‘సప్తదళ’ కమలం..! | TDP party,BJP party tie up each other... | Sakshi
Sakshi News home page

‘సప్తదళ’ కమలం..!

Apr 3 2014 3:08 AM | Updated on Mar 29 2019 5:57 PM

భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పక్షాల మధ్య ‘పొత్తు’ పొడిస్తే తమ వరకూ 7 స్థానాలను దక్కించుకొని అసెంబ్లీ బరిలో సత్తా చూపాలని ‘కమల దళం’ యోచిస్తోంది.

భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పక్షాల మధ్య ‘పొత్తు’ పొడిస్తే తమ వరకూ 7 స్థానాలను దక్కించుకొని అసెంబ్లీ బరిలో సత్తా చూపాలని ‘కమల దళం’ యోచిస్తోంది. మరో వైపు ‘సైకిల్’ పక్షం సిట్టింగులను మాత్రం వదులుకొనే ప్రశ్నే లేదని ఢంకా బజాయిస్తోంది. మొత్తానికి ఇరు పక్షాలూ ఓ అంగీకారానికి వస్తే చెట్టాపట్టాలేసుకొని ప్రచారానికి నడుంకట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్య ఎన్నికల అవగాహన దాదాపు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇరు పార్టీలు కోరే సీట్లపై ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఐదు, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో మూడు సీట్లను కోరాలని బీజేపీ భావిస్తోంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు జిల్లాలో కనీసం ఏడు అసెంబ్లీ సీట్లు దక్కించుకోవాలనే దృఢ నిర్ణయం పార్టీ జిల్లా నాయకుల్లో కనిపిస్తోంది.
 
 మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో షాద్‌నగర్, నారాయణపేట, మహబూబ్‌నగర్, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలు బీజేపీ నాయకులు కోరే జాబితాలో ఉన్నాయి. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, వనపర్తి లేదా గద్వాలలో ఒక అసెంబ్లీ స్థానాన్ని కోరే అవకాశం వుంది.
 
 అయితే మక్తల్, కొడంగల్, వనపర్తిలో తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో షాద్‌నగర్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, గద్వాల స్థానాలు కేటాయించేందుకు టీడీపీ సుముఖత చూపుతుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్న కొడంగల్ లేదా మక్తల్‌లో ఏదో ఒక స్థానం కోసం బీజేపీ పట్టుబట్టే అవకాశం వుంది. కనీసం సగం అసెంబ్లీ స్థానాలు సాధిస్తే తప్ప తమ పార్టీ నేతలకు న్యాయం చేయలేమని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టే పరిస్థితి టీడీపీలో కనిపించడం లేదు.
 
 అభ్యర్థుల జాబితా ఖరారు?
 ఓ వైపు టీడీపీతో ఎన్నికల అవగాహనకు ప్రయత్నిస్తూనే మరోవైపు అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేసినట్లు సమాచారం. షాద్‌నగర్ నుంచి శ్రీవర్దన్‌రెడ్డి, నారాయణపేట నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ నుంచి కొండయ్య , కొడంగల్ నుంచి నాగూరావు నామాజి పేర్లు ఖరారు చేశారు.
 
 
 మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. దీంతో నాగర్‌కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్వకుర్తి నుంచి ఆచారి, వనపర్తి నుంచి వెంకటరెడ్డి, గద్వాల నుంచి రాజశేఖర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే పొత్తులో పార్టీకి దక్కే సీట్లపైనే బీజేపీ అభ్యర్థుల భవితవ్యం ఆధార పడేలా వుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement