‘ఉక్కు మహిళ’కు ఓటు లేదు! | 'Iron Lady' and do not vote! | Sakshi
Sakshi News home page

‘ఉక్కు మహిళ’కు ఓటు లేదు!

Apr 23 2014 4:08 AM | Updated on Aug 14 2018 4:21 PM

‘ఉక్కు మహిళ’కు ఓటు లేదు! - Sakshi

‘ఉక్కు మహిళ’కు ఓటు లేదు!

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సాక్షిగా ఓ ఉద్యమ తరంగం ఓటు హక్కు ‘చట్టబద్ధ అణచివేత’కు గురైంది! హత్యలు, అత్యాచారాలు, దోపిడీల వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వ్యక్తులు జైళ్ల నుంచి సైతం పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అభ్యంతరం చెప్పని ఎన్నికల కమిషన్..

చట్టం పేరిట ఇరోం షర్మిల ఓటు హక్కును అడ్డుకున్న ఈసీ
సార్వత్రిక ఎన్నికల సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం
 

 ఇంఫాల్: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సాక్షిగా ఓ ఉద్యమ తరంగం ఓటు హక్కు ‘చట్టబద్ధ అణచివేత’కు గురైంది! హత్యలు, అత్యాచారాలు, దోపిడీల వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వ్యక్తులు జైళ్ల నుంచి సైతం పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అభ్యంతరం చెప్పని ఎన్నికల కమిషన్... సామాన్యుల తరఫున దశాబ్ద కాలానికిపైగా అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఓ మానవ హక్కుల కార్యకర్తకు మాత్రం నిబంధనల పేరుతో ఓటును దూరం చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో 13 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు ఎన్నికల అధికారులు ఓటు హక్కు నిరాకరించారు.

ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందంటూ గత ఎన్నికల్లో ఓటేయని ఆమె ఈసారి ఓటేసేందుకు ముందుకొచ్చినా ఆమెను చట్టం పేరు చెప్పి అడ్డుకున్నారు. షర్మిల నిరవధిక నిరాహార దీక్షకు దిగడంతో ఆమెపై పోలీసులు ఆత్మహత్య అభియోగాలు నమోదు చేశారు. ఈ అభియోగం కింద ఆమెను ఏక బిగువన ఏడాదిపాటు జైల్లో పెట్టే వీలుంది. షర్మిల బలహీనంగా ఉండటంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఓ ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 62 (5) ప్రకారం జైల్లో ఉండే వ్యక్తికి ఓటేసే హక్కు లేదు. ఈ నిబంధన కారణంగానే షర్మిలకు మణిపూర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించలేకపోయినట్లు ఓ అధికారి చెప్పారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement