క్రేజీ కపుల్‌ భారత యాత్ర!

Alan, Pat Braithwaite Decided To Travel Across India - Sakshi

వయసేమో డెబ్భయ్‌ మూడు. గుండె ఆపరేషన్‌ జరిగి నెలలు కూడా కాలేదు. ఇంతలోనే... మూడు చక్రాల కారేసుకుని... దేశం కాని దేశమంతా తిరిగేస్తానని ఎవరైనా అంటే మీరేమంటారు? మతిగానీ పోయిందా? అనేస్తాం. ఒకరు కాకుండా ఓ జంట ఇలా బయలుదేరితే.. క్రేజీ కపుల్‌ అనాల్సిందే. వాళ్లే..

అలన్‌ బ్రాత్‌వెయిట్, పాట్‌ బ్రాత్‌వెయిట్‌!
అరవై ఏళ్ల తరువాత జీవితం చివరకు వచ్చేసినట్లే అని భూమికి ఒక దిక్కున ఉన్న వాళ్లు అనుకుంటారు. కానీ మరో దిక్కున ఉన్న వాళ్లకు మాత్రం అప్పుడే అసలైన జీవితం మొదలైనట్లు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం అలన్, పాట్‌ బ్రాత్‌వెయిట్‌ దంపతులు. బ్రిటన్‌కు చెందిన వీరు నాలుగు రోజుల క్రితం భారత్‌లో ఓ సాహసయాత్ర మొదలుపెట్టారు. సాహసయాత్ర అని ఎందుకు అనాల్సి వస్తుందంటే.. కచ్చితంగా మూడు నెలల క్రితమే ఆలన్‌కు ఓపెన్‌హార్ట్‌ సర్జరీ జరిగింది. విమానం ఎక్కవచ్చు అని డాక్టర్లు సర్టిఫై చేయడమే తడవు.. రెండేళ్లుగా వీరు చాలా జాగ్రత్తగా, ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేసుకున్న ‘ద ట్రాన్స్‌ ఇండియా ఛాలెంజ్‌’ కోసం భారత్‌కు విచ్చేశారు.

ఫిబ్రవరి ఒకటవ తేదీ వీరి సాహసయాత్రకు కావాల్సిన మూడు చక్రాల కారు ముంబైకి చేరుకుంది. మీరు చదివింది కరెక్టే.. ఎప్పుడో 1909లో నిర్మించి.. 2011లో మళ్లీ లాంచ్‌ చేసిన మూడు చక్రాల ‘మోర్గన్‌’ కారులోనే వీరు భారత్‌ మొత్తం తిరిగేయనున్నారు. ముంబై నుంచి బయలుదేరిన అలన్, పాట్‌లు సోమవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా బిట్రిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌  ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ క్రేజీ కపుల్‌ తమ సాహసయాత్ర తాలూకూ ఉద్దేశాలు.. వివరాలు వెల్లడించారు.

మోర్గన్‌ను చూపించాలనే..!
నిజానికి అలన్, పాట్‌లకు భారత్‌ కొత్తేమీ కాదు. అలన్‌ వాళ్ల అమ్మ కర్ణాటకలోని బెల్గామ్‌ లో జన్మిస్తే అమ్మమ్మ పుట్టింది మైసూరులో.  తాత, అమ్మమ్మల పెళ్లి జరిగింది ముంబైలోనైతే.. అలన్‌ తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంది సిమ్లాలో. అప్పట్లో అలన్‌ తండ్రి బ్రిటిష్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారి. ఈ నేపథ్యంలో తాము గతంలో రెండుసార్లు (2013, 2017) ఇండియాకు.. మరీ ముఖ్యంగా బెల్గామ్‌కు వచ్చామని అలన్‌ తెలిపారు.

2017లో బెల్గామ్‌ నుంచి కేరళకు వెళుతూండగా.. బెంగళూరుకు చెందిన కొందరు హ్యార్లీ డేవిడ్‌సన్‌ మోటర్‌బైక్‌లలో ఆయనకు ఎదురయ్యారు.  ‘‘ఆ మోటర్‌ బైక్‌ల చేస్తున్న ధ్వనులు.. నడుపుతున్న వారి ఉత్సాహం చూసిన నాకు.. అకస్మాత్తుగా వీళ్లకు.. బ్రిటన్‌లో తయారైన మోర్గన్‌ కార్లు చూపించాలి అనిపించింది’’ అంటారు అలన్‌. అలా ఈ ట్రాన్స్‌ ఇండియా ఛాలెంజ్‌కు బీజం పడిందన్నమాట!

‘ద ట్రాన్స్‌ ఇండియా ఛాలెంజ్‌’ లో భాగంగా  మోర్గన్‌ కారులో హైదరాబాద్‌ చేరుకున్న  అలన్, పాట్‌ బ్రాత్‌ వెయిట్‌ దంపతులు

స్వచ్ఛంద సంస్థ గూంజ్‌ కోసం
మోర్గన్‌ కారులో భారత్‌లో తిరగాలన్న ఆలోచన మొదలైన తరువాత ఈ యాత్రకు ఏదైనా ఒక లక్ష్యం ఉండాలని అలన్‌ నిర్ణయించుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ’గూంజ్‌’ ఆయన కళ్లల్లో పడింది. నగరాలు వ్యర్థాలుగా పారబోసే వస్తువుల సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు, గ్రామీణులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తున్న ‘గూంజ్‌’ కోసం రెండు లక్షల పౌండ్ల (1.86 కోట్ల రూపాయలు) నిధులు సేకరించాలని అలన్, పాట్‌లు నిర్ధారించుకున్నారు.

తమ సాహసయాత్రకు సంబంధించిన డాక్యుమెంటరీని తీసి దాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ప్లాట్‌ఫార్మ్‌లకు అమ్మగా వచ్చే డబ్బును గూంజ్‌కు ఇవ్వాలన్నది ప్లాన్‌. తద్వారా గూంజ్‌ చేస్తున్న పనుల గురించి భారత్‌తోపాటు ప్రపంచమంతా తెలుస్తుందని.. వాళ్లు తమ కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చునని అలన్‌ తెలిపారు. దీంతోపాటు రాల్ఫ్‌ లారెన్, మోర్గన్‌ మోటర్‌ కంపెనీ, యూకే విదేశీ, కామన్వెల్త్‌ కార్యాలయాలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి.

ఇదీ ప్రస్థానం..!
భారత్‌లో 34 రోజుల్లో 5600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నది అలన్, పాట్‌ల ప్రణాళిక. ముంబై నుంచి హైదరాబాద్‌... అక్కడి నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రి.. ఆ తరువాత విశాఖకు యాత్ర కొనసాగుతుంది. విశాఖ నుంచి కోల్‌కతా.. అక్కడి నుంచి న్యూఢిల్లీ వెళతారు. దేశ రాజధాని నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని పాల్‌గర్‌ వచ్చి ఆ తరువాత ముంబైకి చేరడంతో యాత్ర ముగుస్తుంది.

యాత్రను చిత్రీకరించేందుకు అలన్, పాట్‌ల మోర్గన్‌ కారును మరికొన్ని వాహనాలు అనుసరిస్తూంటాయి. నాలుగు రోజుల యాత్ర అనుభవాలేమిటన్న ప్రశ్నకు అలన్‌ సమాధానమిస్తూ.. ఆగిన ప్రతిచోట జనాలు బోలెడన్ని సెల్ఫీలు తీసుకుంటున్నారని ఈ లెక్కన చూస్తే తన యాత్ర సఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు. రహదారులు కొన్నిచోట్ల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మొత్తమ్మీద యాత్ర సజావుగానే సాగుతోందని ముక్తాయించారు. – గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top