ఓటు ఉన్న వారిందరూ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకునేలా ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఓటు ఉన్న వారిందరూ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకునేలా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఏప్రిల్ లో జరగనున్న పరిషత్ ఎన్నికలు, మే నెల ఏడో తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటుంది.
ఎన్నికల సంఘం మంజూరు చేసిన ఓటు గుర్తింపు కార్డు లేక పోయినా ఓటరు జాబితాలో పేరు ఉంటే వారందరూ ఓటు వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా 13 గుర్తింపు కార్డులను ఎంపిక చేసి ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని.. ఈ మేరకు ఓటర్లకు చైతన్యం కల్గించమని ఆదేశించింది.
దీంతో ఓటు ఉండీ గుర్తింపు కార్డు లేకపోతే ఓటర్లు ఆందోళన చెందనవసరం లేదు. ఈ కారణంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని నిరాశ పడాల్సిన అవసరం లేదు. జాబితాలో ఓటు హక్కు ఉంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన 13 కార్డుల్లో ఏ ఒకటి ఉన్నా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు.