జనం కోసం జలయజ్ఞం

27 years and still continuing; Chhattisgarh man fights water shortage

ఓ అడవిలో 15ఏళ్ల బాలుడు గునపం పట్టుకొని తవ్వుతున్నాడు. మొదటిరోజు కొంత లోతు వరకు తవ్వాడు. రెండోరోజు మరికొంత. మూడోరోజు మరికొంత. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాలా 27 ఏళ్లు తవ్వుతూనే ఉన్నాడు. ఇప్పుడు అతని వయసు 42 ఏళ్లు. ఇన్నాళ్లూ విరామం లేకుండా తవ్వుతూనే ఉన్నాడు. ఎందుకంటారా? వాన నీటిని నిల్వ చేసుకోవడం కోసం. వింతగా అనిపిస్తున్నా... ఇది నిజం. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చిన్న గ్రామమైన సజాపహాడ్‌కు చెందిన శ్యామ్‌లాల్‌ అనే యువకుడు చేస్తున్న పోరాటమిది. అవును మరి, ఊరు బాగు కోసం చేస్తున్నాడంటే తప్పకుండా అది పోరాటమే కదా. అసలు ఈ శ్యామ్‌లాల్‌ ఎవరు? ఆ తవ్వకాలేంటి? ఆ పోరాటమేంటో తెలుసుకుందాం.

సజాపహాడ్‌ గ్రామంలో రెండంటే రెండే బావులుండేవి. దాంతో ఆ ఊరి జనమంతా తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు లేక అష్టకష్టాలూ పడేవారు. చివరికి పశువులకు పెట్టాలన్నా నీళ్ల కరువు ఉండేది. అదంతా చూసి శ్యామ్‌లాల్‌ అనే కుర్రాడికి బాధేసింది. ఆ బాధలో నుంచే ఓ ఆలోచన వచ్చింది. ఊళ్లో ఓ చెరువును తవ్వితే... అందులోకి వర్షపు నీరు చేరితే, ప్రజలకు నీటికొరత ఉండదు కదా అనుకున్నాడు. ఆ విషయాన్నే చాలామందితో చెప్పాడు. తనకేదో పిచ్చిపట్టిందన్నారు అక్కడి ప్రజలంతా. ఇంకా వారితో లాభం లేదనుకున్నాడు. ఒక్కడే ఓ గునపాన్ని పట్టుకొని, గ్రామానికి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు. అలా 27 ఏళ్లుగా తవ్వుతూనే ఉన్నాడు. ఒక ఎకరం విస్తీర్ణంలో 15 అడుగుల లోతులో ఉన్న ఈ చెరువు ఇప్పుడు ఊరి ప్రజల దాహాన్ని తీరుస్తోంది.

‘‘27 ఏళ్లకు ముందు చెరువును తవ్వుదాం, నాకు సాయం చేయండని ఎంతమందిని అడిగినా, ఎవరూ ముందుకు రాలేదు. చివరికి అధికారులు, ప్రభుత్వం కూడా మా ఊరిని పట్టించుకోలేదు. మా ఊరివారంతా నన్నొక పిచ్చివాడిలా చూశారు. అయినా నేను అనుకున్నది కచ్చితంగా చేయాలనుకున్నాను. అందుకే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, ఆపకుండా తవ్వుతూనే ఉన్నాను. ఇప్పుడు అందులోని నీరు మా ఊరి వాళ్ల బాధను తీరుస్తోంది. దానికి నాకెంతో ఆనందంగా ఉంది’’ అని గొప్పగా చెబుతుంటాడు శ్యామ్‌లాల్‌.శ్యామ్‌లాల్‌ కృషి ఈ మధ్యే బయటి ప్రపంచానికి తెలుస్తోంది. ఇటీవలే అక్కడి స్థానిక ఎమ్మెల్యే శ్యామ్‌ బిహారీ జైశ్వాల్‌ ఆ గ్రామాన్ని సందర్శించి, శ్యామ్‌లాల్‌ను అభినందించి రూ.10,000 అందించారు. ఇలా ఊరి ప్రజల అవసరాలను తెలుసుకొని, తన జీవితంలోని ఎన్నో ఏళ్లను ఆ పనికి కేటాయించిన శ్యామ్‌లాల్‌ అందరికీ ఆదర్శమే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top