
శ్రీశ్రీ కొన్ని సందర్భాల్లో చేసిన సరదా వ్యాఖ్యలు, చమత్కారపు జవాబులు ఈ వారం సాహిత్య మరమరాలుగా ఇస్తున్నాం.
శ్రీశ్రీని రేడియో కోసం ఒక నాటకం రాసివ్వమని ఒకాయన తరచూ అడుగుతున్నారు. అయినా శ్రీశ్రీ రాసివ్వడం లేదు. మళ్లీ ఒకరోజు ఆయన పలకరించి, ఇంకా రాయలేదని అంటే– ‘ఏనాటికైనా రాసిస్తాను’ అని శ్లేషగా జవాబిచ్చారు శ్రీశ్రీ.
ఏమీ తోచక ఓసారి రైల్వేస్టేషన్‌కు వెళ్లారు శ్రీశ్రీ. అక్కడో మిత్రుడు ‘ఊరికా?’ అని పలకరించాడు.
‘ఊరికే’ అని సమాధానమిచ్చారు శ్రీశ్రీ.
శ్రీశ్రీ దగ్గర ఆ సమయంలో డబ్బుల్లేవు, చెప్పులు పాతబడిపోయినై. ఓ రోజు పాండీబజార్‌లో ఉత్తికాళ్లతోనే నడుస్తూ ఒకతనికి కనబడ్డారు. ‘ఏం గురువు గారూ, చెప్పుల్లేకుండా తిరుగుతున్నారు?’ అన్నాడతను. అతడితో అసలు విషయం చెప్పలేరు. అందుకని– ‘చెప్పుకొనలేక’ అని బదులిచ్చారు.
ఒక పెద్దాయన తమ లైబ్రరీని చూడమని శ్రీశ్రీని ఆహ్వానించారు. సందర్శన అనంతరం విజిటర్స్ బుక్‌లో ఏదైనా రాయమని కోరారు. ‘ఈ లైబ్రరీని దినదినాభివృద్ధి కోరను’ అని రాయడం ఆపారు శ్రీశ్రీ. అప్పటికే నిర్వాహకుడి ముఖం మాడిపోయింది. ‘క్షణక్షణాభివృద్ధి కోరతాను’ అని ముగించారు.
(మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.)