కండ ఉంది... సాయం చేసే గుండె కావాలి | Sakshi
Sakshi News home page

కండ ఉంది... సాయం చేసే గుండె కావాలి

Published Tue, Oct 29 2019 12:31 AM

Asian Bodybuilding Championship 2019 Winner Ravi Kumar Special Story - Sakshi

ప్రతి రోజూ ఏడు గంటల వ్యాయం. రుచీ పచీ లేని ఆహారం. సరదాగా తిరగాల్సిన వయసులో ఏదో సాధించాలనే తపన. మరోవైపు బీదరికంతో పోరాటం. కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంతో ముందుకెళుతూ అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్నాడు ఈ యువ యోధుడు. ఇంటర్మీడియట్‌  చదువుకున్న ఎన్‌.రవి కుమార్‌ (21) తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ సాధించని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరిగిన ఏషియన్‌ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించాడు. నవంబర్‌లో సౌత్‌ కొరియాలో జరగనున్న ప్రపంచ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైన తొలి తెలుగువ్యక్తి రవికుమారే. అయితే పేదరికం మూలన ఆ ప్రపంచ కప్‌ పోటీలకు దూరం అయ్యాడు. ప్రతిభ పుష్కలంగా ఉన్నా ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడమే అతనికి కష్టంగా ఉంది. నెలకు ఆహార ఖర్చులకే దాదాపు రూ.లక్ష అవుతుంది. స్పాన్సర్‌షిప్‌ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కొంత చేయూతనిస్తే  తప్పకుండా ప్రపంచ మెడల్‌ సాధిస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు.  

లారీడ్రైవర్‌ కుమారుడు
రవి కుమార్‌ది  గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామం. తండ్రి వెంకట్రావు లారీడ్రైవర్‌. అమ్మ వెంకట నరసమ్మ గృహిణి. వారిది సాధారణ కుటుంబం. తండ్రి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. అయితే వారు రాత్రింబగళ్లు కష్టం చేసి కుమారుడికి తమ వంతు ప్రోత్సాహం ఇస్తున్నారు.  కొడుకు బంగారు పతకం సాధిస్తే చాలని నాన్న లారీ డ్రైవర్‌గా కష్టపడుతుంటే తల్లి చిల్లర అంగడి పెట్టుకొని వచ్చిన సంపాదనను కుమారునికే ఖర్చుపెడుతోంది. పోటీలకు వెళ్లేందుకు  డబ్బులు లేకపోతే తన బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ పోటీలకు పంపిందామె. ఆ తర్వాత ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ప్రోత్సాహం లభించింది. కండలు పెంచే వ్యాయామం కోసం  రవి కుమార్‌ తీసుకునే పాలు, గుడ్లు, చికెన్, పండ్లు, చేపలు, కూరగాయలు, ప్రోటీన్‌ పౌడర్లు వీటి ఖర్చు చాలా ఎక్కువ. ప్రస్తుతం స్నేహితుల సాయం, పోటీల ద్వారా వచ్చే ప్రైజ్‌మనీతో సాధన నడుస్తోంది.

ఇటీవల సెప్టెంబరు నెలలో ఇండోనేషియా బాటమ్‌లో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్‌ పోటీల్లో పతకం సాధించి, పతకంతోపాటు, భారతదేశ జెండాను ప్రదర్శిస్తూ...

సరదాగా మొదలైన సాధన
రవి కుమార్‌ తన 15వ ఏట స్నేహితులతో సరదాగా వ్యాయామం ప్రారంబించాడు. రోజుకు గంట సేపు చేస్తున్నా సీరియస్‌గా తీసుకుని చేసింది లేదు. 2014లో గుంటూరులో జి.శ్రీనివాసరావు అనే సీనియర్‌ బాడీ బిల్డర్‌ ఏర్పాటు చేసిన పోటీలకు అన్ని జిమ్‌లకూ ఆహ్వానం అందింది. రవి కుమార్‌ కూడా ఆ పోటీల్లో సరదాగా పాల్గొన్నాడు. అప్పుడు రవి దేహాన్ని చూసి కొంత మంది నవ్వారు. అది అతని మనస్సులో నాటుకుపోయింది. అప్పుడు కోచ్‌ జి.శ్రీనివాసరావును కలసి మంచి బాడీ బిల్డర్‌ అవ్వాలంటే ఏం చేయాలని అడగడం, అందుకు ఆయన కొన్ని సూచనలు చేయడంతో రవి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి సాధన గంట నుంచి రెండు, మూడు.. నాలుగు గంటలైంది. ‘మిస్టర్‌ ఆంధ్ర’ టైటిల్‌ సొంతమయ్యింది.  ప్రస్తుతం రవికుమార్‌ 75 కేజీల విభాగంలో ఇండియాలోనే బెస్ట్‌గా కొనసాగుతున్నాడు. 

తల్లి వెంకట నరసమ్మతో చిల్లర కొట్టులో...

ఆహార నియమాలు కఠోరం
బాడీ బిల్డర్స్‌ ఆహార నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. రవి కుమార్‌ తీసుకునే చికెన్, ఫిష్, కూరగాయలలో కనీసం ఉప్పుగాని, మసాలాలుగాని వాడరు. సగం ఉడికినవే తినాలి. అంతే కాదు పోటీలకు 10 రోజుల ముందు నుంచి మంచినీరు తాగడం క్రమేపీ తగ్గించేస్తారు. పోటీలకు మూడు రోజుల ముందునుంచి చుక్క నీరు కూడా తీసుకోరు. అప్పుడే బాడీలో ఉండే మజిల్స్‌ను పోటీల్లో ప్రదర్శించే అవకాశం లబిస్తుంది. ఈ మూడు రోజులు వారు పడే అవస్థలు వర్ణాతీతం. అయినా వాటిని ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. అప్పుడే కదా పతకాలు సాధించేది. 

సాధించిన పతకాలతో...

ప్రపంచ కప్‌ పోటీలకు దూరం
నవంబరు 5 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో జరిగే ప్రపంచ బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఎంపిక అయ్యాడు రవి. కాని పేదరికం అడ్డొచ్చింది. స్పాన్సర్‌లు దొరకకపోవడంతో పోటీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పతకం సంపాదించాలనే తపన ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయాననే బాధ అతనిని పట్టి పీడిస్తోంది. అతను మాత్రం పట్టు వదలకుండా మిస్టర్‌ ఇండియా బాడీ బిల్డింగ్‌ పోటీలకు వెళ్లాలని కఠోర శ్రమ చేస్తూనే ఉన్నాడు. ఈ పోటీలు ఫిబ్రవరి 1–2, 2020 సంవత్సరంలో జరగనున్నాయి.    స్పాన్సర్‌లు, ప్రభుత్వం చేయూతనిస్తే, తెలుగోడి సత్తా చాటి బంగారు పతకం సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ‘నాకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. గతంలో ప్రయత్నించి వదిలేసాను.  వ్యాయామమే జీవితంలా బతుకుతున్నాను. దాని కోసం ఇంట్లో భారంగా ఉన్నా నెట్టుకొస్తున్నాను. ఒక్కొక్కసారి వదిలేద్దామని అనుకున్నా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాను. త్వరలో ముఖ్యమంత్రి జగనన్నను కలుస్తాను. ఆయనకు నా పతకాలన్నీ చూపిస్తాను’ అని ఆశగా చెబుతున్నాడు రవి కుమార్‌. 
– ఒ.వెంకట్రామిరెడ్డి, సాక్షి అమరావతి బ్యూరో

Advertisement
 
Advertisement
 
Advertisement