రంగు భళా.. రక్షణ ఇలా

Tips for holi celebrations - Sakshi

సాక్షి, సిటీబ్యూరో  : రంగులతో ఆడుకోవడం.. ఈ పండగ ప్రధాన ఆకర్షణ. రంగులుపరస్పరం చల్లుకోవడం,రంగు నీళ్లలో మునిగితేలడం... ఇవి లేని హోలీ లేదు. ఒక్క రంగు అంటేనే అందం.. ఇక అన్ని రంగులు కలిస్తే అందమే ఆనందం. అందుకే హోలీ అందమైన పండగ. ఇందులో యువతీయువకుల సంబరం మరింత ఎక్కువ. అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా సాగే ఈ సంబరంలో... ఎలాంటిచెడు మనకి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు సిటీకి చెందిన కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్, కాస్మొటాలజిస్ట్‌ డాక్టర్‌ వాణి. ముఖ్యంగా ఈ పండుగసమయంలో అత్యధిక ప్రభావానికి లోనయ్యే చర్మాన్ని, వెంట్రుకలను సంరక్షించుకోవడంపై ఆమె అందిస్తున్నసలహాలివీ...

రంగులతో ఆడుకునే ముందు తగినంత నూనెను చర్మానికి దట్టించాలి. ఈ ఆయిల్‌.. నీటి ఆధారిత రంగుల ప్రభావాన్ని తిప్పికొడుతుంది. చర్మానికి రంగు గాఢంగా అంటకుండా చూస్తుంది.
ఎండలో ఆడతారు కాబట్టి.. ఆటకు కనీసం 20 నిమిషాల ముందుగా సన్‌స్క్రీన్‌ అప్లయ్‌ చేయడం మంచిది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఎస్పీఎఫ్‌ శాతం 30 కన్నా ఎక్కువ మొత్తంలో ఉన్నసన్‌స్క్రీన్‌ మంచిది. అదే విధంగా సరిపడా మాయిశ్చరైజర్‌ని శరీరం మీద అప్లయ్‌ చేయడం ద్వారా చర్మం హైడ్రేట్‌ కాకుండా కాపాడుకోవచ్చు.  
గోళ్లకు నెయిల్‌ వార్నిష్‌లను రక్షణ కవచంగా ఉపయోగిస్తే రంగులు గోళ్లను పాడుచేయకుండా జాగ్రత్త పడొచ్చు.
కంట్లో గాఢమైన రసాయనాలు కలిసిన రంగులు పడితే చూపునకు హానికరంగా పరిణమిస్తుంది. కంటికి రక్షణ అందించే కళ్లద్దాలు తప్పనిసరిగా వాడాలి. అయితే కాంటాక్ట్‌ లెన్స్‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడం మంచిది కాదు. 
మనం ఎంతో మురిపెంగా చూసుకునే హెయిర్‌ స్టైల్‌ను కూడా పాడు చేసే శక్తి ఈ రంగులకు ఉంది. అలాగే తల మీద చర్మానికి కూడా హాని చేస్తాయి. అందుకని హెయిర్‌ని గట్టిగా దగ్గరకి అల్లి బన్‌ తరహాలో ముడేయాలి. తద్వారా వీలున్నంతగా నష్టాన్ని తగ్గించొచ్చు.
ఎండ వేడికి హైడ్రేట్‌ అయిన చర్మం మరింత తేలికగా దుష్ప్రభావానికి లోనవుతుంది. కాబట్టి.. పండ్ల రసాలు, మంచి నీరు లేదా గ్లూకోజ్‌ వాటర్‌ బాగా తీసుకోవాలి. 
ఫుల్‌ నెక్‌ లేదా ఫుల్‌ స్లీవ్స్‌ ఉన్న దుస్తులు వినియోగిస్తే మంచిది. ఎంత వరకు వీలైతే అంత వరకు నేరుగా రంగులు చర్మాన్ని తాకకుండా జాగ్రత్తపడితే మంచిది. 
హోలీకి ముందుగా వ్యాక్స్‌ (వెంట్రుకలనుతొలగించడం) చేయించుకోవద్దు. సున్నితంగా ఉన్న చర్మం మరింత త్వరగా రంగులప్రభావానికి గురవుతుంది.  
రంగుల్లో తడిసిన కారణంగా ఏదైనా అలర్జీ లాంటి రియాక్షన్‌ కలిగినట్టు గమనిస్తే... అలర్జీ సోకిన ప్రాంతాన్ని స్వచ్ఛమైన చల్లని నీటితో కడగాలి. అవసరాన్ని బట్టి సమీపంలోని చర్మ వైద్యులను సంప్రదించాలి. 
పండగ సందడి ముగిశాక, వీలైనంత త్వరగా సున్నితమైన క్లీన్సర్స్‌ను ఉపయోగించి చర్మంపై పేరుకున్న రంగుల్ని తొలగించుకోవాలి. దీనికి గాఢమైన ఆల్కలీ సబ్బులు లేదా షాంపులు వాడితే అవి మరింతగా చర్మంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top