుంది. ఇది బయటి దృశ్యాలను కంటి లోపలికి చేరవేస్తుంది. కార్నియాలో పారదర్శకత లోపించినప్పుడు అది రెటీనాకు సరైన సమాచారాన్ని చేరవేయలేదు. అలా వచ్చే అంధత్వాన్ని కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే... పాడైన కార్నియాను తొలగించి ఆరోగ్యకరమైన కార్నియాను అమర్చాలి. ప్రస్తుతానికి కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్నవారికి మాత్రమే చూపు తెప్పించగలుగుతున్నారు. నేత్రదానం తర్వాత – దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కార్నియాను... అది (కంటి మీద ఉండే పారదర్శకమైన పొర) దెబ్బతినడం వల్ల అంధులైన వారికి అమరుస్తారు. ఈ ప్రక్రియను కార్నియా రీప్లేస్‌మెంట్‌ లేదా కెరటోప్లాస్టీ, కార్నియల్‌ గ్రాఫ్టింగ్‌ అంటారు.

మన సమాజంలో కార్నియా దెబ్బతినడం కారణంగా దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కానీ స్వచ్ఛందంగా నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చేవారి సంఖ్య ఇప్పటికీ ఇంకా తక్కువే. చూపు అవసరమైన వారందరిలో ప్రస్తుతానికి కేవలం పది శాతం మందికి మాత్రమే కార్నియా లభ్యమవుతోంది.

ఇక మరికొంతమందిలో స్కీ›్లరా అనే తెల్లగుడ్డు భాగాన్ని కూడా అమర్చి అంధత్వాన్ని నివారిస్తున్నారు.
ఈ సర్జరీ చేయడానికి నేత్రదాత బ్లడ్‌గ్రూప్‌ – గ్రహీత బ్లడ్‌గ్రూప్‌ ఒకటే కావాల్సిన అవసరం లేదు. అంటే బ్లడ్‌గ్రూపులతో పనే లేదు.

కార్నియా అమర్చడానికి ఎవరెవరు అర్హులు
సూడోపేకిక్‌ బుల్లస్‌ కెరటోపతి ∙కెరటోకోనస్‌ ∙కార్నియాకు గాయాలు (కార్నియల్‌ ఇంజ్యురీస్‌) ∙కార్నియల్‌ డీ జనరేషన్‌ ∙కార్నియల్‌ అల్సర్స్‌ ∙ఎండోథీలియన్‌ డీ–కంపెన్సేషన్‌ ∙పుట్టుకతోనే తెల్లటి కార్నియా ఉండటం (కంజెనిటల్‌ కార్నియల్‌ ఒపాసిటీ) ∙కెమికల్‌ బర్న్స్‌ (అంటే రసాయనాల వల్ల కార్నియా దెబ్బతినడం) వంటి సమస్యలతో చూపు కోల్పోయిన వారికి కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా చూపు తెప్పించవచ్చు.

నేత్రదానం... అపోహలు
నేత్రదానం విషయంలో మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. వాస్తవానికి ఈ అపోహల కారణంగానే చాలామంది నేత్రదానానికి ముందుకు రావడం లేదు. అలాంటి కొన్ని  
అపోహలూ – అసలు వాస్తవాలను చూద్దాం.
కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్న వాళ్ల కళ్లు నేత్రదానానికి పనికిరావన్నది కొందరు అపోహ. వాస్తవానికి కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్నా సరే... వారు కళ్లను దానం చేయవచ్చు ∙ఇక మరీ వృద్ధులైన వారి కళ్లు నేత్ర దానానికి పనికిరావనీ, వయసులో ఉన్న వాళ్ల కళ్లు మాత్రమే పనికివస్తాయని కొందరు అనుకుంటారు. ఇది కూడా అపోహే. ఏడాది వయసు నిండిన పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా సరే నేత్రదానం చేయవచ్చు ∙కొన్ని సినిమాల్లో చూపినట్లుగా తమ ఆప్తుల కోసం... బతికి ఉన్న వాళ్లు కూడా తమ కళ్లు దానం చేయవచ్చని కొందరు అపోహ పడుతుంటారు. నిజానికి చనిపోయినవారి నుంచి మాత్రమే కళ్లను స్వీకరిస్తారు. ఒకవేళ తమ దగ్గరి వారికి ఏదైనా సమస్య వచ్చి వారు చూపు కోల్పోతే... తల్లిదండ్రులు గానీ లేదా దగ్గరి బంధువులు గానీ తీవ్రమైన భావోద్వేగాలతో ముందుకు వచ్చినా వారి కళ్లను  స్వీకరించరు. ∙ఇక మీరు చెప్పినట్లుగా మీకు బీపీ, షుగర్‌ ఉన్నా నేత్రదానం చేయవచ్చు. రక్తపోటు, డయాబెటిస్, ఉబ్బసం (ఆస్తమా), టీబీ వంటి వ్యాధులు ఉన్న వారు కూడా తమ కార్నియా ఆరోగ్యంగా ఉంటే తప్పక నేత్రదానం చేయవచ్చు. అలాగే రిఫ్రాక్టివ్‌ సమస్యల కారణంగా కళ్లజోడు ధరించేవారు కూడా నేత్రదానం చేయడానికి అర్హులే.

