డిస్కౌంటే దెబ్బతీసింది

Adjest have been kidnapped - Sakshi

వాళ్లు 20 అడిగారు వీళ్లు 10 పోగు చేశారు వాళ్లు అడ్జస్ట్‌ అయిపోయారు కిడ్నాప్‌ ఫుల్‌గా చేశారు విడుదలకు 50% డిస్కౌంట్‌ ఇచ్చారు ఈ డిస్కౌంటే దెబ్బతీసింది

ఆశ మనిషిని అందలం ఎక్కిస్తుంది.అత్యాశ అగాధానికి తోసేస్తుంది.2005, అక్టోబరు 12. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంసాయంత్రం 5 గంటల సమయంస్టీల్‌ ప్లాంట్‌ గేటులోంచి హోండాసిటీ కారు బయల్దేరింది. మెయిన్‌ రోడ్డు ఎక్కి అనంతపురం వెళ్లే రోడ్డు మీదుగా రయ్‌మంటూ దూసుకుపోతోంది కారు. ఉదయం నుంచి పని ఒత్తిడితో ఉన్న ఇంజనీర్‌ అనిరు««ద్‌(పేరు మార్చడమైనది) వెనుక సీట్‌లో చేరగిలబడ్డాడు.కార్‌ డ్రైవర్‌ రఘు మ్యూజిక్‌ ఆన్‌చేశాడు. స్పీకర్స్‌ నుంచి వస్తున్న పాటలు పని ఒత్తిడి నుంచి రిలీఫ్‌ ఇస్తున్నట్టుగా అనిపించింది అనిరు«ద్‌కి. ‘ర ఘూ..వాల్యూమ్‌ పెంచు’ అన్నాడు అనిరు«ద్‌. 
వాల్యూమ్‌తో పాటు కారు స్పీడ్‌ కూడా పెంచాడు రఘు. హైవే కావడంతో ప్రయాణంలో కుదుపులు లేవు. సీట్‌కి తల ఆన్చి, కళ్లు మూసుకుని పాటలను ఆస్వాదిస్తున్నాడు అనిరు«ద్‌.  ఇంకో అరగంటలో అనంతపురం వస్తుందనగా కార్‌ స్లో అయ్యింది. కారు అద్దాలు ధడేల్‌ ధడేల్‌మని కొడుతున్నారెవరో.. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు అనిరు«ద్‌. కారు ఆగిపోయింది. కారు అద్దాలు కిందకు దించాడు రఘు. నలుగురు ఆగంతుకులు కారును చుట్టుముట్టి ఉన్నారు. వాళ్ల ముఖాలకు మంకీ క్యాప్స్‌ వేసున్నాయి. ఎవరన్నది తెలియడం లేదు. మొదటివాడు రఘు కణతికి రివాల్వర్‌ ఎక్కుపెట్టాడు కారు డోర్‌ తెరవమన్నట్టు. రఘు భయంగా కారు డోర్‌ తెరిచాడు. రఘు ముఖం మీద, వీపు మీద బలంగా కొట్టాడతను. అనిరు«ద్‌ వణికిపోయాడు.‘ఏయ్‌..! ఎవరు మీరు, ఏం కావాలి..’ అరుస్తుండగా మిగతా డోర్లు తెరుచుకున్నాయి. అనిరుద్‌ నోరు నొక్కేశారు వాళ్లు. అనిరు«ద్‌ని ఊపిరి తీసుకోనివ్వంతగా కొడుతూనే ఉన్నారు. డ్రైవర్‌కి పిస్టల్‌ ఎక్కుపెట్టిన అతను ‘చెప్పిన ప్లేస్‌కు పోనివ్వు. లేదంటే ఇద్దరూ ఛస్తారు’ అన్నాడు. వాళ్లు చెప్పినట్టు వినాల్సిన తప్పనిస్థితి. కారును ఎటు తిప్పమంటే అటు డ్రైవ్‌ చేస్తున్నాడు రఘు.మెయిన్‌ రోడ్‌ వదిలి ఓ సన్నని మట్టి రోడ్డు మీదుగా కారు బయల్దేరుతోంది.  

రెండు రోజులు గడిచాయి. పావని ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అనిరు«ద్‌ ఫోన్‌ ‘నాట్‌ రీచబుల్‌’ అనే వస్తోంది. వెంటనే ఈ విషయం ఫోన్‌ చేసి తన తమ్ముడికి చెప్పింది. ‘నాకు భయంగా ఉందిరా! మీ బావగారు ఇలా ఇన్ఫర్మేషన్‌ చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు’ ఏడుస్తూ చెబుతున్న అక్కకు ధైర్యం చెబుతూ ఊరి నుంచి బయల్దేరాడు పావని తమ్ముడు వివేక్‌. అతను చండీగడ్‌లో ఉంటాడు. రావడానికి ఎంత లేదన్నా రోజుకు పైగా పడుతుంది. ‘అమ్మా..! నాన్న ఎప్పుడొస్తాడు’ అని అడుగుతున్న పిల్లలకు నచ్చచెబుతూ బిక్కు బిక్కుమంటూ క్షణాలను యుగాలుగా గడుపుతోంది పావని.మూడవ రోజు పావని ఇంట్లో ఫోన్‌ మోగింది. ‘నీ మొగుడు నీకు దక్కాలంటే మేం చెప్పినట్టు నువ్వు వినాలి’ అన్నది అవతలి కంఠం.వణుకుతున్న గొంతుతోనే ‘ఏమిటో చెప్పండి’ అంది పావని.‘నీ మొగుడు మా దగ్గరే ఉన్నాడు. ఇరవై లక్షలు ఇస్తే సరే, లేదంటే చంపేస్తాం..’ ఆ మాటలకు పావని గొంతు తడారిపోయింది.  ‘ఈ విషయం పోలీసులకు చెప్పావో.. నీ మొగుడ్ని ఇప్పుడే చంపేస్తాం’ అన్నాడతను.‘ఏర్పాటు చేస్తా! ఎవరికీ చెప్పను. ఆయన్నేం చేయద్దు ప్లీజ్‌..’ ఫోన్‌లోనే వేడుకుంది పావని. ‘డబ్బు సిద్ధం చేసి ఉంచు. మళ్లీ ఫోన్‌ చేస్తాం. ఆ డబ్బు ఎలా ఇవ్వాలో చెబుతాం’ అన్నాడు అతను.‘సరే!’ అనగానే ఫోన్‌ కట్‌ అయ్యింది.పావనికి ఏం చేయాలో అర్ధం కాలేదు. కాసేపు అలాగే స్తబ్దుగా కూర్చుండిపోయింది. పోలీసులకు చెబితే.. అమ్మో! అనిరు«ద్‌కి ఏమైనా జరిగితే... ఆ ఊహే భరించలేకపోయింది. తమ్ముడితో చెబుదామనుకుంది. ‘వాడు.. ఊరుకోడు వెంటనే పోలీసులకు ఫోన్‌ చేస్తాడు, వద్దు’ అనుకుంది.ఇంట్లో ఉన్న క్యాష్‌ లెక్కించింది.. బ్యాంకులోని అమౌంట్‌ తీసుకొచ్చింది., మార్వాడీ కొట్టులో బంగారం తాకట్టు పెట్టింది. తెలిసినవారిని అడిగి డబ్బు తీసుకుంది. అంతా కలిపితే పది లక్షలు అయ్యాయి. 

20 లక్షలు అంటే మాటలు కాదు. ఎలా? ఆ కిడ్నాపర్స్‌ ఈయన్ని చంపేస్తారేమో! వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోన్‌నే చూస్తూ కూర్చుంది. కిడ్నాపర్‌ చెప్పిన టైమ్‌కి ఫోన్‌ మోగింది. పావని కంగారుగా ఫోన్‌ ఎత్తింది. ‘డబ్బు సిద్ధం అయ్యిందా!’ కరుకుగా వినపడింది అవతలి గొంతు.‘అంత ఇచ్చుకోలేను. ఉన్నదంతా ఊడ్చి, తెలిసినవారిని అడిగితే అంతా కలిపి పది లక్షలు జమ అయ్యింది’ ఏడుస్తూనే చెప్పింది పావని. కాసేపు అటు నుంచి మౌనం..  ‘సరే, ఆ డబ్బు మాకు అందజేయి. నీ మొగుడ్ని వదిలేస్తాం’ అన్నారు అవతలివాళ్లు. ‘ఎలా ఇవ్వాలి?’ వెక్కుతూనే అంది పావని.‘మీ కారు డ్రైవర్‌నే పంపిస్తాం, అతనికివ్వు. ఎవరికీ అనుమానం రాదు’ ‘అలాగే’ అంది పావని. మరో గంట తర్వాత డ్రైవర్‌ రఘు వచ్చాడు. అతన్ని చూసిన పావని భయపడింది. రఘు ముఖం వాచిపోయి ఉంది. ఒక చేయికి కట్టు వేసి ఉంది. కుంటుతూ నడుస్తున్నాడు. పావని ఇచ్చిన సూట్‌కేస్‌ తీసుకొని రఘు వెళ్లిపోయాడు. పావని తమ్ముడు వివేక్‌ తాడిపత్రి చేరుకున్నాడు. తమ్ముడిని చూస్తూనే వెక్కుతూ జరిగిందంతా చెప్పింది పావని. అక్క చెప్పినా వినకుండా పోలీస్‌స్టేషన్‌కి దారి తీసాడు వివేక్‌. పోలీస్‌ స్టేషన్‌లో తన భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని తమ్ముడి బలవంతమ్మీద చెప్పింది పావని. కిడ్నాపర్స్‌ గురించి చెప్పకపోవడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని ఎంక్వైరీ మొదలుపెట్టారు.  పావని ఇంటికి చేరేసరికి ఫోన్‌ అదేపనిగా మోగుతోంది. ‘పావనీ.. నేను అనిరు«ద్‌ని. అనంతపురం రైల్వేస్టేషన్‌లో ఉన్నాను. ఇంటికి వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు చెబుతాను’ అన్నాడు. అతని గొంతు నీరసంగా ఉంది. భర్త కోసం పావని కళ్లలో ప్రాణాలు పెట్టుకొని ఎదురుచూస్తోంది.

అనిరుద్‌ ఇల్లు చేరేసరికి పోలీసులు వచ్చి ఉన్నారు. ‘ఏమైంది?!’ అడిగారు పోలీసులు అనిరు«ద్‌ని.‘సార్, ఈవెనింగ్‌ ఆఫీస్‌ నుంచి అనంతపురం బయల్దేరాను. దారిలో ఎవరో నలుగురు దుండగులు మంకీ క్యాపులు వేసుకొని ఉన్నారు. డ్రైవర్‌ని, నన్ను కొట్టి, ఏదో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు వాళ్ల ఆధీనంలోనే ఉన్నాను. ఈ రోజు వదిలిపెట్టారు’ అన్నాడు అనిరు«ద్‌ ఇంకా వదలని భయంతో.‘పది లక్షలు ఇస్తే వదిలేశారు. లేకపోతే చంపేసేవారే’ ఏడుస్తూ అప్పుడు నిజం చెప్పింది పావని. ఆ మాట వినడంతోనే పోలీసులు మరింత అలెర్ట్‌ అయ్యారు. ‘మాకు ముందు ఎందుకు చెప్పలేదు.ఎప్పుడెప్పుడు ఫోన్లు వచ్చాయి. ఎవరు డబ్బు తీసుకెళ్లారు?’ విచారించడం మొదలుపెట్టారు పోలీసులు.‘వాళ్లు నిజానికి 20 లక్షలు అడిగారు. కానీ, పది లక్షలే పోగయ్యాయి అంటే, సరే అన్నారు.కిడ్నాపర్లు మా కారు డ్రైవర్‌నే పంపించారు. అతనికే ఇచ్చి పంపించాను’ అంది పావని. ‘కారు డ్రైవర్‌కి డబ్బులిచ్చారా?! కిడ్నాపర్లు అడిగినంత డబ్బు ఇచ్చినా మరో పది లక్షలు డిమాండ్‌ చేస్తారు. అలాంటిది పది లక్షలు తగ్గించారా! సగం రేటుకి రిలీజ్‌ చేయడానికి ఇదేమైనా డిస్కౌంట్‌ ఆఫ్‌రా! తెలిసినవారి పనే అయ్యుండాలి. ఇదే అసలైన క్లూ. అయితే, అది ఎవరో నిర్ధారించాలి?’ పోలీసులు ఆలోచనలో పడ్డారు. అంతలో డ్రైవర్‌ రఘు అనిరు«ద్‌ ఇంటికి వచ్చాడు. రఘును, అనిరు«ద్‌ని అన్నిరకాల ప్రశ్నించారు పోలీసులు. రఘు, అనిరు«ద్‌లు ఇద్దరూ ఒకే మాట.. ‘ఆ కిడ్నాపర్లు ఎవరో తెలియదు’ అని.
కేసులో ఏ విధమైన పురోగతి కనిపించడం లేదు. ఆ కిడ్నాపర్లను పట్టుకోవడం ఎలా?!  

‘రఘూ, కిడ్నాప్‌ జరిగిన ప్రదేశాన్ని గుర్తించగలవా?’ అన్నారు పోలీసులు. ‘గుర్తించగలను సార్‌’ అనడంతో పోలీసులు అతన్ని తీసుకొని బయల్దేరారు. ‘రఘూ.. నువ్వే డ్రైవ్‌ చేయ్‌’ అన్నారు పోలీసులు. వాళ్లు చెప్పింది చెప్పినట్టు ఆచరించాడు రఘు. కారు హైవే వీదుగా స్పీడ్‌గా వెళుతూ ఉంది. స్పీడ్‌ బ్రేకర్స్‌ దగ్గరకు రాగానే కారు స్లో చేశాడు. అప్పుడే నలుగురు ఆగంతుకులు కారు మీదకు రావడంతో కారును ఆపకుండా స్పీడ్‌గా పోనిచ్చాడు రఘు. ఆ ఆగంతుకులు కారును అందుకోలేకపోయారు. ‘సార్‌! ఎవరో వాళ్లు మీరుండగానే ఇలా జరిగింది... నేను స్పీడ్‌గా డ్రైవ్‌ చేయబట్టి సరిపోయింది. లేకపోతే...’ అంటూ ఆగిపోయాడు రఘు. పోలీసులు ఏదో అర్ధమైనట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘ఇక్కడే సార్‌! ఈ స్పీడ్‌ బ్రేక్స్‌ దగ్గరకు రాగానే కారుని స్లో చేశాను. వీళ్లలాగే ఆ కిడ్నాపర్లూ వచ్చారు. పిస్టల్‌ నా తలకు పెట్టి కారును ఆపమన్నారు. నన్ను బాగా కొట్టి చెప్పిన చోటుకి కారు డ్రైవ్‌ చేయమన్నారు. మా సార్‌ని కూడా కొట్టారు సార్‌. అసలు వాళ్లు మమ్మల్ని చంపకుండా వదిలేస్తారని అనుకోలేదు. ఇప్పుడు ఇలా వచ్చిన వీళ్లెవరో..’ రఘు ఒకదాని వెంట ఒకటి చెబుతూ ఉన్నాడు. ఎస్సై తన సిబ్బంది వైపు చూశారు. తమ బాస్‌ కనుసైగ వారికి అర్ధమైంది. బేడీలు తీసి రఘు చేతికి తగిలించారు. రఘు షాక్‌ తగిలినట్టుగా పోలీసుల వైపు చూశాడు.‘నిజం చెప్పు.. జరిగిందేమిటో మాకర్ధమైంది. నువ్వుగా చెబితే శిక్ష తగ్గుతుంది. లేదంటే.. తెలుసు కదా!’ లాఠీ ఊపుతూ అన్నాడు. ‘నిజం .. సార్‌! స్పీడ్‌ బ్రేక్స్‌ దగ్గర బండి స్లో చేశాను.. వాళ్లు మా మీద దాడి చేశారు’ మొరపెట్టుకున్నాడు రఘు.  ‘మరి ఇప్పుడూ వాళ్లలాగే నలుగురు ఆగంతుకులు (మఫ్టీలో ఉన్న పోలీసులు వారు) అడ్డు వచ్చినా నువ్వు వారిని క్రాస్‌ చేస్తూ స్పీడ్‌గా డ్రైవ్‌ చేశావు కదా! మరి అప్పుడు ఎందుకు చేయలేదు? స్పీడ్‌ బ్రేకర్‌ దగ్గర స్లో చేసినా కారు మూవ్‌ అవుతూనే ఉంటుందిగా. కిడ్నాపర్లు నీ తలకు పిస్టల్‌ ఎంత స్పీడ్‌లో వచ్చి పెట్టి ఉంటారు?! నువ్వే కారు ఆపావని తేలిపోయిందిగా!’ ఎస్సై ఆ మాట అనడంతో రఘుకి తను దొరికిపోయానని అర్ధమైంది. విషయమంతా చెప్పడం మొదలుపెట్టాడు.

‘అనిరుద్‌ ఇంజనీర్‌. వేరే రాష్ట్రం నుంచి వచ్చి మూడేళ్లుగా ఇదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద జీతగాడు. డబ్బు ఉన్నవాడు. అతని దగ్గర ఏడాది నుంచి కారు డ్రైవర్‌గా చేస్తున్నాను. డబ్బున్నవారిని కిడ్నాప్‌ చేస్తే సొమ్ము చేసుకోవచ్చు అని నా స్నేహితులు అంటుంటే ఈ ఇంజనీర్‌ విషయం చెప్పాను. వాళ్లు అతన్ని కిడ్నాప్‌ చేసి, డబ్బు చేసుకుందామన్నారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను ఈజీగా డబ్బు వస్తుంది కదా అని. ఆ రోజు కారులో మేం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళతున్నది నా స్నేహితులకు ముందే చెప్పాను. అనుకున్న చోటుకి నా స్నేహితులు వచ్చి ఉన్నారు. స్పీడ్‌ బ్రేక్స్‌ దగ్గర నేనే కారు ఆపాను. వెనుక సీట్లో కూర్చున్న సార్‌ ఇది గమనించలేదు. అక్కడే వున్న నా స్నేహితులు మా మీద విరుచుకుపడ్డారు. ఇరవై లక్షలు వస్తాయని అనుకున్నాం. కానీ, పదిలక్షలే పోగయ్యాయి అనడంతో దాంతోనే సరిపెట్టుకుందామనుకున్నాం. అనుమానం రాకుండా ఉండేందుకు నా మీద కూడా దాడి జరిగినట్టు నమ్మించాను’ విషయం చెప్పాడు రఘు. రఘు ద్వారా మిగతా నలుగురు నిందితులు ఎక్కడ ఉంటారో తెలుసుకొని, వారినీ పట్టుకుని, కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. ఎవరికీ తెలియకుండా పక్కా ప్లాన్‌ ప్రకారం చేస్తున్నాం అనుకునే నేరస్తులు ఎన్ని నైపుణ్యాలను ప్రదర్శించినా ఏదో ఓ చిన్న క్లూ ద్వారా అయినా పోలీసులకు దొరికిపోతారు. శిక్ష అనుభవిస్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ద్రోహి రఘు. తన యజమాని ముందు తలదించుకున్నాడు. జైలు గోడల మధ్య శిక్షను అనుభవిస్తున్నాడు.
– నిర్మలారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top