రాణులకాలం వస్తోంది

All of the restaurants are going to change the theme - Sakshi

రెస్టారెంట్‌ 

రాజుల కాలం నాటి సెట్టింగులతో అమెరికాలో ‘మెడీవల్‌ టైమ్స్‌’ అని తొమ్మిది రెస్టారెంట్‌లు ఉన్నాయి. 1983 నుంచీ ఉన్నాయి. అవన్నీ కూడా కోటల్లా ఉంటాయి. వాటిలోకి వెళ్లి ఫుడ్‌ని ఎంజాయ్‌ చేస్తూ మధ్యయుగాలనాటి పోరాట సన్నివేశాలను, కత్తి యుద్ధాలను చూడొచ్చు. అప్పటి యుద్ధ క్రీడల్ని కూడా లోపలి స్టాఫ్‌ ఆర్టిస్టులు ప్రదర్శిస్తుంటారు. డిన్నర్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే సంపన్న విలాసవంతులకు ఇవి మంచి కాలక్షేపం. రాజులు, మంత్రులు, గుర్రాలు, విలు విద్యలు, రంగస్థల నాటకాలు అన్నీ అక్కడే! తొమ్మిది రెస్టారెంట్‌లలో కలిపి దాదాపు పది వేల మందికి పైగా సిబ్బంది ఉంటారు. అవసరాన్ని బట్టి అక్కడివారు ఇక్కడికి మారుతుంటారు. ఫ్లారిడా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, టెక్సాస్, ఆంటారియో, సౌత్‌ కరోలినా, మేరీల్యాండ్, జార్జియా.. ఈ తొమ్మిది చోట్లా రాజులూ, రాజ్యాలే థీమ్‌. ఏడాది పొడవునా రెస్టారెంట్‌ టేబుళ్లు భార్యాభర్తల్తో, పిల్లాజెల్లల్తో, బ్యాచిలర్‌లతో కిటకిటలాడుతుంటాయి. ఏడాదికి 25 లక్షలమంది కస్టమర్లు వచ్చిపోతుంటారు.

విషయం ఏంటంటే.. ఇప్పుడీ రెస్టారెంట్‌లన్నీ థీమ్‌ని మార్చుకోబోతున్నాయి. ఇంతవరకు లోపల సింహాసనాలపై రాజులు కూర్చునేవారు. ఇప్పుడు రాణులు కూర్చొని ఈ చెయిన్‌ రెస్టారెంట్‌లలో రాజ్యపాలన చేయబోతున్నారు. అంటే.. కస్టమర్‌లకు ఎప్పుడూ కనిపించే రాజులు కాకుండా, ఇంతవరకు కనిపించని రాణులు ప్రత్యక్షమౌతారు. ఆ విధంగా థీమ్‌ని మార్చేసుకుంది.. ‘మెడీవల్‌ టైమ్స్‌’ గ్రూపు. ‘‘అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే మేమూ మా ప్రాధాన్యాన్ని పెంచుకోవాలనుకున్నాం’’ అని కంపెనీ ఓనర్లు అంటున్నారు. అయితే ఇక్కడికి తరచూ వచ్చే మగధీరులు కొందరు మాత్రం.. ‘సీట్లో రాజుగారు ఉంటే ఆ కిక్కే వేరప్పా’ అని పెదవి విరుస్తున్నారు. రాణిగారి పాలనను చూశాకైనా వీళ్లు మనసు మార్చుకుంటారేమో చూడాలి. మోడలింగ్‌లోకి కొత్తగా వచ్చిన హాలీవుడ్‌ అమ్మాయిల్ని రాణులుగా ఎంపిక చేసుకునే పనిలో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాయి ఈ రెస్టారెంట్‌లు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top