ఎవరెవరు నేత్రదానం చేయకూడదంటే...
ఎయిడ్స్, హెపటైటిస్, రుబెల్లా, సిఫిలిస్‌ వంటి అంటువ్యాధులున్న వారు, బ్లడ్‌ క్యాన్సర్, ట్యూమర్లు ఉన్నవారు నేత్రదానానికి అర్హులు కారు. ఈ సమస్యలు ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు చనిపోయిన వ్యక్తి నుంచి కంటితో పాటు,  రక్తనమూనాలు సేకరిస్తారు. వైద్య పరీక్షలో అతడికి అనారోగ్యాలేవీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ల కార్నియాను ఉపయోగిస్తారు. ఇక విషం తీసుకుని మరణించిన వారి కళ్లు కూడా నేత్రదానానికి పనికిరావు.

ఎలా సేకరిస్తారంటే...
మరణానంతరం ఆరు గంటలలోపు కళ్లను సేకరించాలి.
నేత్రదానం చేయదలచినప్పుడు మరణించిన వ్యక్తి కనురెప్పలను మూసి, కళ్ల మీద తడిగుడ్డ లేదా దూదిని లేదా ఐస్‌ ముక్కలను ఉంచాలి.
తల ఎత్తులో ఉండేటట్లు, తల కింద రెండు తలగడలు ఉంచాలి.
మృతదేహం ఉన్న గదిలో ఫ్యాన్‌ వేయకూడదు. దీనివల్ల కార్నియా బాగా పొడిగా మారి చెడిపోయే అవకాశం ఉంది. ఫ్యాన్‌ వేయకూడదుగానీ గది వీలైనంత వరకు చల్లగా (లో–టెంపరేచర్‌తో) ఉండేలా చూడాలి.  
ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానంతో కేవలం కంటి నల్లగుడ్డు మీద ఉండే కార్నియాను మాత్రమే సేకరిస్తున్నారు. కాబట్టి నేత్రదానం చేసినా కంటి ఆకారంలో ఎలాంటి మార్పూ కనిపించదు. ఒకవేళ పాత పద్ధతిలో కంటిని మొత్తంగా తీసేసినా కూడా ఆ స్థానంలో కృత్రిమ కంటిని అమర్చుతారు. ఫలితంగా పార్థివ దేహం మామూలుగా కళ్లు మూసుకుని ఉన్నట్లే కనిపిస్తుంది.
కార్నియాను సేకరించిన తర్వాత దాన్ని ఐ–బ్యాంకులో ఉంచుతారు. ఆ తర్వాత వీలైనంత త్వరగా మరొకరికి అమర్చుతారు.
వీలైనంత త్వరగా కంటిని సేకరించేందుకు వీలుగా
ఐ–బ్యాంక్‌ ప్రతినిధులు, వైద్యనిపుణులు వచ్చేలోపే... మరణించిన వ్యక్తి తాలూకు డెత్‌ సర్టిఫికేట్, మరణానికి కారణాలు తెలిపే (కాజ్‌ ఆఫ్‌ డెత్‌) ధ్రువీకరణ పత్రాలు, మెడికల్‌ రికార్డ్స్‌ కూడా సిద్ధంగా ఉంచడం మంచిది.
మరణించిన వ్యక్తికి వారసులు ఉంటే వారి అనుమతితో మాత్రమే కళ్ల సేకరణ జరుగుతుంది.-డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డికంటి వైద్య నిపుణులు,మెడివిజన్‌ ఐ హాస్పిటల్, హైదరాబాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement