చేయవలసినవి చాలా ఉన్నాయి | Sakshi
Sakshi News home page

చేయవలసినవి చాలా ఉన్నాయి

Published Mon, Mar 25 2019 1:39 AM

Anasuyadevi Died Sunday in Houston USA - Sakshi

ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో ఆదివారం కన్ను మూశారు. జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయాదేవి ప్రావీణ్యం సాటిలేనిది. అనసూయ 1920 మే 12న కాకినాడలో జన్మించారు. ఆమెకు ఐదుగురు సంతానం. కవి స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు కూడా అయిన అనసూయ ఇటీవల చెన్నై వచ్చినప్పుడు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని విశేషాలివి.

తొమ్మిదవ ఏటనే జానపదాలకు, భావగీతాలకు బాణీలు కట్టి ప్రాణప్రతిష్ట చేసిన అపర బ్రహ్మ అనసూయ. మేనమామ కృష్ణశాస్త్రి రచించిన ‘ప్రాభాత ప్రాంగణాన’ గీతాన్ని ఒకే రోజు ఆరు వేదికల్లో ప్రత్యక్షంగా పాడిన దివ్యగాయని. గాంధీజీ సమక్షంలోనూ అనసూయ గీతాలాపన చేశారు. తొమ్మిది దశాబ్దాలు పూర్తయినా కూడా కూడా పసిపిల్లలకు ఉండే ఉత్సాహం పోగొట్టుకోని చిన్ని శిశువు. ఆమె జీవనరాగంలోని సరిగమల్ని ఆమె చెప్పిన క్రమంలోనే వినడం శ్రావ్యంగా ఉంటుంది. 

ఆ రోజు నా డ్రస్సూ హిట్టయింది!
‘‘మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మామయ్య రాసిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ అనే దేశభక్తి గేయాన్ని 1947 ఆగస్టు 15 న పొద్దున్నే ఆరుగంటలకి మద్రాసు రేడియోలో లైవ్‌లో పాడాను. తరవాత తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పాడాను. 10 గం.లకి వై.యమ్‌.సి.ఏ.లో పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్రమహిళాసభలోను, ఆరు గంటలకి ఆంధ్రమహాసభలోను, రాత్రి 8 గం.లకి రేడియో వారు రూపకల్పన చేసిన ‘స్వాతంత్య్ర రథం’ కార్యక్రమంలోను ఒకే రోజున అన్నీ లైÐŒ గా పాడాను. ఆ రోజే మరో చిత్రమైన సంఘటన. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్‌ క్రియేట్‌ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి, ఎరుపు, ఆకుపచ్చ రంగుల శాటిన్‌ రిబ్బన్లు కొనుక్కుని వచ్చి వాటిని పొడవుగా కట్‌చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్‌కి కూడా బోర్డర్‌ వేసుకున్నాను. టైలర్‌ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్‌ కూడా హిట్‌ అయ్యింది.

‘అయ్యో కుయ్యోడో’ నా ఫస్ట్‌ సాంగ్‌
చిన్నప్పుడే నేను నా చెల్లి సీత కలిసి పాడటం మొదలుపెట్టాం. సుమారు 23 ఏళ్లు కలిసి పాడాము. నేను జానపదాల మీద రీసెర్చి చేద్దామనుకున్నాను. నా సంగీత గురువు మునిగంటి వెంకట్రావుపంతులుగారు. ఆయన నాకు క్షేత్రయ్య పదాలు నేర్పారు. ఆ పదాల మీద రీసెర్చి చేద్దామనుకున్నాను. నాకు ఫోక్‌ ఇష్టం. అప్పటికే చాలా జానపదాలు రాశాను. పాడాను. అలా సుమారు 30 ఏళ్లు పాడాక రేడియోలో జానపదాలు మొదలుపెట్టాక నాకు అవకాశం వచ్చింది. నేను పాడిన మొదటి పాట ‘అయ్యోకుయ్యోడో’. హిట్‌ అయింది. కృష్ణశాస్త్రిగారు పాటలు రాసేవారు, నేను బాణీలు కట్టేదానిని. అలా ఎన్నో భావగీతాలు పాడాను. నేను కట్టిన బాణీలన్నీ కర్ణాటక సంగీతం ఆధారంగానే. నాకు నేర్పిందీ, నన్ను తీర్చిందీ కర్ణాటక సంగీతమే. తొమ్మిదవ ఏటనే రెండు మూడు వందల పాటలకి రాగాలు కట్టాను. అందరికీ తెలిసిన ‘మొక్కజొన్నతోటలో’ నేనే రాగం కట్టి పాడాను. 1931లో రాజమండ్రి నాళం వారి సభలో, కాకినాడ సభలో జానపదాలను పాడాను. అలాగే  రేడియోలోను ఈ జాన పదాలు ప్రసిద్ధి చెందేలా కృషి చేశాను. 

‘చెత్తపాట పాడిస్తున్నారు’ అన్నారు!
జానపద గీతాలన్నీ జానపదులు పాడినట్లే పాడగలను. త్యాగరాజు ఎలా పాడాడో తెలీదు. నగుమోములాంటివి బాలమురళి బాగా పాడాడు. జానపదాలను బాగా పాడి, బాగుందనిపించి, సభల్లో ప్రవేశపెట్టాను. అప్పుడు ఎన్నో కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. క్షేత్రయ్య పదాలలాగ ‘కోటిరత్సపు ముద్దు కోమలాంగి’ అనే గీతాన్ని పాడాను. ఆ పాటని ముందుగా అమ్మకి వినిపించి, ఆవిడ బావుందని అన్నాకే బయట పాడాను. అమ్మ అనుమతి ఇచ్చాక, నాకు బలం వచ్చింది.  ఆ పాట విన్నాక ఒక కవయిత్రి నాళం వారి సభలో పాడుతుంటే ఆక్షేపించారు. అమ్మ వెంకటరత్నమ్మతో ‘‘కవి కుటుంబంలో పుట్టిన మీరు మీ అమ్మాయి చేత చెత్త పాట పాడిస్తున్నారు’’ అని అన్నారు.

ఆ మాటకు అమ్మ నన్ను సమర్థిస్తూ సమాధానం ఇచ్చారు. ఎప్పుడయితే అమ్మ నన్ను బలపరిచిందో అప్పటి నుంచి వెనుదిరగలేదు. ఎనభై ఏళ్లుగా పాడుతూనే ఉన్నాను. నన్ను ప్రోత్సహించింది రజనీకాంతరావుగారు. దేశదేశాల్లో జానపదాలు ప్రచారం చేసింది మాత్రం నేనే. కచేరీలకు సిలోన్, లండన్, పారిస్‌ దేశాలకు వెళ్లాను. పారిస్‌లో నాకు ‘క్వీన్‌ ఆఫ్‌ ఫోక్‌’ మ్యూజిక్‌ అని బిరుదు ఇచ్చారు. 1977లో అమెరికాలో మొట్టమొదటి తానా సభలో పాడాను. అక్కడే 23 కచేరీలు చేశాను. ఆ కచేరీలను 22 శృతులతో పోల్చి, ‘అమెరికాలో నా సంగీత యాత్ర’ అని పుస్తకం రాశాను.  

రేడియోలో రూ. 250 జీతం
చిన్నప్పటి నుంచి కొత్త పాటలు పాడటం సరదా. ఒక కాంపిటిషన్‌లో నేను వేరేదో పాడుతుంటే, నన్ను పిలిచి ‘నీకు త్యాగరాజ కీర్తనలు రావా’ అని అడగగానే ‘నిధి చాల సుఖమా’ పాడాను. అది విన్న వారు పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు. మద్రాసు పంపిస్తే సినిమాలో పాడిస్తాం అన్నారు. ఆడపిల్లను ఒక్కతినే పంపడం ఇష్టం లేదని నాన్నవాళ్లు అనడంతో మా కుటుంబం అంతా రావడానికి ఏర్పాటు చేశారు. అప్పుడు నా చేత ‘కిట్టమ్మా గోపాలబాలా కిట్టమ్మా’ పాడించారు. నేను కచేరీ ఇచ్చేటప్పుడు ముందుగా క్లాసికల్, భావగీతాలు, తరవాత చివరలో ఒక జానపద గీతం పాడేదానిని. నాకున్న ఇంటరెస్ట్‌ కారణంగా జానపదాలు పాడాను. రేడియో పని మీద నా చెల్లి సీత వెడుతున్నప్పుడు నేను కూడా సీతతో వెళ్లి చాలా సేకరించాను. అన్నీ సేకరించాక వాటి మీద పరిశోధన చేద్దామనుకున్నాను. అయతే నా రీసెర్చి కొన్ని కారణాల వల్ల కుదరలేదు.

నా పాటల స్వరాలన్నీ నేను బుక్‌గా రాసిపెట్టుకున్నాను. సంగీత నాటక అకాడమీ వాళ్లు దానిని పబ్లిష్‌ చేశారు. పునర్ముద్రణ కూడా చేశారు. 1938లో ఆలిండియా రేడియో ప్రారంభోత్సవం నాడు ‘రారమ్మ రారమ్మ’ అని, ముగింపులో ‘పోయినది దానిమ్మ’ అని నా చేత పాడించారు. 1939లో ‘ఊర్వశి’లో పాటలు ప్లే బ్యాక్‌ లేకపోయినా కూడా నేను పాడాను. అదొక క్రెడిట్‌. అది రేడియో వారిదే. ఉత్తర రామచరితంలో లక్ష్మణమూర్ఛలో పద్యాలు చదువుతుంటే ఎస్‌.ఎన్‌.మూర్తికి నాకు ఉద్యోగం ఇస్తానన్నారు. 250 రూ.ల జీతం అన్నారు. 1940 లో చేరాను. రేడియోలో ఊర్వశి, విద్యాపతి, శ్రీకృష్ణుడు, నవరసాలు, గోదాదేవి, దక్షయజ్ఞం మొదలయిన దేవులపల్లివారి నాటకాలు వేశాం. ఓ పక్కన నవ్యసాహిత్య పరిషత్‌లో కచ్చేరీలు చేసేవాళ్లం. వెన్నెల్లో బ్రహ్మసమాజంలో పాడేవాళ్లం. ఆ తర్వాత ఉద్యోగంలోంచి మామమ్య, నాన్న నన్ను వెనక్కి తీసుకువెళ్లిపోయారు.

1943లో బి.ఏ. చేశాను. పి.సుబ్రహ్మణ్యం గారు నా పాట విని ‘నర్తన మురళి’లో పాడడానికి  నన్ను మద్రాసు తీసుకెళ్లారు. 1945లో వివాహం జరిగింది. అనసూయ పెళ్లి కబుర్లు అని అందరికీ మామయ్య చెప్పేవారు. ‘మధూదయంలో’ అనే పాట నా మీదే రాశారు.కొన్నాళ్లు స్టెల్లామేరీస్‌లో మ్యూజిక్‌ లెక్చరర్‌గా చేశారు. కళాక్షేత్రంలో ఆఫర్‌ వచ్చింది వదిలేశాను. అన్నమయ్య పాటలను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు బయటకి తీసుకొచ్చినప్పుడు ఆ పాటలకు నన్ను ట్యూన్‌ చేసి పాడమన్నారు. అందుకోసం తాళ్లపాక రమ్మన్నారు. ఆ టైమ్‌లో మా వారికి చెయ్యి విరిగింది. మా అమ్మాయికి బాగా జ్వరంగా ఉంది. వెళ్లలేకపోయాను. బదులుగా మల్లిక్‌ వెళ్లారు.

పాడగలిగినా ప్లే బ్యాక్‌కి వెళ్లలేదు. ట్యూన్‌ చేయగలిగినా చేయలేదు. యాక్ట్‌ చేయగలిగినా చేయలేదు. అయిన వాటి గురించి బాధపడి లాభంలేదు. చేయవలసినవి చాలా ఉన్నాయి. తొందరపడుతున్నాను చేయడానికి. దక్షిణభారతంలో నేనే మొట్టమొదటి సంగీతదర్శకురాలిని. హార్మనీపట్టుకుని వాయిస్తూ పాడతాను. స్త్రీల పాటలు పాడితే, సెంట్రల్‌ గవర్నమెంటు వారు ఫెలోషిప్‌ ఇచ్చారు. పెళ్లిపాటలు, సరదా పాటలు, మేలుకొలుపులు, లాలిపాటలు, గొబ్బిపాటలు, కోలాటం, మంగళహారతులు పండుగలు, పూజలు అన్నిటినీ మ్యూజిక్‌ నొటేషన్‌తో చేశాను. సంగీతం గొప్ప గనిలాంటిది. ఎంత తవ్వితే అంత వస్తుంది. అలాగే కలెక్ట్‌ చేశాను. ఎక్కడ వింటే అక్కడ పట్టేసేదాన్ని.  
ఫోటోలు: వి. శ్రీనివాసులు, చెన్నై

వీలునామాలో ‘అంతిమ యాత్ర’
ఘనతగా చెప్పడం కాదు కానీ పల్లెల్లో ఉండే ఈ జానపదాలను బాణీలు కట్టి జన బాహుళ్యంలోకి తెచ్చిన తొలి ప్రయత్నం నాదే.  ఆలిండియా రేడియోలో ప్రవేశపెట్టిందీ నేనే. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది.. నాకు రావలసిన గుర్తింపు రాలేదని. మామయ్య రాసిన ‘మల్లీశ్వరి’ సినిమా పాటలకి హార్మనీ పట్టుకుని ముందుగా బాణీలు కట్టింది కూడా నేనే. ‘పోయిరావే తల్లి’ని పున్నాగ వరాళి రాగంలో ట్యూన్‌ చేశాను. నా పాట విని వాహినిలో పాడతావా అని అడిగారు. వెంటనే ఒప్పుకున్నాను. పాట విని బి.యన్‌.రెడ్డి గారు మెచ్చుకున్నారు. పాట తీసుకున్నారు. రాగాలు నేనే సజెస్ట్‌ చేశాను. ఇదంతా ఎలా జరిగిందంటే.. అక్కడొక పెళ్లిలో ధీరసమీరే యమన్‌ కళ్యాణిలో పాడాను.

ఆ పెళ్లికి వచ్చిన బియన్‌రెడ్డి, కెవిరెడ్డి, నాగిరెడ్డి అందరూ ముగ్ధులయ్యారు. ముందర నన్ను సినిమాలో నటించమని కోరారు. కాని నేను నటించను పాడతాను అని చెప్పాను. ధీరసమీరే లాంటిది కావాలన్నారు. అప్పుడు వచ్చినదే ‘మనసున మల్లెల మాలలూగెనే’. అది నా ట్యూనే. అప్పటివరకు నేను కేవలం మామయ్య పాటలకే రాగాలు కట్టాను. మల్లీశ్వరి పాటలు విన్న యం.వి.శాస్త్రిగారు పాటలన్నీ అనసూయ నోట విన్నట్టుగానే ఉంది అన్నారు. మల్లీశ్వరి ఫంక్షన్‌లో అందరూ మామయ్యనీ, మిగిలిన వారినీ అభినందిస్తుంటే నాకు బాధ అనిపించింది. మొట్టమొదటి సంగీత దర్శకురాలిని పరిచయం చేసిన ఘనత వారికి వచ్చేది.

కాని అలా కాకుండా నా రాగాలు వాడుకుని నన్ను పక్కన పెట్టేశారు. తరవాత ‘బంగారుపాప’కి చేశాను. పక్కనే స్టూడియోలో ఉన్న ప్రొడ్యూసర్‌ కోరిక మేరకు కోయంబత్తూరు వెళ్లి ‘అగ్గిరాముడు’కి చేశాను. అందులో ఎఎం.రాజా, భానుమతి, సాయి సుబ్బలక్ష్మి చేత పాడించాను. నేను రాగం కట్టిన పాట జనం విని పొగిడితే సరదా. అప్పుడు ఉత్సాహంగా పాడతాను. అలాగే అలంకరణ బాగా సరదా. నా వీలునామాలో నన్ను ఎర్రచీరతో అలంకరించి, తల నిండా పూలు పెట్టి నా అంతిమయాత్ర సాగించాలని రాసుకున్నాను.

Advertisement
 
Advertisement